యాదాద్రి: మహా కుంభ సంప్రోక్షణలో పాల్గొన్న సీఎం కేసీఆర్‌

CM KCR Yadadri Temple Visits Updates - Sakshi

Updates

సీఎం కేసీఆర్‌కు ఘన సన్మానం
వైటీడీఏ, దేవస్థానం తరపున ముఖ్యమంత్రి కేసీఆర్‌ను వైస్‌ ఛైర్మన్‌ కిషన్‌రావు, ఈవో ఘనంగా సన్మానించారు. అనంతరం యాదాద్రి ఆలయ పునర్నిర్మాణంలో పాలుపంచుకున్న వారిని సీఎం కేసీఆర్‌ సన్మానించారు. ఆర్కిటెక్‌ ఆనందసాయి, ప్రధాన స్తపతి సుందర్‌ రాజన్‌, ఈవో గీతారెడ్డి, రుత్వికులు, పూజారులను సీఎం సన్మానించారు.

తొలి పూజ నిర్వహించిన సీఎం కేసీఆర్‌
నరసింహస్వామివారి ప్రధాన ఆలయ ముఖద్వారాన్ని సీఎం కేసీఆర్‌ ప్రారంభించారు. అనంతరం నరసింహస్వామివారిని మొదటి దర్శనం చేసుకున్నారు. స్వామివారి గర్భాలయంలో తొలి పూజ నిర్వహించారు.

11.56AM

యాదాద్రి మహా కుంభ సంప్రోక్షణ క్రతువు. మహా కుంభ సంప్రోక్షణ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం కేసీఆర్‌ దంపతులు. దివ్య విమానంపై సుదర్శన చక్రానికి కేసీఆర్‌ ప్రత్యేక పూజలు. పవిత్ర జలాలతో అభిషేకం చేసిన సీఎం కేసీఆర్‌ దంపతులు. సుదర్శన స్వర్ణ చక్రానికి యాగ జలాలతో సంప్రోక్షణ. కేసీఆర్‌ దంపతులకు వేద ఆశీర్వచనాలు అందజేసిన అర్చకులు

10: 57AM

సప్త రాజగోపురాల కళాశాల వద్ద సిద్ధంగా ఉన్న వేద పండితులు, మంత్రులు. దివ్య విమాన గోపురం సుదర్శన చక్రం వద్ద మహా కుంభ సంప్రోక్షణలో పాల్గొన్న సీఎం కేసీఆర్, శోభ దంపతులు, మనుమడు హిమాన్ష్, ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్.

మహా కుంభ సంప్రోక్షణకు హాజరైన సీఎం కేసీఆర్ కూతురు కవిత, 15 మంది మంత్రులు, శాసన మండలి చైర్మన్, శాసనసభ స్పీకర్, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, విప్స్, ఎమ్మెల్సీలు.

10:14AM

యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి శోభాయాత్ర ప్రారంభమైంది. బాలాలయం నుంచి యాత్ర ప్రారంభం కాగా, ఇందులో సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రులు, అర్చకులు, వేదపండితులు పాల్గొన్నారు.మంగళవాయిద్యాల నడుమ శోభయాత్ర కొనసాగుతోంది.

(మరిన్ని ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) 

సాక్షి, యాదాద్రి: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి స్వయంభూ దర్శన ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా సీఎం కేసీఆర్ దంపతులు యాదాద్రికి చేరుకున్నారు.  సీఎం కేసీఆర్‌ దంపతులతో పాటు మంత్రులు జగదీష్ రెడ్డి, హరీష్ రావు, ఇంద్రకరణ్ రెడ్డి, మల్లారెడ్డి, పువ్వడ అజయ్ కుమార్, విప్ గొంగిడి సునీత తదితరులు యాదాద్రికి చేరుకున్నారు.

ఉదయం 11.55 గంటలకు మహాకుంభ సంప్రోక్షణ మొదలవుతుంది. ఆలయ పూజారులు, రుత్వికులు, వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య ఏకకాలంలో మహాకుంభ సంప్రోక్షణ జరుగుతుంది. గోపురాలు, దైవ సన్నిధులు, ఉప ఆలయాలు, ప్రాకార మండపాల వద్ద మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్మన్లు, ఉన్నతాధికారులు సంప్రోక్షణలో పాల్గొంటారు. 

తర్వాత గర్భాలయంలో సీఎం కేసీఆర్‌ తొలి పూజ చేస్తారు. అర్చకులు సీఎం కేసీఆర్‌తోపాటు మంత్రులు, ప్రజా ప్రతినిధులు, అధికారులకు వేదాశీర్వచనం, తీర్థప్రసాదాలను అందజేస్తారు. అనంతరం ఉత్తర రాజగోపురం ఎదురుగా ఏర్పాటు చేసిన వేదిక వద్ద యాదాద్రి ఆలయ పునర్నిర్మాణంలో భాగస్వాములైన వారందరినీ సీఎం సన్మానిస్తారు. ప్రెసిడెన్షియల్‌ సూట్‌ సమీపంలోని యాగశాల స్థలం వద్ద మధ్యాహ్న భోజనాలు చేస్తారు.

యాదాద్రీశుడి దర్శనానికి ఇతర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులను మధ్యాహ్నం 3 గంటల తర్వాతే అనుమతించనున్నారు. ఉదయం నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు యాదాద్రికి వచ్చే వాహనాల విషయంగా ట్రాఫిక్‌ పోలీసులు ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. 
సూర్యాపేట, నల్లగొండ, హైదరాబాద్‌ నుంచి వచ్చే భక్తుల వాహనాలను యాదగిరిగుట్టకు సమీపంలోని వడాయిగూడెం వద్ద నిలపాలి. 
కీసర, సిద్దిపేట, గజ్వేల్, తుర్కపల్లి నుంచి వచ్చే భక్తుల వాహనాలను మల్లాపురం వద్ద ఆపేస్తారు. 
రాజాపేట వైపు నుంచి వచ్చే భక్తుల వాహనాలు ప్రెసిడెన్షియల్‌ సూట్‌ సమీపంలోని స్పెక్ట్రా వెంచర్‌లో నిలపాలి. 
వరంగల్, జనగాం, ఆలేరు నుంచి వచ్చే భక్తుల వాహనాలను వంగపల్లి సమీపంలో నిలిపివేస్తారు. ఈ వాహనాలన్నింటినీ మధ్యాహ్నం 3 గంటల తర్వాతే యాదగిరిగుట్ట పట్టణంలోకి అనుమతిస్తారు.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top