టిఫిన్‌ తినలేం.. కాఫీ తాగలేం | Commercial LPG Cylinder Price Reaches Rs 3315 in Hyderabad: Telangana | Sakshi
Sakshi News home page

టిఫిన్‌ తినలేం.. కాఫీ తాగలేం

May 2 2026 4:08 AM | Updated on May 2 2026 4:10 AM

Commercial LPG Cylinder Price Reaches Rs 3315 in Hyderabad: Telangana

హోటళ్లకు ‘గ్యాస్‌ స్ట్రోక్‌’

హైదరాబాద్‌లో రూ.3,315కు చేరిన వాణిజ్య సిలిండర్‌ రేటు

కొరత సాకుతో ఇప్పటికే ప్రైవేట్‌ డీలర్ల దోపిడీ

ఒక్కో సిలిండర్‌కు రూ.5 వేల వరకు వసూలు

మెనూలో కోత..ధరల పెంపుతో నెట్టుకొస్తున్న హోటళ్లు

తాజా భారీ పెంపుతో హోటళ్లు, రెస్టారెంట్లపై తీవ్ర ప్రభావం

భోజనం, అల్పాహారం ప్రియం!

సాక్షి, హైదరాబాద్‌: ఎన్నికలు ముగిసిన వెంటనే కేంద్ర ప్రభుత్వం వ్యాపారుల ‘పొయ్యి’పై నీళ్లు చల్లింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరల అస్థిరతను సాకుగా చూపిస్తూ సామాన్యుడి నడ్డి సైతం విరిచే నిర్ణయం తీసుకుంది. 19 కేజీల వాణిజ్య (కమర్షియల్‌) సిలిండర్‌ ధరను ఏకంగా రూ.993 పెంచడంతో హైదరాబాద్‌లో కమర్షియల్‌ సిలిండర్‌ ధర రికార్డు స్థాయిలో రూ.3,315కి చేరుకుంది. హైదరాబాద్‌లో 19 కేజీల సిలిండర్‌ ధర యుద్ధానికి ముందు రూ. 2,217 ఉంటే.. మార్చి 1న (మొదటి పెంపు) రూ.2,322కు, మే 1న (తాజా పెంపు) రూ.3,315కు చేరింది.

అంటే కేవలం 60 రోజుల వ్యవధిలోనే రూ.1,098 అదనపు భారం పడిందన్న మాట. ముఖ్యంగా పెరిగిన సిలిండర్‌ రేటు హోటళ్లపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం కన్పిస్తోంది. మార్కెట్‌లో నెలకొన్న గ్యాస్‌ కొరతను ఆసరాగా చేసుకుని అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న ప్రైవేట్‌ గ్యాస్‌ కంపెనీలు, కొందరు డీలర్లు..ఇప్పటికే ఒక కమర్షియల్‌ సిలిండర్‌కు బ్లాక్‌లో రూ.5,000 వరకు వసూలు చేస్తున్నారు.

ఇప్పుడు భారీగా ధర పెరగడంతో, ఈ సాకుతో బ్లాక్‌లో అమ్మే రేటు కూడా భారీగా పెంచే అవకాశం ఉండటంతో పెద్ద, చిన్న హోటళ్లు, రెస్టారెంట్లు, టిఫిన్‌ సెంటర్ల నిర్వాహకులు, చిరు వ్యాపారులు, కేటరర్లలో ఆందోళన వ్యక్తమవుతోంది. రోజుకు 2 సిలిండర్లు వాడే టీ బంకులు, చిన్న హోటళ్ల యజమానులపై రోజుకు రూ.3,000 నుంచి రూ.4,000 అదనపు భారం పడుతుందని అంచనా.

ఇప్పటికే మెనూలో కోత..మూత
గ్యాస్‌ కొరత, పెరిగిన ధరతో ఇప్పటికే నగరంలోని అనేక హోటళ్లలో వంటకాల్లో కోత విధించారు. గ్యాస్‌ ఆదా కోసం కొన్ని వంటకాలు తగ్గించేశారు. కొన్ని హోటళ్లు మూతపడ్డాయి. కొత్తగా పెరిగిన గ్యాస్‌ ధర హోటళ్లు, రెస్టారెంట్లు, కేటరింగ్‌ రంగాలను అతలాకుతలం చేసే అవకాశం కన్పిస్తోంది.

రోజువారీ వినియోగం 65 వేల సిలిండర్లపైనే
హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌ పరిధిలో ప్రధాన చమురు సంస్ధలతో పాటు ప్రైవేటు సంస్ధలకు సంబంధించి సుమారు 8.15 లక్షల వాణిజ్య కనెక్షన్లు ఉన్నట్లు పౌర సరఫరాల శాఖ, ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీల నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. రోజుకు సుమారు 65 వేల సిలిండర్లు వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్నారు.

15%–20% వరకు ధరల పెరుగుదల
ప్రస్తుతం ఒక్కో సిలిండర్‌ రీఫిల్‌ ధరపై రూ. 994 పెంపుతో రోజుకు రూ.6.46 కోట్ల అదనపు భారం పడుతోంది. ఈ లెక్కన నెలకు రూ.193.8 కోట్ల భారం పడుతుందన్నమాట. ఇది హోటళ్లలో ఆహారం ధరలపై ప్రభావం చూపించడం ఖాయం. హోటళ్ల యజమానులు ఈ భారాన్ని వినియోగదారులపైనే వేస్తారు. దీంతో హోటళ్లలో ఇడ్లీ మొదలుకుని బిరియానీ వంటి ఆహార పదార్థాల ధరలు 15% నుంచి 20% వరకు పెరిగే అవకాశం ఉందని అంచనా.

మహా హైదరాబాద్‌  పరిధిలో వాణిజ్య గ్యాస్‌ సిలిండర్ల వినియోగం ఇలా..
జిల్లా          వాణిజ్య కనెక్షన్లు (సుమారు)    రోజువారీ డిమాండ్‌   రోజువారీ అదనపు భారం
హైదరాబాద్‌         4,20,000     35,000         రూ. 3,47,90,000
రంగారెడి             2,10,000     18,000          రూ. 1,78,92,000
మేడ్చల్‌–మల్కాజిగిరి     1,85,000     12,000         రూ. 1,19,28,000
 

Advertisement
 
Advertisement
Advertisement