ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్‌రెడ్డి. చిత్రంలో తుమ్మల, మహేశ్‌గౌడ్ తదితరులు
సమగ్ర సంక్షేమ కార్డు రూపకల్పనకు సీఎం రేవంత్ ఆదేశం
రాష్ట్రంలోని ప్రతి పౌరుడి పూర్తి వివరాలు అందుబాటులోకి..
శాఖల వారీగా పథకాలు, లబ్ధిని స్పష్టంగా వివరించేలా డిజైన్
లబ్ధిదారుల డేటాను సేకరించేందుకు ప్రత్యేక డ్రైవ్
సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే వివరాలతో అనుసంధానం
ప్రజల ఆరోగ్య ప్రొఫైల్ కూడా సంక్షేమ కార్డుతో లింక్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పౌరులకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల వివరాలన్నీ ఒకే కార్డులో ఉండే విధంగా ‘సమగ్ర సంక్షేమ కార్డు’(యూనిఫైడ్ కార్డ్)ను రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎవరికి, ఏయే ప్రభుత్వ శాఖల ద్వారా ఏయే సంక్షేమ పథకాల కింద ఎంత మేర లబ్ధి చేకూరుతోందో స్పష్టంగా తెలిసేలా ఈ కార్డు ఉండాలని సూచించారు. తక్షణమే ఇందుకు అవసరమైన చర్యలు ప్రారంభించాలని, అన్ని ప్రభుత్వ శాఖల నుంచి లబ్ధిదారుల డేటాను సేకరించేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని ఆదేశించారు. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబుతో కలిసి గురువారం ఆయ న సీఎస్ రామకృష్ణారావు, సీఎం ప్రత్యేక కార్యదర్శి బి.అజిత్‌రెడ్డి, ఐటీ శాఖ సంయుక్త కార్యదర్శి అనుదీప్ దురిశెట్టి తదితరులతో సమీక్ష నిర్వహించారు.
అర్హులకు పథకాలు..అనర్హుల గుర్తింపు
సమగ్ర సంక్షేమ కార్డు ద్వారా రాష్ట్రంలోని ప్రతి పౌరుడి పూర్తి సంక్షేమ ప్రొఫైల్ ఒకేచోట అందుబాటులోకి వస్తుందని సీఎం ఈ సందర్భంగా చెప్పారు. ఈ డేటాను అన్ని కోణాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సహాయంతో విశ్లేషిస్తే సంక్షేమ పథకాల అమలులో పారదర్శకత పెరుగుతుందని చెప్పారు. అసలైన అర్హులకు పథకాలు మరింత కచ్చితంగా చేరతాయని అన్నారు. అదే సమయంలో అనర్హులను గుర్తించడం కూడా సులభమవుతుందన్నారు. ప్రతి శాఖ వేర్వేరుగా కార్డులు ఇచ్చే బదులు, ఐటీ శాఖ ఆధ్వర్యంలో ఒకే సమగ్ర సంక్షేమ కార్డు ఉండాలని సీఎం సూచించారు. సాంకేతికతపై పట్టున్న, చురుగ్గా పనిచేసే యువ ప్రభుత్వ అధికారులను ఈ ప్రక్రియకు వినియోగించాలని ఆదేశించారు.
కార్డుకు ఆధార్ తరహా ప్రత్యేక నంబర్
ఈ కార్డులో ఆరోగ్యశ్రీ, ముఖ్యమంత్రి సహాయ నిధి, ఫీజు రీయింబర్స్‌మెంట్, కార్మిక శాఖ, విద్యా శాఖ, ఇన్సూరెన్స్ పథకాలు, ప్రభుత్వం తీసుకువస్తున్న బీమా తదితర పథకాల వివరాలు ఉండాలని ముఖ్యమంత్రి చెప్పారు. ఈ కార్డుకు అవసరమైతే ఆధార్ నంబర్ తరహాలో రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక యూనిక్ ఐడెంటిటీ నంబర్ ఇచ్చే అంశంపైనా ఆలోచన చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే వివరాలను ఈ కార్డుకు అనుసంధానించాలని సూచించారు. ప్రజల ఆరోగ్య ప్రొఫైల్‌ను కూడా లింక్ చేయాలన్నారు. పేదలకు సంక్షేమ ఫలాలు ఖచ్చితంగా చేరేలా, ప్రభుత్వం అమలు చేసే ప్రతి పథకం ప్రభావాన్ని అంచనా వేసేలా కార్డు ఉండాలని స్పష్టం చేశారు.
కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల వివరాలు సేకరించండి
వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఖ్య, ఇతర వివరాలను సేకరించాలని ఐటీ శాఖను సీఎం ఆదేశించారు. ఇందులో ప్రధానంగా ఏఐ ఆధారిత ప్రొఫైలింగ్ ఉండాలన్నారు. ఎక్కడైనా మరణ ధ్రువీకరణ పత్రం జారీ అయితే, అక్కడి నుంచి ఆ సమాచారం చేయూత పెన్షన్ డేటాబేస్‌కు చేరాలని, దాని ఆధారంగా వెంటనే చర్యలు తీసుకోగలగాలని చెప్పారు.
కేరళ గల్ఫ్ విధానాలపై అధ్యయనం
కేరళ నుంచి గల్ఫ్‌కు వలస వెళ్లే ఉద్యోగులకు అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేయాలని సీఎం అధికారులకు సూచించారు. నైపుణ్యాభివృద్ధి, శిక్షణ కార్యక్రమాలతో పాటు, పాస్‌పోర్ట్‌లు, వీసాల జారీకి సంబంధించిన సమాచారం ఒకేచోట అందుబాటులో ఉంచితే, అనధికార ఏజెంట్ల ప్రమేయం తగ్గుతుందని చెప్పారు.


