రాష్ట్ర రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా నియోజకవర్గాల పునర్విభజన
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజకీయ వర్గాల్లో నియోజకవర్గాల పునర్విభ జన హాట్ టాపిక్‌గా మారింది. రానున్న సాధారణ ఎన్నికలకు ముందే డీలిమిటేషన్ జరుగుతుందనే సమాచారంతో.. పల్లె, పట్నం, చిన్నా, పెద్దా రాజకీయ నేతలనే తేడా లేకుండా పునర్విభజన గురించిన చర్చే జరుగుతోంది. మంగళవారం అసెంబ్లీ లాబీల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, జర్నలిస్టులు, అధికారులు కూడా ఈ అంశంపైనే ఎక్కువగా మాట్లాడుకోవడం కన్పించింది. ముఖ్యంగా సెంట్రల్, నార్త్, సౌత్ తెలంగాణల్లో ఎక్కడ ఎన్ని అసెంబ్లీ సీట్లు పెరుగుతాయనే దానిపై ఆసక్తి నెలకొంది.
2011 జనాభా లెక్కల ప్రకారం పునర్విభజన జరిగితే సెంట్రల్ తెలంగాణగా పరిగణించే హైదరాబాద్ చుట్టూ ఉండే మేడ్చల్, శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, పటాన్‌చెరు, కుత్బుల్లాపూర్, ఉప్పల్, ఎల్బీనగర్, రాజేంద్రనగర్, మహేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గాలు విడిపోయి అత్యధిక సంఖ్యలో అసెంబ్లీ స్థానాలు ఏర్పడే అవకాశం ఉంది. దీంతో సెంట్రల్ హైదరాబాద్ ఓటర్లను ఆకర్షించగలిగే పార్టీలు సులువుగా అధికారం దక్కించుకునే విధంగా రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రం మారిపోతుందనే చర్చ జరుగుతోంది.
నియోజకవర్గాల జనాభాలో మార్పు
రాష్ట్రంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ తర్వాత మొత్తం 33 జిల్లాలు ఏర్పడ్డాయి. వీటికి కేంద్ర ప్రభుత్వ ఆమోదం కూడా లభించింది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా జరిగే పునర్విభజన ఆయా జిల్లాల పరిధిలోనే ఉండనుంది. కొత్త జిల్లాల వారీగా అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని, ఈ మేరకు నియోజకవర్గాల జనాభాలో మార్పు ఉంటుందని, ఇందుకోసం ప్రత్యేక అనుమతి తీసుకుంటారనేది నిపుణుల భావన.
జిల్లా, రాష్ట్రం యూనిట్‌గా
నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియలో భాగంగా రిజర్వేషన్ల కేటాయింపునకు చాలా కాలంగా ఓ పద్ధతి పాటిస్తున్నారు. ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గాల కోసం జిల్లా యూనిట్‌గా, ఎస్టీ నియోజకవర్గాల కోసం రాష్ట్రం యూనిట్‌గా పరిగణనలోకి తీసుకోనున్నారు. ఈ నేపథ్యంలో ప్రతి జిల్లాలోనూ ఒకటి లేదా రెండు స్థానాలు ఎస్సీలకు రిజర్వు అయ్యే అవకాశాలున్నాయి. ఇక ఎస్టీ రిజర్వుడు స్థానాల విషయానికి వస్తే రాష్ట్రం మొత్తం వారి జనాభా ఆధారంగా మొత్తం స్థానాలను నిర్ధారించి, ఆ మేరకు ఎస్టీల జనాభా ఎక్కువ ఉండే నియోజకవర్గాలను రిజర్వు చేయనున్నారు.
రొటేషన్ పద్ధతిలో మహిళా కోటా
ఈసారి మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కూడా అమలయ్యే అవకాశాలున్న నేపథ్యంలో 60 అసెంబ్లీ స్థానాలు రొటేషన్ పద్ధతిలో రిజర్వు అవుతాయని, పదిహేనేళ్లలో ఈ రొటేషన్ పూర్తయి రాష్ట్రంలోని అన్ని స్థానాలకూ మహిళలు ప్రాతినిధ్యం వహిస్తారని తెలుస్తోంది. అయితే ప్రతిసారి ప్రతి జిల్లాలో ఒకటి నుంచి మూడు స్థానాలు మహిళలకు రిజర్వు అయ్యే అవకాశాలున్నాయి. అదే విధంగా లోక్‌సభ స్థానాల విషయానికి వస్తే ప్రస్తుతమున్న 17కు తోడు అదనంగా పెరిగే 9 స్థానాలు మహిళలకే రిజర్వు కానున్నాయి.
పదవుల సంఖ్యలోనూ మార్పులు
ప్రస్తుతం జరుగుతున్న చర్చకు అనుగుణంగా శాసన, లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ పూర్తయితే, ఆ మేరకు పలు పదవుల సంఖ్య కూడా మారనుంది. ముఖ్యంగా శాసనమండలిలోనూ సగం స్థానాలు పెరుగుతాయని రాజకీయ వర్గాలంటున్నాయి. ప్రస్తుతం తెలంగాణ శాసనమండలిలో 40 మంది సభ్యులుండగా, పునర్విభజన అనంతరం అది 60కి చేరనుంది. దీంతో పాటు తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహించే రాజ్యసభ సభ్యులు కూడా పెరగనున్నారు.
ప్రస్తుతం తెలంగాణ నుంచి ఏడుగురు రాజ్యసభ సభ్యులు ప్రాతినిధ్యం వహిస్తుండగా, పునర్విభజన అనంతరం ఆ సంఖ్య 11కు చేరనుంది. ఇక రాష్ట్ర మంత్రివర్గం సైజు కూడా పునర్విభజన అనంతరం పెరగనుంది. మొత్తం ఎమ్మెల్యేల్లో 15 శాతం మంది మంత్రులుగా పనిచేసే అవకాశం ఉండడంతో ప్రస్తుతం తెలంగాణ కేబినెట్‌లో ముఖ్యమంత్రితో కలిపి మంత్రుల గరిష్ట సంఖ్య 18గా ఉంది.
అంటే ఇప్పుడున్న ఎమ్మెల్యేల్లో 17 మంది మంత్రులుగా పనిచేయవచ్చు. అదే నియోజకవర్గాల పునర్విభజన జరిగితే మంత్రివర్గం సంఖ్య 27కు చేరనుంది. అయితే పునర్విభజన బిల్లుకు, ఇతర అంశాలకు సంబంధం లేని మండలి నుంచి మంత్రివర్గం వరకు ప్రత్యేక బిల్లుల ద్వారా సవరణలు చేసుకోవాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
ఎవరికి లాభం.. ఎవరికి నష్టం?
నియోజకవర్గాల పునర్విభజనతో రాజకీయంగా ఎవరికి లబ్ధి కలుగుతుందనే చర్చ కూడా జరుగుతోంది. అయితే రాజకీయాలకతీతంగా, డీలిమిటేషన్ కమిషన్ నివేదిక ఆధారంగా, జనాభా లెక్కలు, భౌగోళిక సరిహద్దుల ఆధారంగా జరిగే ఈ ప్రక్రియ ద్వారా ఎవరికి లాభం, ఎవరికి నష్టం అనేది ఇప్పటికిప్పుడే చెప్పే అవకాశం లేదని రాజకీయ విశ్లేషకులంటున్నారు.
పునర్విభజన సమయంలో నియోజకవర్గాల కూర్పు, ఆయా నియోజకవర్గాలకు కేటాయించే రిజర్వేషన్లు, నగర ప్రాంతాల్లో పెరిగే స్థానాలు, గ్రామీణ ప్రాంతాల అసెంబ్లీ నియోజకవర్గాల స్వరూపంలో జరిగే మార్పులను బట్టి ఈ లబ్ధిని అంచనా వేయగలుగుతామని చెబుతున్నారు. అయితే సెంట్రల్ తెలంగాణలో సీట్లు భారీగా పెరిగిన పక్షంలో అధికార కాంగ్రెస్ పార్టీ కంటే ప్రతిపక్ష బీజేపీ, బీఆర్‌ఎస్‌లకు కొంత మేలు జరగవచ్చని, గ్రామీణ తెలంగాణలో సీట్లు ఎక్కువగా పెరిగితే కాంగ్రెస్‌కు లబ్ధి చేకూరుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.


