బీఆర్‌ఎస్‌ విద్యార్థి విభాగం అసెంబ్లీ ముట్టడి | BRS student wing obsession assembly | Sakshi
Sakshi News home page

బీఆర్‌ఎస్‌ విద్యార్థి విభాగం అసెంబ్లీ ముట్టడి

Mar 25 2026 5:01 AM | Updated on Mar 25 2026 5:01 AM

BRS student wing obsession assembly

స్కాలర్‌ప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంటు కోసం డిమాండ్‌ 

గెల్లు శ్రీనివాస్‌ సహా పలువురి అరెస్టు 

ప్రభుత్వ తీరు ఎమర్జెన్సీని గుర్తుకు తెస్తోంది: కేటీఆర్‌ 

సాక్షి, హైదరాబాద్‌: విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంటు బకాయిలు విడుదల చేయడంతోపాటు ఏటా రెండు లక్షల ఉద్యోగ నియామకాల భర్తీ హామీ నెరవేర్చాలని బీఆర్‌ఎస్‌ విద్యార్థి విభాగం డిమాండ్‌ చేసింది. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలనే డిమాండ్‌తో విద్యార్థులు, యువతకు మంగళవారం బీఆర్‌ఎస్‌వీ ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టారు. బీఆర్‌ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌ యాదవ్, ఉపాధ్యక్షుడు తుంగ బాలు ఆధ్వర్యంలో పెద్దఎత్తున బీఆర్‌ఎస్వీ నాయకులు, కార్యకర్తలు అసెంబ్లీ వద్దకు చేరుకుని లోనికి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేశారు. 

స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంటు బకాయిలు చెల్లించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ మాట్లాడుతూ.. ‘బడ్జెట్‌లో విద్యకు 18 శాతం నిధులు ఇవ్వాలని కమిషన్‌ సిఫారసు చేసినా కేటాయింపులు 8 శాతానికే పరిమితం చేశారు. గత ఏడాది బడ్జెట్‌లో ప్రతిపాదించిన ఫీజు రీయింబర్స్‌మెంటులో 80 శాతం నిధులను విడుదల చేయలేదు. 

రూ.8 వేల కోట్ల బకాయిలకుగాను రూ.4 వేల కోట్లు మాత్రమే కేటాయించి విద్యార్థులు, కాలేజీ యాజమాన్యాలను ప్రభుత్వం మోసగిస్తోంది. బడ్జెట్‌లో విద్యానిధి పథకం, రూ.5 లక్షల విద్యా రుణం హామీ ఊసేలేదు. రెండు లక్షల ఉద్యోగాలతో కూడిన జాబ్‌ కేలండర్‌ అమలు చేస్తామని ప్రియాంకా గాంధీ ఇచ్చిన హామీని అమలు చేయని రేవంత్‌ సీఎం పదవికి రాజీనామా చేయాలి’అని అన్నారు. 

విద్యార్థి నేతల అరెస్టు 
అసెంబ్లీ ముట్టడికి యత్నించిన బీఆర్‌ఎస్‌ విద్యార్థి విభాగం నేతలను అరెస్టు చేసి పంజగుట్ట, నాంపల్లి పోలీసు స్టేషన్లకు తరలించారు. బీఆర్‌ఎస్‌వీ అసెంబ్లీ ముట్టడి పిలుపు నేపథ్యంలో సోమవారం రాత్రి నుంచే పోలీసులు పలువురు బీఆర్‌ఎస్‌ విద్యార్థి,  యువజన విభాగం నేతల ఇళ్ల వద్ద నిఘా పెట్టారు. పోలీసులు అక్రమ అరెస్టులు, నిర్బంధాలకు పాల్పడుతున్నారని ప్రభుత్వ కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు ఎర్రోళ్ల శ్రీనివాస్, మన్నె క్రిషాంక్‌ తదితరులు తమ ఇళ్ల వద్దకు పోలీసులు వచ్చిన వీడియోలను ట్వీట్‌ చేశారు. 

విద్యార్థుల అరెస్ట్‌ దుర్మార్గ చర్య: కేటీఆర్‌ 
పెండింగ్‌లో ఉన్న విద్యార్థుల స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు చెల్లించాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. రెండు లక్షల ఉద్యోగ నియామకాల హామీ అమలు కోసం నిలదీసిన బీఆర్‌ఎస్‌వీ నేతలను అరెస్టు చేయడం దుర్మార్గ చర్య అని మండిపడ్డారు. నిధులు విడుదల చేయకుండా ప్రశ్నించిన గొంతులపై విరుచుకుపడటం ఎమర్జెన్సీని తలపిస్తోందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ‘ప్రభుత్వం ఇచి్చన హామీల అమలు కోసం విద్యార్థి నాయకులు అసెంబ్లీని ముట్టడించాల్సిన దుస్థితి వచ్చినందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం సిగ్గుపడాలి. 

జాబ్‌ కేలండర్‌కు పాతరేసి, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నింపిన ఉద్యోగాలను నిర్లజ్జగా కాంగ్రెస్‌ ఖాతాలో వేసుకుంటున్నారు. విద్యా వ్యవస్థను కుప్పకూల్చి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, పేద విద్యార్థులకు తీరని అన్యాయం చేసిన పాపం విద్యాశాఖ మంత్రిగా ఉన్న ముఖ్యమంత్రిదే. 127 మంది విద్యార్థులు గురుకులాల్లో మరణించినా సీఎం రేవంత్‌రెడ్డిలో కనీసం చలనం లేదు. ఇప్పటికైనా బకాయిపడ్డ స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులను ప్రభుత్వం విడుదల చేయాలి. అక్రమంగా అరెస్టు చేసిన బీఆర్‌ఎస్‌వీ నేతలందరినీ వెంటనే విడుదల చేయాలి’అని కేటీఆర్‌ పేర్కొన్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement