
హైదరాబాద్: తెలంగాణలో భారీ వర్షాలు పడే అవకాశం ఉండటంతో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలిని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. వర్ష ప్రభావం ఎక్కువగా ఉన్న జిల్లాల్లో ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ బృందాలను తరలించాలని ముందుగా ఆదేశాలు జారీ చేశారు.
లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, చెరువులు, రిజర్వాయర్లు, కుంటల దగ్గర ఇసుక బస్తాలను ముందుగానే సిద్ధంగా ఉంచాలన్నారు. ప్రజల వినతులపై తక్షణమే స్పందించాలన్నారు సీఎం రేవంత్.
ఇదిలా ఉంచితే, తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. దీనిలో భాగంగా భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయి. ఇక ఆదిలాబాద్, కొమురం భీం, జగిత్యాల, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లా, వరంగల్, ఖమ్మం, సూర్యాపేట జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు.