ట్రిపుల్ ఆర్ పరిధిలో ఒక ఎకరానికి చెల్లిస్తున్న పరిహారం ఇది
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ ఆర్) నిర్మాణంతో భూములు కోల్పోతున్న నిర్వాసితులకు పరిహారం పంపిణీ జోరందుకుంది. ఎకరానికి గరిష్టంగా రూ.1.27 కోట్ల చొప్పున చెల్లిస్తున్నారు. 65 నంబరు జాతీయ రహదారి (ముంబై హైవే)ని ఆనుకొని ఉన్న భూములకు ఈ ధర చెల్లిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం పెద్దాపూర్ గ్రామం పరిధిలోని భూములకు ఈ ధర పలికింది.
ఇదే గ్రామంలో హైవేకు కాస్త దూరంలో ఉన్న భూములకు ఎకరానికి రూ.1.01 కోట్లుగా ధర నిర్ణయించారు. తక్కువలో తక్కువగా హత్నూర మండలం దౌల్తాబాద్ గ్రామ శివారులోని భూములకు ఎకరానికి కేవలం రూ.16 లక్షలతోనే సరిపెడుతున్నారు. తమ విలువైన భూములకు ఇంత తక్కువ పరిహారం చెల్లిస్తున్నారని నిర్వాసిత రైతులు పెదవి విరుస్తున్నారు.
రూ.119 కోట్ల పరిహారం చెల్లింపులు
ట్రిపుల్ ఆర్ కోసం సంగారెడ్డి కాల (కాంపిటేటివ్ అథారిటీ ల్యాండ్ అక్విజేషన్) పరిధిలో 526 ఎకరాల భూమి అవసరం ఉంటుందని నేషనల్ హైవే అథారిటీ నిర్ణయించింది. భూసేకరణలో భాగంగా 23 గ్రామాలకు సంబంధించిన 427 ఎకరాల భూసేకరణ అవార్డులు నేషనల్ హైవే అథారిటీ ప్రాజెక్టు డైరెక్టర్ నుంచి అప్రూవల్ అయ్యాయి. ఈ భూములు స్వాధీనం చేసుకున్న రైతుల ఖాతాల్లో ఇప్పటి వరకు రూ.119.50 కోట్లు జమ చేశారు.
అయితే ట్రిపుల్ ఆర్ నిర్మాణంతో కోల్పోతున్న భూములకు ప్రభుత్వం చెల్లిస్తున్న పరిహారం పట్ల నిర్వాసిత రైతులు అసంతృప్తితో ఉన్నారు. దీంతో రెవెన్యూ అధికారులు రైతులతో ఆర్బిట్రేషన్ (మధ్యవర్తిత్వం) మీటింగ్‌లు నిర్వహిస్తున్నారు. అధికారులు రిజిస్ట్రేషన్ విలువ (ఇటీవల కాలంలో జరిగిన లావాదేవీలు) ఆధారంగా పరిహారం లెక్కిస్తున్నారు.
వీలైనంత ఎక్కువ మొత్తంలో పరిహారం
నిర్వాసిత రైతులకు వీలైనంత ఎక్కువ పరిహారం అందేలా చూస్తున్నాం. ఇప్పటికే రిజిస్ట్రేషన్ విలువపై సుమారు 250 శాతం వరకు ధరను పెంచి పరిహారం ఇస్తున్నాం. తమకు ఇచ్చే పరిహారాన్ని పెంచాలని కోరుతూ కొందరు రైతులు కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు. ఆర్బిట్రేషన్ మీటింగ్‌లు నిర్వహిస్తున్నాం. ఐదు నుంచి పది శాతం పరిహారం పెరిగే అవకాశాలు ఉన్నాయి. – గున్నాల రాజేందర్, సంగారెడ్డి ఆర్డీఓ


