కృష్ణా జలాల్లో 904 టీఎంసీలే లక్ష్యం: సీఎం రేవంత్‌ | CM Revanth Reddy advice to legal experts on Krishna Waters | Sakshi
Sakshi News home page

కృష్ణా జలాల్లో 904 టీఎంసీలే లక్ష్యం: సీఎం రేవంత్‌

Sep 14 2025 5:42 AM | Updated on Sep 14 2025 5:42 AM

CM Revanth Reddy advice to legal experts on Krishna Waters

నీటిపారుదలశాఖపై సమీక్షలో సీఎం రేవంత్‌రెడ్డి

23, 24, 25 తేదీల్లో ట్రిబ్యునల్‌ ముందు బలంగా తెలంగాణ వాదన వినిపించాలని న్యాయ నిపుణులకు సీఎం సూచన 

మంత్రి ఉత్తమ్‌తో కలిసి సమీక్ష 

అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులు, ఉమ్మడి ఏపీలో ఇచ్చిన జీవోలను ట్రిబ్యునల్‌ ముందుంచాలని ఆదేశం

సాక్షి, హైదరాబాద్‌: కృష్ణా జలాల్లో తెలంగాణకు 904 టీఎంసీల నీటిని సాధించడమే లక్ష్యంగా వాదనలు వినిపించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి న్యాయ నిపుణులు, నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు. కృష్ణా జలాలపై ఈ నెల 23, 24, 25 తేదీల్లో బ్రిజేష్‌ ట్రిబ్యునల్‌ వద్ద వాదనలు వినిపించాల్సి ఉన్న నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కలిసి ఇంటిగ్రేటెడ్‌ పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రంలో సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది సీఎస్‌ వైద్యనాథన్, కేంద్ర జల సంఘం మాజీ చైర్మన్‌ ఎస్‌కే వోహ్రా, ప్రభుత్వ నీటిపారుదల శాఖ సలహాదారు ఆదిత్యనాథ్‌దాస్, ఆ శాఖ ముఖ్యకార్యదర్శి రాహుల్‌బొజ్జా, కార్యదర్శి పీజీ పాటిల్, చీఫ్‌ ఇంజనీర్లతో శనివారం సమీక్షించి, వారికి దిశానిర్దేశం చేశారు. 

కృష్ణానదిలో నికర జలాలైనా, మిగులు జలాలైనా, వరద జలాలైనా సరే.. తెలంగాణకు చెందాల్సిన నీటివాటాలో ఒక చుక్క నీరు కూడా వదులుకునేది లేదని సీఎం చెప్పారు. న్యాయ నిపుణులకు అవసరమైన ఆధారాలన్నీ ఇవ్వాలని నీటిపారుదల శాఖ అధికారులను సీఎం ఆదేశించారు. స్వయంగా మంత్రి ఉత్తమ్‌ ఢిల్లీకి వెళ్లి ఈ విచారణలో పాల్గొంటారని ముఖ్యమంత్రి తెలిపారు. 

ఉమ్మడి రాష్ట్రం నుంచి ఇప్పటి వరకు కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులు, నిర్మించ తలపెట్టిన ప్రాజెక్టులు, అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులు, నిర్లక్ష్యంగా వదిలేసిన ప్రాజెక్టుల వివరాలన్నీ ట్రిబ్యునల్‌ ముందు ఉంచాలని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో జారీ చేసిన జీవోలు, మెమోలు, డాక్యుమెంటన్నీ సిద్ధంగా ఉంచుకోవాలని, అప్పటి నుంచి ఇప్పటివరకు ఉన్న ప్రాజెక్టుల వివరాలన్నీ ట్రిబ్యునల్‌కు అందించాలని తెలిపారు.  

గత ప్రభుత్వంలో అన్యాయం... 
గత ప్రభుత్వం కృష్ణా జలాల్లో రావాల్సిన నీటి వాటాను సాధించకపోగా, ఏపీకీ 512 టీఎంసీలు కట్టబెట్టి, 299 టీఎంసీల వాటాకు ఒప్పుకొని తెలంగాణకు తీరని అన్యాయం చేసిందనే చర్చ ఈ సమీక్షలో వచ్చింది. అప్పటి సీఎం కేసీఆర్‌ 299 టీఎంసీల వాటాకు ఒప్పుకున్న విషయాన్ని ఏపీ ఇప్పుడు ట్రిబ్యునల్‌ముందుకు తెచ్చిందని న్యాయ నిపుణులు సీఎం రేవంత్‌కు ఈ సందర్భంగా వివరించారు. గడిచిన పదేళ్లలో అధికారంలో ఉన్న కేసీఆర్‌ ప్రభుత్వం కృష్ణా జలాల్లో న్యాయపరంగా రావాల్సిన నీటి కోటాను సాధించటంలో దారుణంగా విఫలమైందన్నారు. 

కృష్ణానదిపై తలపెట్టిన పాలమూరు నుంచి డిండి వరకు ప్రాజెక్టులన్నింటినీ పెండింగ్‌లో పెట్టిందని చెప్పారు. నీటి వాటాల విషయంలో తీరని ద్రోహం చేసిందన్నారు. దిగువ రాష్ట్రాల హక్కులతోపాటు నదీ వాటాల పంపిణీ న్యాయ సూత్రాల ప్రకారం కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రానికి కృష్ణాలో 904 టీఎంసీల నీటి వాటా రావాల్సి ఉందని, అందుకు అనుగుణంగా వాదనలు సిద్ధం చేయాలని సీఎం స్పష్టం చేశారు.  

ఏపీ అక్రమంగా నీటిని తరలించిన విషయంపై ... 
ఏపీ ప్రభుత్వం కృష్ణా జలాలను అక్రమంగా తరలించుకుపోయిందని, ఆ విషయాన్ని ట్రిబ్యునల్‌ముందుకు తీసుకురావాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. శ్రీశైలం రిజర్వాయర్‌ నిండకముందే, పోతిరెడ్డిపాడు నుంచి రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌స్కీమ్‌ద్వారా రోజుకు పది టీఎంసీల నీటిని ఏపీ మళ్లిస్తుందని, ఇతర బేసిన్లకు తరలించుకుపోతోందన్నారు. ఎక్కడ పడితే అక్కడ కాల్వల సామర్థ్యం పెంచుకోవటంతోపాటు పట్టిసీమ, పులిచింతల, చింతలపాడు వరకు ఏపీ అక్రమంగా నీటిని తరలిస్తున్న అంశాలన్నీ ఆధారాలతో సహా ట్రిబ్యునల్‌కు నివేదించాలని, అందుకు సన్నద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. 

కృష్ణా నీటిని ఏపీ అక్రమంగా మళ్లించటంతో శ్రీశైలం, నాగార్జునసాగర్‌తో పాటు పులిచింతల వద్ద ఉన్న జల విద్యుత్‌ ప్రాజెక్టులు మూతపడే ప్రమాదం ముంచుకొచ్చిందన్నారు. తక్కువ ఖర్చుతో ఉత్పత్తయ్యే జల విద్యుత్తు ఉత్పత్తికి విఘాతం కలుగుతోందని తెలిపారు. ఈ విషయాలన్నీ ట్రిబ్యునల్‌ ఎదుట వినిపించాలని సీఎం ఆదేశించారు.  

తెలంగాణకు అన్ని అర్హతలు.... 
కొత్తగా ఏర్పడిన రాష్ట్రం కావటంతో తెలంగాణకు రావాల్సిన హక్కులు, నీటి వాటాలను సాధించుకునేందుకు అన్ని అర్హతలున్నాయని సీఎం అన్నారు. సాగునీటి, తాగునీటి అవసరాలతోపాటు మెట్ట ప్రాంతం, కరువు ప్రాంతమైన ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలకు కృష్ణా జలాలు తప్ప గత్యంతరం లేదనే విషయాన్ని ట్రిబ్యునల్‌ దృష్టికి తీసుకువెళ్లాలని చెప్పారు. ఇప్పటి వరకు తెలంగాణలో తలపెట్టిన ప్రాజెక్టులు పూర్తి చేయకపోవడం వల్లనే కృష్ణా జలాశయాలను రాష్ట్రం వినియోగించుకోలేకపోయిందని గుర్తు చేయాలన్నారు. తెలంగాణ తరఫున వాదనలను వినిపించేందుకు ఇదే సరైన అవకాశమని సీఎం చెప్పారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement