వ్రస్తోత్పత్తులను పరిశీలిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు శ్రీధర్‌బాబు, తుమ్మల తదితరులు
పర్యావరణ పరిరక్షణ దిశగా అభివృద్ధి చేస్తాం
2047 నాటికి దక్షిణాసియా వస్త్ర పరిశ్రమ రాజధానిగా తెలంగాణ
ఇక్కడ వస్త్రోత్పత్తి పరిశ్రమ కాదు.. మనకు ఒక జీవనాధారం
ప్రపంచానికి సరితూగే విధానాలు.. మానవ వనరులే బలం
భారత్‌లో పత్తి ఉత్పత్తి, నాణ్యతలో అగ్రగామిగా తెలంగాణ
హైటెక్స్‌లో ఏషియన్ టెక్స్‌టైల్ కాన్ఫరెన్స్‌లో సీఎం రేవంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: పర్యావరణ పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ గ్రీన్ టెక్స్‌టైల్ హబ్‌లను అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి ప్రకటించారు. 2047 నాటికి తెలంగాణను దక్షిణ ఆసియాకు టెక్స్‌టైల్ రాజధానిగా తీర్చిదిద్దుతామని వెల్లడించారు. యువత, మహిళలను లక్ష్యంగా చేసుకొని సంప్రదాయ వస్త్రోత్పత్తికి ఆధునికతను జోడించి డిజైన్, కుట్టు పని తదితరాల్లో శిక్షణ అందిస్తామని పేర్కొన్నారు. ప్రపంచానికి ఔషధాలు, వ్యాక్సి న్లు అందిస్తున్న తెలంగాణలో తయారయ్యే దుస్తులను ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ ధరించేలా వస్త్ర పరిశ్రమను తీర్చిదిద్దడం లక్ష్యంగా పనిచేస్తామని చెప్పారు.
హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (హెచ్‌ఐసీసీ)లో శుక్రవారం ‘ఏషియన్ టెక్స్‌టైల్స్ కాన్ఫరెన్స్– 2026’(ఎటెక్స్‌కాన్)ను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... ‘శతాబ్దాలుగా కళలు, సంస్కృతి, సాంప్రదాయాల కలబోతగా తెలంగాణ వస్త్ర పరిశ్రమ నిలుస్తోంది. మన జీవన విధానంలో వస్త్ర పరిశ్రమ అంతర్భాగంగా ఉంది. నిజాం కాలంలోనే ప్రపంచం నలుమూలల నుంచి హైదరాబాద్‌కు వచ్చే వ్యాపారులు ముత్యాలు, వస్త్రాలు కొనుగోలు చేసేవారు. పోచంపల్లి ఇక్కత్ మొదలుగద్వాల చీరలు, వరంగల్ డర్రీలు, నారాయణపేట చేనేత వరకు అనేక రకాలైన వ్రస్తోత్పత్తుల్లో తెలంగాణకు ఎంతో పేరు ఉంది’అని సీఎం పేర్కొన్నారు.
పత్తి ఉత్పత్తి నాణ్యతలో అగ్రగామి
‘భారత్‌తోపాటు ప్రపంచ వ్యాప్తంగా పత్తి ఉత్పత్తి, నాణ్యతలోనూ తెలంగాణ అగ్రగామిగా ఉంది. వరంగల్ కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కులో ప్రపంచస్థాయిలో పేరొందిన సంస్థలు దుస్తుల తయారీ పరిశ్రమలను ఏర్పాటు చేశాయి. నైపుణ్యం, సంకల్పం, అత్యుత్తమ మానవ వనరులు, ప్రపంచానికి సరితూగే విధానాలతోపాటు వస్త్ర పరిశ్రమపై తెలంగాణకు దూరదృష్టి కూడా ఉంది. తెలంగాణ పత్తి చేల నుంచి లండన్, న్యూయార్క్, పారిస్, మిలాన్, టోక్యో, దుబాయ్ ఫ్యాషన్ షోల వరకు అనేక అంశాల్లో మేం కలిసి పనిచేస్తున్నాం.
హైదరాబాద్ భారతదేశానికి మాత్రమే కాదు..ప్రపంచానికి కూడా సినిమా నిర్మాణ కేంద్రంగా ఎదుగుతూ హాలీవుడ్ స్థాయికి చేరింది. టాలీవుడ్, బాలీవుడ్ ఇప్పటికే హైదరాబాద్‌ను తమ నిర్మాణ కేంద్రంగా ఉపయోగిస్తున్నాయి. సినిమా రంగం ద్వారా కూడా ఫ్యాషన్ రంగాన్ని ప్రోత్సహిస్తాం. పెట్టుబడులతో వచ్చే వారికి మౌలిక సదుపాయాలు, భూమి, విద్యుత్, నీరు, ఇతర ప్రోత్సాహకాలతోపాటు వేగంగా అనుమతులు మంజూరు చేస్తాం. ప్రపంచాన్ని మార్చగలిగే స్థాయిలో తెలంగాణలో వ్రస్తోత్పత్తి పరిశ్రమ వాతావరణాన్ని నిర్మిద్దాం’అని సీఎం రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు.
నేతన్నకు అందించే సామాజిక న్యాయం : శ్రీధర్‌బాబు
ప్రభుత్వం దృష్టిలో వస్త్రోత్పత్తి అంటే అట్టడుగున ఉన్న నేతన్నకు అందించే సామాజిక న్యాయమని మంత్రి శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. ‘స్వాతంత్య్రం చరఖా, మగ్గం ద్వారా కూడా వస్తుందని మహాత్మాగాంధీ నిరూపించారు. అంతర్జాతీయ సరఫరా గొలుసులో నేతన్నలు కూలీగానే మిగిలిపోకుండా యజమానిగా ఎదగాలనే సంకల్పంతో నేత కార్మికులను ప్రోత్సహిస్తూ అండగా నిలుస్తున్నాం. ఆధునిక సాంకేతికతతో మేడిన్ తెలంగాణ బ్రాండ్‌ను విశ్వవ్యాప్తం చేసేందుకు ‘న్యూ స్వదేశీ విజన్’కు శ్రీకారం చుడుతున్నాం. డిజిటల్ డిజైన్లు, అంతర్జాతీయ మార్కెట్లతో అనుసంధానం ద్వారా తెలంగాణ నేతన్నల నైపుణ్యాన్ని మిలాన్, న్యూయార్క్ వంటి అంతర్జాతీయ ఫ్యాషన్ వేదికలపైకి చేర్చాలని లక్ష్యంతో ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకొని ముందుకెళ్తున్నాం’అని శ్రీధర్‌బాబు ప్రకటించారు.
వేలాది కుటుంబాలకు జీవనాధారం : మంత్రి తుమ్మల
‘తెలంగాణలో టెక్స్‌టైల్ రంగం కేవలం ఒక పరిశ్రమ మాత్రమే కాదు. వేలాది కుటుంబాల జీవనాధారం. మన సంస్కృతి, సంప్రదాయాల ప్రతిబింబం. చేనేత రంగం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో జీవనోపాధి పొందుతున్న కుటుంబాల సంఖ్య అధికంగా ఉంది. ప్రభుత్వం టెక్స్‌టైల్ రంగాన్ని కేవలం ఆర్థిక ప్రగతిగా కాకుండా, ఒక సామాజిక బాధ్యతగా భావిస్తోంది. ‘తెలంగాణ విజన్ 2047’లో టెక్స్‌టైల్ రంగానికి ప్రత్యేక ప్రాధాన్యం కల్పించాం. దీని ద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం అవుతుంది’అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.
– ఎటెక్స్ కాన్ 2026లో భాగంగా ‘రీమేజినింగ్ ది ఫ్యూచర్ ఆఫ్ గ్లోబల్ టెక్స్‌టైల్స్’పై రూపొందించిన నివేదికను సీఎం రేవంత్ విడుదల చేశారు. సదస్సులో టెక్స్‌టైల్ రంగంలోని తాజా ధోరణులు, సాంకేతిక పరిణామాలు, అంతర్జాతీయ మార్కెట్ అవకాశాలపై పలు సెషన్లు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చేనేత, వస్త్ర పరిశ్రమ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, శశాంక, టీజీఐఐసీ ఛైర్మన్ నిర్మల జగ్గారెడ్డి పాల్గొన్నారు.


