ఫ్యూచర్‌ సిటీలో వెంటనే నిర్మాణాలు! | CM Revanth Reddy reviews Industries Department and Future City | Sakshi
Sakshi News home page

ఫ్యూచర్‌ సిటీలో వెంటనే నిర్మాణాలు!

May 21 2026 4:40 AM | Updated on May 21 2026 4:40 AM

CM Revanth Reddy reviews Industries Department and Future City

భూ కేటాయింపులు జరిపిన వెంటనే ప్రారంభించాలి: సీఎం

పరిశ్రమలకు ఈ నిబంధన తప్పనిసరి చేయాలి 

పరిశ్రమల శాఖ, ఫ్యూచర్‌ సిటీపై సీఎం సమీక్ష

జూన్‌లో భూమి పూజకు ఏర్పాట్లు చేయాలి 

‘ఇన్వెస్ట్‌ తెలంగాణ’ పేరుతో పెట్టుబడుల ఆకర్షణకు ప్రత్యేక సెల్‌.. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేవారి కోసం ఎస్కార్ట్‌ ఆఫీసర్‌ వ్యవస్థ 

హైదరాబాద్‌కు వెలుపల జీసీసీల ఏర్పాటుకు ప్రత్యేక పాలసీ.. 1,500 ఎకరాల్లో డేటా సిటీ 

ప్రజాప్రతినిధులు, సివిల్‌ సర్వెంట్లు,జర్నలిస్టులకు 500 ఎకరాలుకేటాయించాలని ఆదేశం 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఫ్యూచర్‌ సిటీలో పరిశ్రమలకు భూముల కేటాయింపుపై ప్రభుత్వం దృష్టి సారించింది. భూ కేటాయింపులు జరిపిన వెంటనే ఆయా పరిశ్రమలు నిర్మాణాలు ప్రారంభించాలనే నిబంధన తప్పనిసరి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ‘ఫ్యూచర్‌ సిటీ పారిశ్రామిక వాడలో వివిధ కంపెనీలు తమ ప్రాంగణాల్లో జూన్‌లో భూమి పూజలు నిర్వహించేలా అవసరమైన ఏర్పాట్లు చేయాలి. ఫ్యూచర్‌ సిటీలో భారీగా పెట్టుబడులు రాబట్టేందుకు వీలైన అన్ని చర్యలు చేపట్టాలి. 

‘ఇన్వెస్ట్‌ తెలంగాణ’పేరుతో పెట్టుబడుల ఆకర్షణకు ప్రత్యేక సెల్‌ ఏర్పాటు చేయాలి. ఆకర్షణీయమైన లోగో, వెబ్‌సైట్‌ రూపొందించాలి. ప్రత్యేక కార్యాలయం ఏర్పాటు చేయాలి. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే వారి కోసం ఎస్కార్ట్‌ ఆఫీసర్‌ వ్యవస్థను రూపొందించాలి. గ్రూప్‌ 1 స్థాయి అధికారిని ఎస్కార్ట్‌ ఆఫీసర్‌గా నియమించే అంశాన్ని పరిశీలించాలి. హైదరాబాద్‌ బయట కూడా గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్లు (జీసీసీలు) ఏర్పాటు చేసేలా ప్రత్యేక పాలసీ తీసుకురావాలి.

నిజామాబాద్, కరీంనగర్, వరంగల్‌ హైవేల వెంట జీసీసీలు, డేటా సెంటర్లు ఏర్పాటు చేసే కంపెనీలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వాలి..’అని సీఎం ఆదేశించారు. బుధవారం ఎంసీఆర్‌ హెచ్‌ఆర్‌డీలోని బోధి పెవిలియన్‌లో పరిశ్రమల శాఖ, ఫ్యూచర్‌ సిటీలో భూ కేటాయింపులు, పరిశ్రమల ఏర్పాటుపై సీఎం సమీక్ష నిర్వహించారు. వివిధ అంశాలపై అధికారులకు ఆదేశాలు, సూచనలు ఇచ్చారు. 

ఫ్యూచర్‌ సిటీలో నెట్‌ జీరో విధానాలు 
‘భారత్‌ ఫ్యూచర్‌ సిటీ (బీఎఫ్‌సీ)లో ప్రపంచ స్థాయి మౌలిక వసతులతో పాటు పర్యావరణహిత నెట్‌ జీరో విధానాలు అమలు చేయాలి. ఎక్కడా రాజీ పడొద్దు. అంతర్జాతీయ స్థాయి నగరాలను అధ్యయనం చేయాలి. అంతర్జాతీయ స్థాయి సంస్థలను ఫ్యూచర్‌ సిటీకి తీసుకుని రావాలి. మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేసిన తర్వాతే భూ కేటాయింపులు చేయాలి. ఐటీ, ఇతర ఉద్యోగ అవకాశాలు హైదరాబాద్‌కే పరిమితం కాకుండా ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు విస్తరించాలి. ‘‘బియాండ్‌ క్యూర్‌‘ (కోర్‌ అర్బన్‌ రీజియన్‌కు ఆవలి) ప్రాంతాలను గుర్తించి అక్కడ ఐటీ, డేటా సెంటర్ల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలి. 

హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో ఐటీ విస్తరణ పెద్దగా లేనిచోట్ల కూడా డేటా సెంటర్ల ఏర్పాటు అవకాశాలను పరిశీలించాలి. తమిళనాడు, గుజరాత్‌ పారిశ్రామిక విధానాన్ని కూడా అధ్యయనం చేయాలి. పెట్టుబడిదారులకు ఒకే వేదికపై అన్ని అనుమతులు, సేవలు అందేలా వ్యవస్థ రూపొందించాలి. కేంద్రం ప్రకటించిన ఐదు హెల్త్‌ క్లస్టర్లలో ఒకటి ఫ్యూచర్‌ సిటీ వచ్చేలా చర్యలు తీసుకోవాలి. అవసరం అయితే ప్రధాని మోదీని కలిసి హెల్త్‌ క్లస్టర్‌ కేటాయించాలని విజ్ఞప్తి చేద్దాం..’అని ముఖ్యమంత్రి చెప్పారు.  

ఏఐ సిటీలో పనులు వెంటనే ప్రారంభించాలి 
‘ఫ్యూచర్‌ సిటీలో ప్రతిపాదిత ఏఐ సిటీలో పనులను వెంటనే ప్రారంభించాలి. ప్రపంచంలోనే గొప్ప ఏఐ సదుపాయాలుండేలా చూడాలి. ఇక్కడ స్థాపించే కంపెనీలన్నీ నైపుణ్యాభివృద్ధి కోసం యంగ్‌ ఇండియా స్కిల్స్‌ యూనివర్సిటీతో ఒప్పందాలు కుదుర్చుకునేలా చూడాలి. 1,500 ఎకరాల్లో డేటా సిటీ ఏర్పాటు చేయాలి. డేటా సిటీ నీటి అవసరాల కోసం మురుగునీటి నిర్వహణ ప్లాంట్లను (ఎస్‌టీపీలను) వినియోగించాలి. 

జీసీసీలు, డేటా సెంటర్ల కోసం కరీంనగర్, వరంగల్, విజయవాడ రోడ్లకు సమీపంలో ఉన్న ప్రభుత్వ భూములు గుర్తించాలి. ప్రజా ప్రతినిధులు, సివిల్‌ సర్వీస్‌ అధికారులు, జర్నలిస్టులకు 500 ఎకరాలు కేటాయించాలి. బుల్లెట్‌ రైల్‌ కోసం భూ సేకరణ వెంటనే ప్రారంభించాలి. మూడు నెలల్లో ప్రభుత్వ కార్యాలయాలు టీ ఫైబర్‌కు కనెక్ట్‌ కావాలి..’అని సీఎం ఆదేశించారు. 

కాగా ఇప్పటికే టీ ఫైబర్‌కు మారిన ప్రభుత్వ కార్యాలయాల నుంచి రూ.54 కోట్ల ఆర్డర్లు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. సమీక్షలో ఐటీ, వాణిజ్య శాఖ మంత్రి శ్రీధర్‌బాబు, సీఎస్‌ కె.రామకృష్ణారావు, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్‌రెడ్డి, టీజీఐఐసీ వైస్‌ చైర్మన్‌ శశాంక, పరిశ్రమల శాఖ కమిషనర్‌ నిఖిల్‌ చక్రవర్తి, ఐటీ శాఖ సంయుక్త కార్యదర్శి అనుదీప్‌ దురిశెట్టి ఇతర అధికారులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement