లాయర్‌ హత్య కేసులో బిగ్‌ ట్విస్ట్‌.. సూత్రధారి కాంగ్రెస్‌ కీలక నేత | Congress Leader Behind Khaja Moizuddin Accident Case | Sakshi
Sakshi News home page

లాయర్‌ హత్య కేసులో బిగ్‌ ట్విస్ట్‌.. సూత్రధారి కాంగ్రెస్‌ కీలక నేత

May 27 2026 7:26 AM | Updated on May 27 2026 7:26 AM

Congress Leader Behind Khaja Moizuddin Accident Case

సాక్షి, సిటీబ్యూరో: వక్ఫ్‌ బోర్డు ప్యానల్‌ న్యాయవాది ఖాజా మొహిజుద్దీన్‌ హత్య కేసు కొలిక్కి వచ్చింది. ఈ హత్యకు భూవివాదాలే కారణమని, బర్కత్‌పుర ప్రాంతానికి చెందిన  కాంగ్రెస్‌ నేత సూత్రధారి అని తేలింది. ఆయనతో సహా నలుగురిని అదుపులోకి తీసుకున్న హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పరారీలో ఉన్న మరో ముగ్గురి కోసం గాలిస్తున్నారు. వీళ్లు కూడా చిక్కితే ఈ హత్యోదంతం ఆద్యంతాలపై స్పష్టత వస్తుందని అధికారులు చెప్తున్నారు. మొహిజుద్దీన్‌ కొన్నేళ్లుగా వక్ఫ్‌ భూముల పరిరక్షణకు పోరాడుతున్నారు. ఓ భూమికి సంబంధించి బర్కత్‌పురకు చెందిన కీలక కాంగ్రెస్‌ నేతతో విభేదాలు వచ్చాయి. తమ ఆధీనంలో ఉన్న ఈ భూమి విషయంలో జోక్యం చేసుకోవద్దంటూ ఆ నేతతోపాటు ఆయన కుమారుడు సైతం మొహిజుద్దీన్, ఆయన కుమారుడు ఫర్హాన్‌పైనా పలుమార్లు ఒత్తిడి తీసుకువచ్చారు.  

బెదిరింపులు.. ఆఫర్‌.. 
తీవ్రస్థాయిలో బెదిరింపులకు దిగడంతోపాటు ఆ భూ వివాదం కేసు నుంచి వైదొలిగితే రూ.2 కోట్లు ఇస్తామంటూ మొహిజుద్దీన్‌కు ఆఫర్‌ చేశారు. అయితే రాజీ పడబోనని చెప్పడంతో మొయిజుద్దీన్‌ను హత్యను చేయాలని భావించి ఆ పనిని తావూస్, మునీర్‌లకు అప్పగించారు. కాగా, సుపారీ గ్యాంగ్‌తో పనిపూర్తి చేయించాలని నగరానికి చెందిన కిషన్‌ సింగ్‌ అలియాస్‌ పప్పును వీరు కలిసి విషయం చెప్పారు. సుపారీ కింద రూ.15 లక్షలు చెల్లించారు. హత్య బాధ్యతను కవాడిగూడకు చెందిన సింగూరి అభిజీత్‌ అలియాస్‌ నాని, వినయ్, మణిదీప్‌లకు అప్పగించి రూ.10 లక్షలు చెల్లించాడు. ఈ ముగ్గురూ పప్పుతో కలిసి పథకం వేసి, కారు కొని, రెక్కీ చేసి, శనివారం మొయిజుద్దీన్‌ను రెడ్‌హిల్స్‌ శాంతినగర్‌లో హత్య చేశారు.

అభిజిత్‌ గుర్తింపు... 
స్టంట్స్‌ చేయడంలో అనుభవం ఉన్న అభిజితే ఆ రోజు కారు నడిపాడు. మణిదీప్, వినయ్‌ అందులో కూర్చున్నారు. డ్రైవింగ్‌ నైపుణ్యం కారణంగానే ఇతడు నడిపిన, మొయిజుద్దీన్‌ ఎక్కబోయిన కార్లలో ఏదీ దెబ్బతినలేదు. ఈ హత్య చేసే సమయంలో కారుకు నెంబర్‌ ప్లేట్‌ లేకపోయినా వివిధ ప్రాంతాల్లోని సీసీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాలను టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అధ్యయనం చేశారు. వీటి ఆధారంగా అభిజిత్‌ను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఇతడిచ్చిన సమాచారంతో మణిదీప్, వినయ్‌లను పట్టుకున్నారు. పరారీలో ఉన్న తావూస్, మునీర్, కిషన్‌ సింగ్‌ల కోసం మూడు రాష్ట్రాల్లో గాలిస్తున్నారు.  

ఈ హత్య కేసులో సదరు కాంగ్రెస్‌ 
నేత పాత్రపై ఆధారాలు దొరకడంతో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు మంగళవారం ఉదయం సికింద్రాబాద్‌లోని కార్యాలయానికి పిలిపించారు. మొయిజుద్దీన్‌తో ఉన్న విభేదాలు, హత్య తదితర అంశాలపై పలు ప్రశ్నలు వేశారు. తొలుత తనకు ఏం సంబంధమని, తాను ఎవరో తెలుసా? అంటూ చిందులు తొక్కారు. ఆ తర్వాత నేరం అంగీకరించడంతోపాటు తావూస్, మునీర్‌ పేర్లు బయటపెట్టారు. దీంతో ఈ నిందితుల కోసం గాలిస్తున్న టాస్క్‌ఫోర్స్‌ ఒకటిరెండు రోజుల్లో అరెస్టులను ప్రకటించనుంది. ఈ హత్య వెనుక కాంగ్రెస్‌ నేత కుమారుడి పాత్రపైనా ఆరోపణలు ఉండటంతో ఆ కోణంలోనూ విచారణ సాగుతోంది.  

Advertisement
 
Advertisement
Advertisement