గజ్వేల్ మార్కెట్ యార్డులో రైతుతో మాట్లాడుతున్న రాంచందర్‌రావు. చిత్రంలో ఈటల, మహేశ్వర్‌రెడ్డి, రఘునందన్‌రావు. రాకేశ్‌రెడ్డి తదితరులు
రైతుల ఇబ్బందులు పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వం
ఎక్కడ చూసినా ధాన్యం రాశులే కనిపిస్తున్నాయి
‘రైతుగోస– బీజేపీ భరోసా’లో రాంచందర్‌రావు
సాక్షి, హైదరాబాద్/కుల్కచర్ల/గజ్వేల్: కాంగ్రెస్ పార్టీకి రైతుల గోస పట్టడం లేదని, పండించిన పంటను అమ్ముకోలేని దుర్భర పరిస్థితులు నెలకొన్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు అన్నారు. వికారాబాద్ జిల్లా కుల్కచర్లలో సోమవారం ‘రైతుగోస– బీజేపీ భరోసా’కార్యక్రమాన్ని ప్రారంభించి, మార్కెట్ యార్డులోని రైతులతో మాట్లాడారు. ఆ తర్వాత సిద్దిపేట జిల్లా గజ్వేల్ మార్కెట్ యార్డును కూడా సందర్శించి రైతులతో మాట్లాడారు. వరంగల్‌లో ఇచ్చిన డిక్లరేషన్‌ను కాంగ్రెస్ ఏనాడో మర్చిపోయిందన్నారు. రియల్‌ఎస్టేట్ దందా తప్ప క్షేత్రస్థాయిలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ ఎలా జరుగుతుందో సీఎంకు తెలియదన్నారు.
ఇప్పటివరకు ఆయా జిల్లాల వారీగా ఎంతమేర ధాన్యం సేకరించారో శ్వేతపత్రం విడుదల చేయాలని రాంచందర్‌రావు డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 1.45 కోట్ల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సి ఉండగా, ఇప్పటివరకు కేవలం 45 లక్షల టన్నులు సేకరించామని సీఎం పేర్కొంటున్నారని తెలిపారు. ఈ లెక్కన కూడా 30 శాతం మించలేదని మండిపడ్డారు.బీజేపీ శాసనసభాపక్షనేత మహేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ కొనుగోళ్ల ప్రక్రియ పూర్తి కాకుండానే, వారంలో కేంద్రాలను మూసేయాలని ప్రభుత్వం భావిస్తున్నదని మండిపడ్డారు. అలా చేస్తే సహించేదిలేదని హెచ్చరించారు. మెదక్ ఎంపీ రఘునందన్‌రావు మాట్లాడుతూ బీజేపీ బస్సు యాత్ర వస్తుందని తెలిసి...కలెక్టర్ ఆదివారం గజ్వేల్ మార్కెట్ యార్డుకు ఆగమేఘాల మీద చేరుకొని లారీలు , గన్నీ బ్యాగులు తెప్పించే ప్రయత్నం చేశారని చెప్పారు. ఇదే ప్రయత్నం నిరంతరంగా ఎందుకు సాగటం లేదని ప్రశ్నించారు.
పార్టీ కార్యాలయం నుంచి ఐక్యత చాటుతూ...
పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి పార్టీ అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల పరిశీలనకు ఐక్యతను చాటుతూ ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు బస్సులో బయలుదేరారు. ఈ బస్సు యాత్రలో ఎంపీలు డీకే అరుణ, ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఎం.రఘునందన్‌రావు, ఎమ్మెల్యేలు కాటిపల్లి వెంకటరమణారెడ్డి, రామారావు పటేల్, పైడి రాకేశ్‌రెడ్డి, ధన్‌పాల్ సూర్యానారాయణగుప్తా, డా.పాల్వాయి హరీశ్‌బాబు, ఎమ్మెల్సీలు ఏవీఎన్‌రెడ్డి, డా.సి.చిన్నమైల్ అంజిరెడ్డి, మల్క కొమురయ్య, పార్టీ ముఖ్యనేతలు పాల్గొన్నారు. మంగళ, బుధవారాల్లో ఉమ్మడి నల్లగొండ, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో ధాన్యం కొనుగోళ్ల తీరును బీజేపీ ప్రతినిధి బృందం సమీక్షించనుంది.


