వ్యాక్సిన్‌కు రెట్టింపు వసూలు

COVID19 Vaccine: Govt Caps Price At Rs 250 Per Dose In Private Hospitals - Sakshi

ఒక్కో డోస్‌కు రూ. 250కి బదులు రూ. 500 

కొన్ని ప్రైవేట్‌ కార్పొరేట్‌ ఆసుపత్రుల తీరు 

మూడు ఆసుపత్రుల కరోనా వ్యాక్సినేషన్‌ అనుమతి రద్దు 

సాక్షి, హైదరాబాద్‌: కొన్ని ప్రైవేట్‌ ఆసుపత్రులు సామాజిక బాధ్యతగా చేయాల్సిన పనిలోనూ కాసుల వేటకు దిగాయి. కరోనా వ్యాక్సిన్‌కు నిర్ధారించిన ధరకు రెట్టింపు వసూలు చేస్తున్నాయి. దీనిపై జనం మండిపడుతున్నారు. ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్‌ శ్రీనివాసరావుకు కొందరు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయన ఆయా యాజమాన్యాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు ప్రైవేట్‌ ఆసుపత్రులకు ఇచ్చిన కరోనా వ్యాక్సినేషన్‌ అనుమతిని రద్దు చేశారు. మరికొన్ని ఆసుపత్రులపై ఫిర్యాదులు రాగా, వాటిపై కూడా జిల్లా వైద్యాధికారులతో విచారణ చేస్తున్నట్లు తెలిసింది. అవి పద్ధతి మార్చుకోకుంటే చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.

 బీపీ చెక్‌ చేస్తున్నామంటూ అదనపు వసూళ్లు ఇప్పుడు 60 ఏళ్లు పైబడిన వారందరికీ, 45–59 ఏళ్ల వయస్సులో ఉన్న దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులందరికీ టీకా కార్యక్రమం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. వీరికి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా వేస్తున్నారు. అయితే ప్రైవేట్‌లో మాత్రం టీకాకు రూ. 150, సర్వీస్‌ చార్జి కింద రూ. 100 వసూలు చేసుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. వీలైనంత ఎక్కువ మందికి వ్యాక్సినేషన్‌ జరగాలని... టీకా ధరే వసూలు చేయాలని, సర్వీస్‌ చార్జి వసూలు చేయొద్దని డాక్టర్‌ శ్రీనివాసరావు ఆసుపత్రులకు విజ్ఞప్తి చేశారు. ఆ విన్నపాన్ని కొన్ని ఆసుపత్రులు అంగీకరించాయి. కానీ కొన్ని ఆసుపత్రులు ఆ మాట వినకపోగా, రెట్టింపు వసూలు చేస్తున్నాయి. విచిత్రమేంటంటే బంజారాహిల్స్‌లో ఉన్న ఒక ప్రముఖ ఆసుపత్రి యాజమాన్యం ఏకంగా రెట్టింపు అంటే రూ. 500 వసూలు చేస్తోంది. దీనిపై ఆ యాజమాన్యాన్ని పిలిపించి వివరణ కోరారు.

తాము బీపీ చెక్‌ చేస్తున్నామని, వచ్చిన వారి ఆరోగ్య పరిస్థితిని డాక్టర్‌ తెలుసుకుంటున్నారని, అందుకే రెట్టింపు వసూలు చేస్తున్నామని వింత సమాధానం చెప్పారు. బీపీ చెక్‌ చేస్తే అంత వసూలు చేయాలా? వ్యాక్సిన్‌ వేసే ముందు డాక్టర్‌ ఒకసారి లబ్ధిదారుడి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవడం సర్వసాధారణం. దానికి అంత వసూలు చేయాలా? అని వైద్య వర్గాలు యాజమాన్యాన్ని ప్రశ్నించాయి. సర్వీస్‌ చార్జీ రూ. 100 వసూలు అనేది ఇటువంటి సేవలకేనని, అలాంటిది రెట్టింపు వసూలు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని వైద్యాధికారులు ప్రశ్నించగా, సమాధానం రాలేదు. దీంతో ఆ ఆసుపత్రికి ఇచ్చిన వ్యాక్సినేషన్‌ అనుమతిని రద్దు చేశారు. అలాగే మరో రెండు ఆసుపత్రుల వ్యాక్సినేషన్‌ అనుమతిని రద్దు చేశారు.  

ప్రభుత్వంలోనే అధికంగా వ్యాక్సినేషన్‌ 
రాష్ట్రంలో ప్రస్తుతం 354 ప్రభుత్వ, 218 ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో కరోనా టీకా వేస్తున్నారు. ఇప్పటివరకు 9,68,050 వ్యాక్సిన్లు వేయగా, అందులో ప్రభుత్వ ఆసుపత్రుల్లో 7,22,952 టీకాలు వేశారు. ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో 2,45,098 మందికి వేశారు. ప్రైవేట్‌లో కంటే ప్రభుత్వంలోనే ఎక్కువగా టీకాలు వేశారు. ఎక్కువ మంది మధ్యతరగతి, దిగువ తరగతి ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే టీకా వేయించుకుంటున్నారు.

కాగా, అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్‌సీ), 20 పడకలకు మించి ఉన్న ప్రైవేట్‌ ఆసుపత్రుల్లోనూ టీకా కార్యక్రమం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే 100కు పైగా ప్రైవేట్‌ ఆసుపత్రులు టీకా వేసేందుకు అనుమతి కోరాయి. అయితే నిర్ణీత ధరకు మించి వసూలు చేయొద్దని, అలా చేసిన ఆసుపత్రులపై చర్యలు తీసుకుంటామని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్‌ శ్రీనివాసరావు హెచ్చరించారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top