పనుల నాణ్యతలో రాజీ పడొద్దు | CM Revanth Reddy Visits Future City and Inspects Constructions | Sakshi
Sakshi News home page

పనుల నాణ్యతలో రాజీ పడొద్దు

Apr 3 2026 4:22 AM | Updated on Apr 3 2026 4:22 AM

CM Revanth Reddy Visits Future City and Inspects Constructions

ఫ్యూచర్‌ సిటీ పర్యటనలో సీఎం రేవంత్‌

ఎఫ్‌సీడీఏ, స్కిల్స్‌ వర్సిటీ భవన నిర్మాణ పనుల పరిశీలన

జూన్‌ కల్లా రెండింటినీ పూర్తి చేయాలని ఆదేశం

సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఫ్యూచర్‌ సిటీ పనుల నాణ్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడొద్దని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులకు సూచించారు. కేరళ పర్యటన ముగించుకుని గురువారం మధ్యాహ్నం శంషాబాద్‌ విమానాశ్రయం చేరుకున్న సీఎం నేరుగా ఫ్యూచర్‌ సిటీకి చేరుకున్నారు. తొలుత ఫ్యూచర్‌ సిటీ డెవలప్‌మెంట్‌ అథారిటీ (ఎఫ్‌సీడీఏ) భవనాన్ని, ఆ తర్వాత స్కిల్స్‌ యూని వర్సిటీ భవనాన్ని సందర్శించి నిర్మాణ పనులను పరిశీలించారు. మే నాటికి ఎఫ్‌సీడీఏ పనులు, జూన్‌ చివరి నాటికి స్కిల్స్‌ యూనివర్సిటీ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.

అక్కడి నుంచి పవర్‌గ్రిడ్‌ సెంటర్‌కు చేరుకున్నారు. కొంగరకలాన్‌ నుంచి మీర్‌ఖాన్‌పేట్, అక్కడి నుంచి ఆకుతోటపల్లి వరకు ఏర్పాటు చేస్తున్న 330 అడుగుల విస్తీర్ణంలోని గ్రీన్‌ఫీల్డ్‌ రోడ్డు పనులు సహా రేడియల్‌ రోడ్డు పనుల్లో వేగం పెంచాలని సూచించారు. ఫ్యూచర్‌ సిటీలోని ఓవర్‌ హెడ్‌ విద్యుత్‌ లైన్లను తొలగించి ఖర్చుకు వెనుకాడకుండా భూగర్భ విద్యుత్‌ కేబుళ్లను వేయాలని ఆదేశించారు. భారత్‌ ఫ్యూచర్‌ సిటీ భవిష్యత్తు పెట్టుబడులకు స్వర్గధామమని, ఇక్కడ అనేక జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు రాబోతున్నాయని, త ద్వారా వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయని సీఎం ఈ సందర్భంగా చెప్పారు.  

అధికారుల ఉరుకులు, పరుగులు 
మధ్యాహ్నం 3.55కు ఇక్కడికి చేరుకున్న సీఎం..సాయంత్రం 5.10 గంటల సమయంలో తిరుగు ముఖం పట్టారు. సీఎం పర్యటన ఆఖరి నిమిషంలో ఖరారు కావడంతో అధికారులు ఉరుకులు, పరుగులు పెట్టారు. సీఎం వస్తున్న సమాచారం అధికార పార్టీ నేతలకు కూడా లేకపోవడం విశేషం. సీఎం వెంట సీఎస్‌ రామకృష్ణారావు, ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్‌ మిత్తల్, ట్రాన్స్‌కో సీఎండీ కృష్ణభాస్కర్, ఎఫ్‌సీడీఏ కమిషనర్‌ శశాంక, జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి ఉన్నారు. సీఎం రాకకు ముందే పవర్‌ గ్రిడ్‌ కేంద్రానికి చేరుకున్న సీఎస్‌.. విద్యుత్‌ అధికారులతో సమీక్ష నిర్వహించారు.

Advertisement
 
Advertisement
Advertisement