
సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ సూర్యకాంత్‌కు పుష్పగుచ్ఛం ఇస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి. చిత్రంలో హైకోర్టు ఏసీజే జస్టిస్ సుజోయ్‌పాల్, జస్టిస్ శామ్‌కోషి
న్యాయమే కాదు.. తలెత్తుకుని జీవించే ప్రోత్సాహం ఇవ్వాలి
సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్
చిన్నారులపై లైంగిక వేధింపుల నిందితుల్లో పరిచయస్తులే అధికం
హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజోయ్‌పాల్
బాలలపై లైంగిక వేధింపుల నిరోధంపై సదస్సు ప్రారంభం
పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి, న్యాయమూర్తులు, మంత్రులు
సాక్షి, హైదరాబాద్: చిన్నారుల రక్షణ కొన్ని సంస్థల విధి మాత్రమే కాదని, దేశంలోని ప్రతి పౌరుడి నైతిక బాధ్యత అని జాతీయ న్యాయ సేవల ప్రాధికార సంస్థ (నల్సా) చైర్మన్, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ అభిప్రాయపడ్డారు. లైంగిక వేధింపులకు గురైన చిన్నారుల కోసం స్నేహపూర్వక కోర్టుల ఆవశ్యకతను ఆయన నొక్కి చెప్పారు. రాష్ట్రంలో భరోసా కేంద్రాలు ఆ మేరకు తోడ్పాటునందిస్తున్నాయని ప్రశంసించారు.
తెలంగాణ పోలీసు మహిళా భద్రతా విభాగం, రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ, తెలంగాణ న్యాయ సేవల అథారిటీ, యూనిసెఫ్ సంయుక్తంగా హైదరాబాద్‌ని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో ‘వాయిస్ ఫర్ ది వాయిస్‌లెస్.. రైట్స్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చి్రల్డన్ ఆఫ్ సెక్సువల్ అబ్యూస్’(గొంతులేని వారి గొంతుక– చిన్నారులపై లైంగిక వేధింపులు– హక్కులు, రక్షణ) అనే అంశంపై రెండు రోజుల సదస్సు నిర్వహిస్తున్నాయి.
శనివారం ఈ సదస్సును జస్టిస్ సూర్యకాంత్ ప్రారంభించి మాట్లాడారు. ‘పిల్లల భద్రత చట్టపరమైనదే కాదు.. అది ఒక నైతిక, జాతీయ బాధ్యత. లైంగిక వేధింపులకు గురైన బాలల కోసం రాష్ట్రంలో భరోసా కేంద్రాల ఏర్పాటు అభినందనీయం. చిన్నారులపై లైంగిక ఆకృత్యాల అంశం సమాజంలో పెను సమస్యగా మారింది. చాలా సందర్భాల్లో బాధితుల తల్లిదండ్రులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయకుండా మౌనంగా ఉంటున్నారు. దీనిని మార్చేందుకు అందరూ సహకారం అందించాలి.
దేశ జనాభాలో 24% మంది 14 ఏళ్లలోపు వారే. ప్రతి ముగ్గురిలో ఒకరు 18 ఏళ్లలోపు వారే. మొత్తం చిన్నారులు 345 మిలియన్లు. ఈ సంఖ్య అనేక ఖండాల జనాభాను మించిపోయింది. ఇల్లు, పాఠశాల, పరిసరాల్లో పిల్లలపై వేధింపులు జరుగుతున్నాయి. ఇది సమష్టి వైఫల్యమే అవుతుంది.
సదుద్దేశంతో కూడిన వ్యవస్థలు నేరస్థులను శిక్షించడంపై దృష్టి పెడతాయి. కానీ, గాయపడిన పిల్లల గొంతు మూగబోతోంది. దీనికి కొత్త యంత్రాంగం అవసరం. పోలీసులు, న్యాయవ్యవస్థ, పాఠశాలలు, పౌర సమాజంతో కూడిన ఏకీకృత పిల్లల రక్షణ వ్యవస్థ బలోపేతం కావాలి. ఇది కేవలం నైతిక బాధ్యత కాదు. రాజ్యాంగబద్ధమైన నిబద్ధత’అని జస్టిస్ సూర్యకాంత్ నొక్కి చెప్పారు.
నిందితుల్లో చుట్టప్రక్కల వారే అధికం
చిన్నారులపై పెరిగిపోతున్న హింసపై రాష్ట్ర హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజోయ్‌పాల్ ఆందోళన వ్యక్తం చేశారు. పిల్లలపై లైంగిక వేధింపుల కేసుల నిందితుల్లో 98 శాతం మంది కుటుంబ సభ్యులు, బంధువులు, ఇరుగు పొరుగువారే ఉంటున్నారని తెలిపారు. ‘కొన్ని సందర్భాల్లో తప్పుడు వయసు రికార్డులు న్యాయాన్ని పక్కదారి పట్టించగలవు. పాఠశాలల్లో చేర్పించేటప్పుడే తల్లిదండ్రులు ఖచ్చితమైన వయసు నమోదు చేయించాలి.
పోలీసుల నుంచి న్యాయవ్యవస్థ వరకు ప్రతి ఒక్కరూ ఖచ్చితత్వం, కరుణతో వ్యవహరించాలి’అని సూచించారు. సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘చిన్నారులు, మహిళలకు భద్రత కల్పించేందుకు తమ ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టిందని తెలిపారు. న్యాయం నేరారోపణకు సంబంధించినది మాత్రమే కాదని, వైద్యం, గౌరవంతో ముడిపడిన అంశమని పేర్కొన్నారు. అశ్లీలత, ఆన్‌లైన్ విశృంఖలాలు కొత్త ముప్పులుగా మారాయని ఆందోళన వ్యక్తంచేశారు.
2016లో ప్రారంభమైన భరోసా కేంద్రాలు సత్ఫలితాలు ఇస్తున్నాయని డీజీపీ డాక్టర్ జితేందర్ తెలిపారు. లైంగిక హింస నుంచి చిన్నారులు బయటపడేందుకు పారా మెడికల్ సాయాన్ని అందిస్తూ, వన్‌స్టాప్ సెంటర్లుగా సేవలందిస్తున్నాయని చెప్పారు. యూనిసెఫ్ ఇండియా ప్రతినిధి సింథియా మెక్‌కాఫ్రీ మాట్లాడుతూ.. ‘దేశంలోని పిల్లలు గొంతులేని వారుకాదు. కానీ, వ్యవస్థలు వారిని నిశ్శబ్దంగా ఉండేలా చేశాయి.
మనం వారి గొంతులను విస్తృతం చేయాలి’అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు, అడ్వొకేట్ జనరల్ ఏ.సుదర్శన్‌రెడ్డి, పీపీ పల్లె నాగేశ్వర్‌రావు, పోలీస్ ఉన్నతాధికారులు, రాష్ట్ర న్యాయ సేవల ప్రాధికార సంస్థ సభ్యకార్యదర్శి పంచాక్షరి తదితరులు పాల్గొన్నారు. మధ్యాహ్నం జరిగిన సాంకేతిక విభాగం సమావేశంలో జస్టిస్ మౌషుమి భట్టాచార్య, జస్టిస్ బీ విజయ్‌సేన్‌రెడ్డి, రాష్ట్ర మంత్రి సీతక్క ప్రసంగించారు.