వాసాలమర్రికి పండగొచ్చింది | Dalitha bandhu Cash deposit in beneficiary accounts | Sakshi
Sakshi News home page

Dalit Bandhu: వాసాలమర్రికి పండగొచ్చింది

Sep 10 2021 1:52 AM | Updated on Sep 10 2021 8:39 AM

Dalitha bandhu Cash deposit in beneficiary accounts - Sakshi

దళితులను క్షేత్ర పర్యటనకు తీసుకెళ్తున్న అధికారులు

తుర్కపల్లి:  యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని ముఖ్యమంత్రి కేసీఆర్‌ దత్తత గ్రామం వాసాలమర్రిలోఎంపిక చేసిన దళిత కుటుంబాల ఖాతాల్లో దళితబంధు డబ్బులు జమ అయ్యాయి. దీంతో ఆయా కుటుంబాల్లో పండుగ వాతావరణం నెలకొంది. దళితులందరూ అర్థికంగా ఎదగాలని, మొట్టమొదటిగా దళితబంధు పథకాన్ని ఇక్కడినుంచే ప్రారంభిస్తున్నానని ఆగస్టు 4న సీఎం కేసీఆర్‌ చెప్పారు. ఇచ్చిన హామీ మేరకు మరుసటి రోజున ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున 76 దళిత కుటుంబాలకు సంబంధించి కలెక్టర్‌ పమేలా సత్పతి ఖాతాలోకి నిధులు ప్రభుత్వం జమ చేసింది.

అనంతరం నిధులను దేనికి, ఎలా ఖర్చు చేస్తారు? ఎలా సద్వినియోగం చేసుకోవాలనే అంశాలపై వివిధ శాఖల అధికారులు పలుమార్లు ఆయా దళిత కుటుంబాలతో సమావేశమై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమాలు పూర్తి కావడంతో 8వ తేదీ రాత్రి 8 గంటలకు నేరుగా 66 మంది లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో ఆ నిధులను ప్రభుత్వం జమ చేసింది. మరో 10 మందికి జమ కావాల్సి ఉంది. సాంకేతిక సమస్యల వల్ల 10 మందికి డబ్బులు జమ కాలేదని, వారికి కూడా త్వరలోనే వస్తాయని ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ శ్యాంసుందర్‌ తెలిపారు. 

ఆనందోత్సవాలు 
వాసాలమర్రి దళితులు ఆనందోత్సాహాల్లో మునిగి తేలుతున్నారు. తమ బతుకులు మారబోతున్నాయంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నిధుల జమ ఖాయమైనా, నిన్న మొన్నటి వరకు కొంత సంశయంతో ఉన్న సమయంలో తమ ఖాతాల్లోకి రూ.10 లక్షలు వచ్చి చేరడంతో ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు.

లబ్ధిదారుల క్షేత్ర పర్యటన
పాడిపరిశ్రమ, కోళ్ల పెంపకం, మేకలు, గొర్ల పెంపకంపై ఆసక్తి ఉన్న 30 మంది రైతులను గురువారం జిల్లా అధికారం యంత్రాంగం ధర్మారెడ్డి గూడెం, చిన్నకందుకూర్, రాయగిరి, కూనూర్‌ గ్రామాల్లో క్షేత్ర పర్యటనకు తీసుకెళ్లారు. వారికున్న అనుమానాలను నివృత్తి చేశారు. పశు పోషణ, కోళ్ల పెంపకం, గొర్లు, మేకల పెంపకం ఏ విధంగా చేపట్టాలి, లాభాలు ఏవిధంగా గడించాలన్న విషయాలను వారికి తెలియజేశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement