కరోనా విజేతలు లక్ష మంది | Coronavirus: Recoveries Cross 1 Lakh In Telangana | Sakshi
Sakshi News home page

కరోనా విజేతలు లక్ష మంది

Sep 4 2020 2:29 AM | Updated on Sep 4 2020 11:50 AM

Coronavirus: Recoveries Cross 1 Lakh In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : కొంచెం ధైర్యం.. ఇంకొంచెం అవగాహన.. ఈ రెండూ ఉంటే చాలు కరోనా కొమ్ములు విరిచేయొచ్చు. అప్పటికీ ఇప్పటికీ వైరస్‌ వ్యాప్తిపై పెరిగిన అప్రమత్తతతో కరోనా మహమ్మారి నుంచి బాధి తులు తేలిగ్గానే బయటపడుతున్నారు. రాష్ట్రంలో కరోనాపై గెలిచిన విజేతల సంఖ్య బుధవారం నాటికి లక్ష దాటడమే అందుకు నిదర్శ నం. ఒకవైపు కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండగా, మరోవైపు కోలుకుంటున్నవారి సంఖ్యా అత్యధికంగా ఉంది. ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో కోలుకున్నవారే మూడింతలు ఉండటం విశేషం. ఇది ఆశాజనక పరిణామమని వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు అంటున్నాయి. కరోనాపై అవగాహన కలగడం, గ్రామస్థాయి వరకు నిర్ధారణ పరీక్షలు అందుబాటులోకి రావడంతో ఏమాత్రం లక్షణాలున్నా ప్రజలు వెంటనే పరీక్షలు చేయించుకుంటున్నారు. కొంచెం సీరియస్‌గా ఉన్నా సమీప ఆసుపత్రులకు వెళ్తున్నారు. కొద్దిపాటి పరిజ్ఞానం ఉన్నవారంతా ఇళ్లలో థర్మామీటర్, పల్స్‌ ఆక్సీమీటర్‌ను పెట్టుకుంటున్నారు. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు పెరిగాయి. కొందరైతే పరీక్షలు చేయించుకునే వరకు వేచిచూడకుండా లక్షణాలను బట్టి తక్షణ చికిత్స పొందుతున్నారు. ఆపై పరీక్ష చేయించుకుని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

పరీక్షలు పెరగడంతో..
రాష్ట్రంలో ఇప్పటివరకు 15,42,978 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, అందులో 1,33,406 మందికి పాజిటివ్‌ వచ్చింది. వారిలో బుధవారం నాటికి 1,00,013 మంది కోలుకున్నారు. అంటే రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల్లో 74.96 శాతం మంది కోలుకున్నట్టు. మొత్తం 856 మంది కరోనాతో చనిపోగా, ప్రస్తుతం 32,537 మంది చికిత్స పొందుతున్నారు. వీరిలో  25,293 మంది ఇళ్లు, ఇతరత్రా సంస్థల ఐసోలేషన్‌లోనే చికిత్స పొందుతుండటం గమనార్హం. చాలా కేసులు ఇలా ఇళ్లలోనే తగ్గిపోతున్నాయని వైద్యాధికారులు విశ్లేషిస్తున్నారు. దీనికి కారణం తక్షణం స్పందించడం, అందుబాటులో పరీక్షల వల్లేనంటున్నారు. వైరస్‌ విజృంభించిన మొదట్లో హైదరాబాద్‌లోనే కరోనా నిర్ధారణ పరీక్షలు జరిగేవి. ర్యాపిడ్‌ యాంటిజెన్‌ టెస్టులు జిల్లాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్‌సీ) స్థాయి వరకు వెళ్లడంతో పరిస్థితి మారింది. ప్రస్తుతం 1,076 కేంద్రాల్లో యాంటిజెన్‌ టెస్టులు జరుగుతున్నాయి. ప్రతీ పది లక్షల జనాభాకు 41,560 మందికి నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఆగస్టులో పరీక్షల సంఖ్య బాగా పెరిగింది. ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 92,050 మందికి లక్షణాల్లేకుండానే కరోనా పాజిటివ్‌ వచ్చింది. 41,356 మందిలోనే లక్షణాలు బయటపడ్డాయి. అంటే అనుమానమున్నవారు పరీక్షలు చేయించుకోవడం వల్లే లక్షణాల్లేని కేసులు ఎక్కువ నమోదయ్యారని, అందువల్లే త్వరగా కోలుకుంటున్నారని వైద్యాధికారులు విశ్లేషిస్తున్నారు. 

ఆసుపత్రుల్లో పెరిగిన వైద్య వసతి
మొదట్లో గాంధీ ఆసుపత్రికే పరిమితమైన కరోనా చికిత్స, ఇప్పుడు పలు ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆసుపత్రులకూ విస్తరించింది. ప్రస్తుతం 42 ప్రభుత్వ ఆసుపత్రుల్లో కరోనా చికిత్స అందుబాటులోకి వచ్చింది. వీటిలో 7,952 పడకలు కరోనా కోసం కేటాయించారు. 2,774 పడకలు నిండిపోగా, ఇంకా 5,178 పడకలు ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న ఆక్సిజన్‌ పడకలకు తోడు మరో 4,500 పడకల్లో ఆక్సిజన్‌ అందుబాటులోకి తేవాలని సర్కారు నిర్ణయించింది. అలాగే 191 ప్రైవేట్‌ కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో కరోనా సేవలు అందుబాటులోకి వచ్చాయి. వాటిల్లో ఏకంగా 10,063 పడకలు కరోనాకు కేటాయించారు. అందులో 4,470 పడకలు నిండిపోగా, ఇంకా 5,593 ఖాళీగా ఉన్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో ఇంకా 10,771 పడకలు ఖాళీగా ఉన్నాయి. దీన్నిబట్టి ఆసుపత్రులకు వచ్చేవారి సంఖ్య గణనీయంగా తగ్గిందని వైద్య, ఆరోగ్య వర్గాలు అంటున్నాయి. నెల క్రితం సీరియస్‌ అయితే ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో పడకలు దొరకని పరిస్థితి.. ప్రస్తుతం అప్రమత్తత పెరగడంతో చాలామంది ఆసుపత్రులకు రాకుండానే కోలుకుంటున్నారని విశ్లేషిస్తున్నారు. దీంతో రాష్ట్రంలో మరణాల శాతం కూడా తగ్గింది. దేశంలో కరోనా మరణాల రేటు 1.75 శాతం ఉంటే, తెలంగాణలో 0.64 శాతంగా ఉంది.

కొత్తగా 2,817 కేసులు.. పదిమంది మృతి
రాష్ట్రంలో బుధవారం 59,711 మందికి పరీక్షలు చేయగా,  2,817 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు గురువారం ఉదయం బులెటిన్‌ విడుదల చేశారు. తాజాగా పదిమంది కరోనాతో మృతిచెందారు. ఒకరోజులో 2,611 మంది కోలుకున్నారు. ఒకరోజు చేసిన నిర్ధారణ పరీక్షల్లో ప్రాథమిక కాంటాక్టు వ్యక్తులు 26,869 (45%) మంది ఉన్నారు. ఇక సెకండరీ కాంటాక్టు వ్యక్తులు 8,359 (14%) మంది ఉన్నారు. మిగిలినవారు డైరెక్ట్‌గా కరోనాకు గురైనవారు. తాజా కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 452, రంగారెడ్డి జిల్లాలో 216, కరీంనగర్‌లో 164, నల్లగొండ, ఖమ్మంలో 157 చొప్పున, మేడ్చల్‌లో 129, సిద్దిపేటలో 120, సూర్యాపేటలో 116, వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో 114 నమోదయ్యాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement