విధుల నుంచి తప్పుకోవాలని మైనార్టీ గురుకుల సొసైటీ స్పష్టీకరణ
పాఠశాలల్లో ఈనెల 23 వరకు మాత్రమే విధులకు అనుమతి
నిర్దేశిత గడువు వరకే వేతనాల చెల్లింపు
ఈ మేరకు ప్రిన్సిపాళ్లకు ఆదేశాలు.. ఇతర సొసైటీల్లోనూ ఇదే పరిస్థితి
ఆందోళనలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు
సాక్షి, హైదరాబాద్: విద్యాసంస్థల్లో ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న సిబ్బందికి తెలంగాణ మైనార్టీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ డెడ్‌లైన్ విధించింది. మైనార్టీ జూనియర్ కాలేజీల్లో పనిచేసే ఔట్‌సోర్సింగ్ సిబ్బందిని మార్చి 31 నుంచే విధుల నుంచి తొలగించిన అధికారులు.. ఈ సొసైటీ పరిధిలోని గురుకుల పాఠశాలల్లో పనిచేసే ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ఈ నెల 23వ తేదీన చివరి పనిదినంగా ప్రకటిస్తూ ఆ మరుసటి రోజు నుంచి విధులకు రావొద్దని స్పష్టం చేసింది.
ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా వారి పనిదినాల గడువును ఉటంకిస్తూ, తగిన చర్యలు తీసుకోవాలని మైనార్టీ గురుకుల సొసైటీ కార్యదర్శి రెండ్రోజుల క్రితం అన్ని జూనియర్ కాలేజీలు, పాఠశాలల ప్రిన్సిపాళ్లకు ఆదేశాలు జారీ చేశారు. తాజా ఆదేశాలతో ఈ సొసైటీ పరిధిలో దాదాపు 2,250 మంది ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు విధుల నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
విద్యా సంవత్సరం ముగియడంతో వారి సేవలను నిలిపివేస్తున్నట్లు సొసైటీ కార్యదర్శి స్పష్టం చేశారు. దీంతో నిర్దేశించిన గడువు నాటికే వారికి వేతనాలు చెల్లిస్తారు. తదుపరి ఈ ఉద్యోగులు సర్వీసుకు సంబంధించి ప్రభుత్వ ఉత్తర్వుల్లో ఎలాంటి స్పష్టత లేదు. సొసైటీ అవసరాలకు అనుగుణంగా తదుపరి చర్యలుంటాయని అధికారులు చెబుతున్నారు.
12 వేల మందికి పైమాటే..
ప్రస్తుతం మైనార్టీ గురుకుల సొసైటీ పరిధిలోని ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సేవలను నిలిపివేసినప్పటికీ.. ఇతర గురుకుల సొసైటీల పరిధిలోనూ ఇదే తరహా చర్యలు మొదలయ్యాయి. ఇప్పటికే గురుకుల జూనియర్ కాలేజీలకు సెలవులు ప్రకటించడంతో.. అందులో పనిచేస్తున్న బోధన, బోధనేతర సిబ్బంది సేవలు నిలిచిపోయాయి. ఈనెల 23వ తేదీతో ఆయా గురుకుల పాఠశాలల్లోని ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు కూడా చెక్‌పడనుంది. ఈమేరకు ఇప్పటికే మౌఖికంగా ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం.
తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ, తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ, మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీల పరిధిలో దాదాపు 12 వేల మంది ఉద్యోగులు ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్నారు. వీరందరి సేవలను ఈనెల 23తో నిలిపివేస్తున్నప్పటికీ, తదుపరి సర్వీసుకు సంబంధించి స్పష్టత ఇవ్వకపోవడంతో వారిలో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.
ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న ఉద్యోగులకు కేవలం 10 నెలల వేతనాలు మాత్రమే చెల్లిస్తున్నారు. దీంతో వేసవి సెలవుల్లో వారు జీవనంకోసం ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ అంశంపై ఇప్పటికే పలుమార్లు మంత్రులు, ఉన్నతాధికారులను కలిసి 12 నెలల వేతనం ఇవ్వాలని కోరినప్పటికీ.. ప్రభుత్వం నుంచి స్పందన లేదని ఉద్యోగులు చెపుతున్నారు.
ఉద్యోగ భద్రత కల్పించాలి
ప్రభుత్వ కార్యాలయాల్లో రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా పనిచేస్తున్నప్పటికీ వేతనాలు అంతంతమాత్రమే ఇస్తున్నారు. కనీసం ఉద్యోగ భద్రత కూడా లేదు. విద్యా సంస్థల్లో పనిచేసే వారి పరిస్థితి మరింత దారుణం. వారికి కేవలం 10 నెలల జీతాలు మాత్రమే ప్రభుత్వం విడుదల చేస్తుంది.
ఏడాదిలో 10 నెలలు ఇక్కడ పనిచేసి మిగిలిన రెండు నెలలు ఎక్కడ పనిచేయాలి. ఈ రకమైన వివక్షను ప్రభుత్వం వీడాలి. మానవీయకోణంలో ఆలోచన చేసి ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు భద్రత కల్పించాలి. – పులి లక్ష్మయ్య, అధ్యక్షుడు, రాష్ట్ర ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సంఘం


