ఆర్టీఏ పౌర సేవల్లో ‘వాహన్’ విప్లవం
కొనుగోలు నుంచి బదిలీ వరకు అన్నీ వాహన్ పోర్టల్‌లోనే..
సాక్షి, హైదరాబాద్: రవాణాశాఖ పౌరసేవల్లో మధ్యవర్తిత్వానికి ఇక తావు లేదు. వివిధ రకాల సర్వీసుల కోసం ఏజెంట్‌లను ఆశ్రయించాల్సిన అవసరం లేదు. వాహనం కొనుగోలు మొదలు బదిలీ వరకు ఎక్కడా మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా ఆటోమేటిక్‌గా జరిగిపోయే ‘వాహన్ పోర్టల్’రెండు రోజుల క్రితం అమల్లోకి వచ్చింది. వాహనాల కొనుగోలు సమయంలో ఆటోమొబైల్ డీలర్లు చేసే మాయాజాలానికి, ఫైనాన్స్ సంస్థల దోపిడీకి ‘వాహన్’అడ్డుకట్ట వేయనుంది. నకిలీబీమా సంస్థల అక్రమాలకు సైతం కళ్లెం పడనుంది.
2014లోనే కేంద్రం దేశవ్యాప్తంగా ఈ పోర్టల్‌ను ప్రవేశపెట్టింది. 2016 నాటికి ఒక్క తెలంగాణ మినహా అన్ని రాష్ట్రాల్లో వాహన్ పోర్టల్‌తోపాటు డ్రైవింగ్ లైసెన్స్ సేవలపైన ‘సారథి పోర్టల్’అమల్లోకి వచ్చింది. ఇప్పటికే సారథి పోర్టల్ సేవలు కొనసాగుతుండగా, రెండు రోజుల క్రితం మంత్రి పొన్నం ప్రభాకర్ ‘వాహన్ పోర్టల్’ ను ప్రారంభించారు.ఈ రెండు రోజుల్లో ‘వాహన్’కు 1702 దరఖాస్తులు అందాయి. 318 టీఆర్‌లను (తాత్కాలిక రిజిస్ట్రేషన్) జారీ చేసి నట్టు అధికారులు తెలిపారు. ప్రస్తుతం కొత్తగా నమోదయ్యే వ్యక్తిగత వాహనాలకే ఈ పోర్టల్ సేవలు లభిస్తున్నాయి. త్వరలో రవాణా వాహనాలకు సైతం పోర్టల్‌ను విస్తరించనున్నారు.
ఈజీగా అంతర్రాష్ట్ర బదిలీలు
సాధారణంగా ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వాహనం బదిలీ కావాలంటే సంబంధిత ప్రాంతీయ రవాణా అధికారి నిరభ్యంతర పత్రం (ఎన్‌ఓసీ) అందజేయాలి. ఆ పత్రాన్ని బదిలీ కానున్న రాష్ట్రంలోని అధికారి ధృవీకరించుకొనేందుకు చాలా రోజుల సమయం పట్టేది. దీంతో బదిలీల్లో తీవ్రమైన జాప్యం చోటుచేసుకునేది. పైగా అధికారులను ప్రసన్నం చేసుకొనేందుకు ఏజెంట్‌లను ఆశ్రయించాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ ఇబ్బంది లేదు. తెలంగాణలో రిజిస్ట్రేషన్ అయిన ప్రతి వాహనం వివరాలు వాహన్‌లో ఉంటాయి. మిగతా రాష్ట్రాల వాహనాల వివరాలు ఇప్పటికే ఈ పోర్టల్‌లో ఉన్నాయి. కాబట్టి రవాణా అధికారులు ఈ పోర్టల్‌లో లభించే డేటా ఆధారంగా క్షణాల్లో ఎన్‌ఓసీ అందజేసే సదుపాయం ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకొని తీసుకోవచ్చు.
డీలర్లు మాయ చేయలేరు
రవాణాశాఖకు చెల్లించే జీవితకాల పన్నును తగ్గించేందుకు, వాహన ధరలను పెంచేందుకు, లేదా తగ్గించేందుకు ఆటోమొబైల్ డీలర్లు ఇక ఏ మాత్రం మాయ చేయలేరు. వాహనం తయారీ సంస్థ నిర్ణయించిన ధర మేరకు విక్రయించాల్సి ఉంటుంది. ఈ మేరకు దేశవ్యాప్తంగా ఆటోమొబైల్ డీలర్ల సర్వర్ పోర్టల్ ‘హోమో లోగేషన్’ను వాహన్‌తో అనుసంధానం చేశారు. దీనివల్ల తయారీ సంస్థ నిర్ణయించిన ధర, వాహన ఇంజిన్ నంబర్, ఛాసీస్ నంబర్ తదితర వివరాల నమోదులో డీలర్లు ఎలాంటి తప్పులు చేసేందుకు అవకాశం ఉండదు. అదనపు చార్జీలను కూడా వాహనదారుడి నుంచి వసూలు చేసేందుకు వీల్లేదు. ఇన్‌వాయిస్‌లో ఉన్న ధర మాత్రమే వాహనదారుడు చెల్లిస్తే సరిపోతుంది. మరోవైపు ప్రస్తుతం షోరూమ్‌లలోనే శాశ్వత రిజిస్ట్రేషన్ సదుపాయం ఉండటం వల్ల వాహనదారుడు ఆర్టీఏ అధికారులను సంప్రదించాల్సిన అవసరం కూడా లేదు.
ఫైనాన్స్ సంస్థల దోపిడీకి అడ్డుకట్ట
బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు కూడా వాహన్‌తో అనుసంధానమై ఉంటాయి. వాహనాలకు రుణాలు ఇవ్వాలనుకునే ప్రతి సంస్థ రవాణాశాఖ ఆమోదంతో అనుసంధానం కావాల్సిందే. ఇందుకోసం సదరు సంస్థల జీఎస్‌టీ గుర్తింపు, పాన్, ప్రభుత్వ గుర్తింపు, ఆర్‌బీఐ నుంచి పొందిన ఆమోద పత్రాలను తప్పనిసరిగా వాహన్‌లో అప్‌లోడ్ చేయాలి. దీంతో వాహనదారులకు అందజేసే రుణాలు, ప్రభుత్వానికి చెల్లించే జీఎస్‌టీ, ఆదాయపన్ను, తదితర అన్ని రకాల చెల్లింపుల్లో పారదర్శకత ఉంటుంది. ఎలాంటి మోసాలకు అవకాశం ఉండదు.
నకిలీ బీమాకు తెర
వాహన్ వల్ల నకిలీ బీమా సంస్థల మోసాలకు కూడా తెరపడుతుంది. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ బోర్డ్ (ఐఆర్‌బీ) అనుమతి పొందిన అన్ని బీమా సంస్థలు వాహన్‌తో అనుసంధానమై ఉంటాయి. దీంతో నకిలీ సంస్థల అక్రమాలకు అడ్డుకట్ట పడుతుంది.
వంద శాతం పారదర్శకం
దేశవ్యాప్తంగా అన్ని రకాల పౌర సేవలను ఏకీకృతం చేసే లక్ష్యంతో కేంద్రం మిషన్ మేడ్ ప్రాజెక్ట్ (ఎంఎంపీ)లో భాగంగా ‘ఒకే భారత్, ఒకే లైసెన్స్, ఒకే వాహనం నంబర్’విధానాన్ని కొనసాగిస్తోంది. నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ (ఎన్‌ఐసీ) ద్వారా దేశవ్యాప్తంగా 1,423 ప్రాంతీయ రవాణా కార్యాలయాల్లో ‘వాహన్ సారథి’పోర్టల్ సేవలను అందజేస్తున్నాం. వంద శాతం పారదర్శకత, జవాబుదారీతనం ఈ మిషన్ లక్ష్యం.
– ఎస్.కాశిరెడ్డి, ఎన్‌ఐసీ, తెలంగాణ కోఆర్డినేటర్


