
వర్షాకాలంలోనూ తగ్గని విద్యుత్ డిమాండ్
గత ఏడాదితో పోలిస్తే 18.30 శాతం అధికం
2024 జూలై 17న 65.58 ఎంయూలు..
ఈ ఏడాది జూలై 17న 77.58 ఎంయూలు నమోదు
హైదరాబాద్: వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఆకాశంలో కారుమబ్బులు కమ్ముకున్నాయి. నగరంలో ఇటీవల ఏదో ఒక ప్రాంతంలో వర్షం కురుస్తూనే ఉంది. పగటి ఉష్ణోగ్రతలు పడిపోయి.. ఉక్కపోత తగ్గినప్పటికీ.. కరెంట్ వినియోగం మాత్రం తగ్గడం లేదు. వానల్లోనూ మరింత రెట్టింపు స్థాయిలో నమోదవుతోంది. గత ఏడాది జూలై 17న గ్రేటర్‌లో 65.58 ఎంయూలు నమోదు కాగా, ఈ ఏడాది అదే రోజు ఏకంగా 77.58 ఎంయూలు నమోదైంది. గతంతో పోలిస్తే.. ప్రస్తుతం 18.30 శాతం అధికంగా నమోదు కావడం గమనార్హం.
అంచనాలు తలకిందులు
ఏటా విద్యుత్ వృద్ధిరేటు విషయంలో డిస్కం అంచనాలు తలకిందులవుతున్నాయి. సాధారణంగా వేసవిలోనూ అత్యధిక డిమాండ్ నమోదవుతుంది. కానీ ఇందుకు భిన్నంగా వర్షాకాలంలోనూ నమోదువుతుండటం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. కొత్త కనెక్షన్లతో పాటు గృహాలు, వ్యాపార, వాణిజ్య సముదాయాల్లో కొత్తగా అనేక ఎలక్ట్రికల్, ఎల్రక్టానిక్ పరికరాలు వచ్చి చేరుతున్నాయి. సీజన్‌తో సంబంధం లేకుండా ఇంట్లోని ఏసీలు ఆన్‌లోనే ఉంటున్నాయి. స్నానాలకు చన్నీటికి బదులుగా వేడినీళ్లను వాడుతున్నారు. నిన్నా మొన్నటి వరకు ఆఫ్‌లో ఉన్న గీజర్లు ప్రస్తుతం ఆన్‌లో ఉండటం కూడా విద్యుత్ వినియోగం పెరుగుదలకు మరో కారణం.
అనూహ్యంగా విద్యుత్ వృద్ధిరేటు
సైఫాబాద్, అజామాబాద్, మెహిదీపట్నం, చారి్మనార్, బేగంబజార్, ఆస్మాన్‌గఢ్, ప్యారడైజ్, బోయిన్‌పల్లి, కంటోన్మెంట్, బంజారాహిల్స్, గ్రీన్‌లాండ్స్ డివిజన్లలో విద్యుత్ వృద్ధిరేటు ఏటా పది శాతం ఉంటుందని డిస్కం అంచనా వేసింది. ఇందుకు భిన్నంగా ప్రస్తుతం ఇక్కడ 20 శాతం వృద్ధి రేటు నమోదైంది. అదే విధంగా కొండాపూర్, కూకట్‌పల్లి, జీడిమెట్ల, హబ్సిగూడ, సైనిక్‌పురి, కీసర, సరూర్‌నగర్, చంపాపేట్, ఇబ్రహీంపట్నం, రాజేంద్రనగర్, షాద్‌నగర్, సంగారెడ్డి డివిజన్లలో ఏటా 15 శాతం వృద్ధి రేటు ఉంటుందని అంచనా వేయగా, ప్రస్తుతం ఏకంగా 30 శాతం నమోదవుతోంది. ఇక ఐటీ, ఇతర పారిశ్రామిక సంస్థలకు నెలవైన ఇబ్రహీంబాగ్, గచ్చిబౌలి, పటాన్‌చెరు, కందు కూరు, మేడ్చల్ డివిజన్ల పరిధిలో 20 శాతం నమోదవుతుందని అంచనా వేస్తే.. ఇందుకు భిన్నంగా 40 శాతం వృద్ధిరేటు నమోదైంది. కొత్త పరిశ్రమలు ఏర్పాటవుతుండటం, ఇప్పటికే ఉన్న పరిశ్రమల్లోనూ అదనపు యూనిట్లు ప్రారంభిస్తుండటం కూడా అనూహ్యంగా పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌కు కారణమని డిస్కం అభిప్రాయపడుతోంది.
అప్రమత్తంగా ఉండాలని ఆదేశం
వర్షాలు, వరదల నేపథ్యంలో ఇంజినీర్లంతా అప్రమత్తంగా ఉండాలని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీ ముషారఫ్ ఫరూఖీ ఇంజినీర్లకు ఆదేశాలు జారీ చేశారు. అనూహ్యంగా పెరుగుతున్న విద్యుత్ డిమాండ్, ఏకధాటి వర్షాలు, వరదల నేపథ్యంలో నిత్యం ఆయన ఆయా సర్కిళ్ల ఎస్‌ఈలు, డీఈలతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. అధికారులెవరూ తమకు కేటాయించిన హెడ్‌క్వార్టర్లను విడిచి వెళ్లొద్దని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. సబ్‌స్టేషన్ల పరిధిలోని సిబ్బంది అంతా షిఫ్ట్‌ల వారీగా విధులు నిర్వహించాలని సూచించారు. డిమాండ్ ఎంత వచి్చనా.. నిరంతరాయంగా, మరింత నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేసేందుకు ఇంజినీర్లు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు.