తక్షణమే రైతాంగ సమస్యల్ని పరిష్కరించాలి: కాంగ్రెస్‌

Congress Request To TS Chief Secretary On Problems Of Farmers - Sakshi

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కాంగ్రెస్‌ ప్రతినిధి బృందం వినతి

సోమేశ్‌ను కలిసినవారిలో రేవంత్, భట్టి, కోదండరెడ్డి తదితరులు

ధరణి, ఇతర రైతాంగ సమస్యలపై చర్చ కోసం అసెంబ్లీని సమావేశపరిచేలా చర్యలు తీసుకోండి

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో నెలకొన్న రైతాంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌ చేసింది. ఈ మేరకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రతినిధుల బృందం సోమవారం సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం సమర్పించింది. రుణమాఫీ, ధరణి సమస్యలు, అటవీ, పోడుభూములు, నిషేధిత భూముల జాబితా, అసైన్డ్‌ భూములు, కౌలు రైతుల చట్టం, టైటిల్‌ గ్యారంటీ చట్టం వంటి అంశాలపై సీఎస్‌తో చర్చించి వినతిపత్రం సమర్పించారు.

సీఎస్‌ను కలిసినవారిలో ఎమ్మెల్యేలు జగ్గారెడ్డి, సీతక్క, టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్లు అంజన్‌ కుమార్‌ యాదవ్, మహేశ్‌ కుమార్‌గౌడ్, అజారుద్దీన్, ఏఐసీసీ కిసాన్‌ సెల్‌ వైస్‌ చైర్మన్‌ ఎం.కోదండరెడ్డి, మాజీమంత్రులు నాగం జనార్దన్‌రెడ్డి, షబ్బీర్‌ అలీ, గడ్డం ప్రసాద్‌కుమార్, మాజీ ఎంపీలు బలరాం నాయక్, మల్లు రవి, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్‌ తదితరులున్నారు. కాగా, తమ విజ్ఞప్తిపట్ల సీఎస్‌ సానుకూలంగా స్పందించినట్టు కాంగ్రెస్‌ వర్గాలు వెల్లడించాయి.

కాంగ్రెస్‌ డిమాండ్లు ఇవే:
ధరణి వెబ్‌సైట్‌ పేరుతో రాష్ట్రంలోని భూరికార్డుల నిర్వహణ బాధ్యతలను ప్రైవేటు కంపెనీకి అప్పగించడాన్ని కాంగ్రెస్‌ పార్టీ వ్యతిరేకిస్తోంది. ధరణిని రద్దు చేసి గతంలో మాదిరిగానే భూరికార్డుల నిర్వహణను భూపరిపాలన ప్రధాన కమిషనర్‌(సీసీఎల్‌ఏ) పరిధిలోకి తేవాలి. 
గ్రామసభలు ఏర్పాటు చేసి క్షేత్రస్థాయి భూసమస్యలను పరిష్కరించాలి. నిషేధిత జాబితాలో ఉంచిన ప్రతి గుంట పట్టా భూమినీ అందులోంచి తొలగించాలి. 
అటవీహక్కుల చట్టం ప్రకారం అటవీ, పోడు భూములపై రైతులకు హక్కులు కల్పించాలి. కాంగ్రెస్‌ హయాంలో పంపిణీ చేసిన అసైన్డ్‌ భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించాలి. ఆ భూములపై అసైనీలకు హక్కులు కల్పించాలి. అందుకు చట్ట సవరణ చేయాలి. 
గ్రామస్థాయిలో కౌలు రైతులను గుర్తించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే అన్ని రకాల రాయితీలను వారికి వర్తింపజేయాలి. 
► రాష్ట్రంలోని ప్రతి ఎకరం భూమిని సర్వే చేసి మొత్తం భూవిస్తీర్ణాన్ని నమోదు చేసి రైతాంగానికి ప్రయోజనకరమైన టైటిల్‌ గ్యారంటీ చట్టాన్ని తీసుకురావాలి. 
► రాష్ట్రంలోని రైతులందరికీ వెంటనే పూర్తిగా రుణమాఫీ చేయాలి. 

రైతుల పక్షాన పోరాడుతాం: రేవంత్‌
రైతాంగం ఎదుర్కొంటున్న అన్ని రకాల సమస్యలను సీఎస్‌ సోమేశ్‌కుమార్‌కు కూలంకషంగా వివరించామని, వెంటనే అసెంబ్లీని సమావేశపరిచి చర్చించి పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కోరామని రేవంత్‌రెడ్డి చెప్పారు. సీఎస్‌ను కలిసిన అనంతరం కాంగ్రెస్‌ నేతలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడుతూ వెంటనే సీఎం కేసీఆర్‌ అందుబాటులోకి వచ్చి రైతుల సమస్యలపై దృష్టి సారించాలన్నారు. ఈ మేరకు ఈ నెల 24 నుంచి డిసెంబర్‌ 5 వరకు మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయిలో ఆందోళనలు నిర్వహిస్తామని చెప్పారు. ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో టీఆర్‌ఎస్, బీజేపీలు వివాదాలు సృష్టిస్తున్నాయని, తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు సమస్యలను పక్కదారి పట్టిస్తున్నాయని, దాడులు, ప్రతిదాడులతో గందరగోళం సృష్టిస్తున్నాయని రేవంత్‌ ఆరోపించారు. రాష్ట్రం ప్రశాంతంగా ఉండాలంటే కాంగ్రెస్‌ అధికారంలోకి రావాలని రేవంత్‌ చెప్పారు.

ఇదీ చదవండి: మత్స్యకారులకూ రూ. 5 లక్షల బీమా కల్పించాలి 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top