ఆ వీడియో కాల్‌ ఎత్తారో..బతుకు బస్టాండే

Cyber Criminals Make Nude Video Calls and Blackmail People - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘నార్సింగికి చెందిన వ్యక్తికి గుర్తు తెలియని నంబర్‌ నుంచి వాట్సాప్‌ వీడియో కాల్‌ వచ్చింది. కాల్‌ లిఫ్ట్‌ చేయగానే అటువైపు స్క్రీన్‌పై ఎలాంటి ఆడియో, వీడియో లేదు. తెర బ్లాక్‌గా కనిపించింది. కాల్‌ కట్‌ అయిన కొన్ని నిమిషాల తర్వాత.. తనకొచ్చిన మెసేజ్‌ చూసి బాధితుడు షాకయ్యాడు. తన ముఖాన్ని మార్ఫింగ్‌ చేసిన న్యూడ్‌ వీడియో అది! అడిగినంత డబ్బులు ఇవ్వకుంటే ఈ వీడియోను కాంటాక్ట్‌ లిస్ట్‌లో ఉన్న స్నేహితులు, బంధువులకు పంపిస్తామని సైబర్‌ నేరస్తులు బెదిరించారు. దీంతో ఏం చేయాలో తోచని బాధితుడు మొదట రూ.5 వేలు ఆన్‌లైన్‌లో చెల్లించి, దాని స్క్రీన్‌ షాట్‌ను షేర్‌ చేశాడు. మరోసారి ఫోన్‌ చేసిన నిందితులు రూ.30 వేలు డిమాండ్‌ చేశారు. భయపడిపోయిన బాధితుడు మళ్లీ సమర్పించుకున్నాడు. ఈసారికి రూ.20 వేలు పంపించాలని బెదిరించడంతో అలాగే పంపాడు. అయినా వారి నుంచి బెదిరింపులు ఆగకపోవటంతో పోలీసులను ఆశ్రయించాడు.’ ఇప్పటివరకు సైబర్‌ నేరస్తులు అమ్మాయిలుగా బాధితులకు ఫోన్‌ చేసేవారు.

చదవండి: (Hyderabad: రోడ్లపై వాహనాలను వదిలేస్తున్నారా.. అయితే ఇక కష్టమే..)

కొద్ది సేపు మాట్లాడిన తర్వాత నగ్నంగా వీడియో కాల్‌ చేసుకుందామని నమ్మించేవారు. బాధితుడికి అవతలి వైపున కనిపించే న్యూడ్‌ అమ్మాయి నిజమేనని భావిస్తాడు. వాస్తవానికి అక్కడ ప్లే అయ్యేది అశ్లీల వీడియో మాత్రమే. ఈ విషయం తెలియని బాధితుడు అవతలి వ్యక్తి సూచించినట్లుగా న్యూడ్‌గా మారతాడు. ఈ తతంగమంతా సైబర్‌ నేరస్తులు రికార్డ్‌ చేస్తారు. ఆ తర్వాత కొద్ది సేపటికి బాధితుడికి ఫోన్‌ చేసి తన న్యూడ్‌ వీడియోను పంపించి, బ్లాక్‌ మెయిల్‌ చేస్తారు. అడిగినంత డబ్బు ఇవ్వకపోతే కాల్‌ లిస్ట్‌లో ఉన్న స్నేహితులు, బంధువులకు ఈ వీడియో పంపిస్తామని బెదిరించేవారు. కానీ, తాజాగా నార్సింగి పీఎస్‌లో నమోదైన వాట్సాప్‌ వీడియో కాల్‌లో.. నేరస్తుల తరుఫున ఆడియో గానీ వీడియో గానీ ప్లే అవ్వలేదు.  కేవలం బాధితుడి వీడియోను రికార్డ్‌ చేసి, ఆపై దాన్ని న్యూడ్‌గా మార్ఫింగ్‌ చేసి బెదిరించి అందినకాడికి దోచుకున్నారు. 

బాధితుల నంబర్లు ఎక్కడివి? 
సాధారణంగా సైబర్‌ నేరస్తులు బాధితుల ఫోన్‌ నంబర్లను సోషల్‌ మీడియా ఖాతాల నుంచి సేకరిస్తుంటారు. మరికొంత మంది నేరస్తులు జాబ్‌ పోర్టల్స్, షాపింగ్‌ వెబ్‌సైట్లలో నమోదయిన ఫోన్‌ నంబర్లను థర్డ్‌ పార్టీ నుంచి కొనుగోలు చేస్తుంటారని ఓ సైబర్‌ క్రైమ్‌ పోలీస్‌ ఉన్నతాధికారి తెలిపారు. అయితే ఈ కేసులో బాధితుడి నంబర్‌ నేరస్తుల చేతికి ఎలా చిక్కిందనేది ఇంకా తేలలేదని తెలిపారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top