కొత్త సెక్రటేరియట్ నిర్మాణ పనులను పరిశీలించిన సీఎం కేసీఆర్‌

Cm Kcr Inspects New Secretariat Construction Works Building Hyderabad - Sakshi

కొత్త సచివాలయం నిర్మాణంపై సీఎం ఆదేశాలు

నాణ్యత విషయంలో రాజీ పడొద్దని సూచన.. ప్రాంగణమంతా కలియతిరిగిన ముఖ్యమంత్రి

పనుల్లో వేగం, పురోగతిపై సంతృప్తి వ్యక్తం చేసిన కేసీఆర్‌

సాక్షి, హైదరాబాద్‌: కొత్త సచివాలయం భవనాన్ని సర్వాంగ సుందరంగా, దేశం గర్వించేలా తీర్చిదిద్దాలని, నాణ్యత విషయంలో రాజీ పడొద్దని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. నిర్మాణ పనులను సత్వరం పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని కోరారు. నిర్మాణంలో ఉన్న సచివాలయాన్ని గురువారం ఆయన సందర్శించి పనులను పరిశీలించారు. పనుల వేగం, పురోగతిపై సంతృప్తి వ్యక్తం చేశారు.

ఈ మేరకు రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, అధికారుల కృషిని అభినందించారు. మంత్రి, అధికారులు, నిర్మాణ సంస్థ ఇంజనీర్లతో చర్చించారు. నిర్మాణంలో ఉన్న మినిస్టర్‌ చాంబర్లు, పార్కింగ్‌ ఏరియాలు, సెక్రటరీలు, వీఐపీల చాంబర్లను పరిశీలిస్తూ అప్పటికప్పుడు అధికారులకు పలు సూచనలిచ్చారు. సచివాలయ ప్రాంగణమంతా కలియతిరిగి..తుది దశ నిర్మాణంలో చేపట్టవలసిన ఎలివేషన్‌ తదితర పనులకు సూచనలు చేశారు. 

ఎలివేషన్‌ ప్రకాశవంతంగా ఉండాలి
సచివాలయం బాహ్య అలంకరణలో భాగంగా గోడలకు వేసే గ్లాడింగ్‌ టైల్స్, గ్రానైట్స్, తదితర మోడళ్లను అధికారులు ప్రదర్శించి చూపారు. వాటి నాణ్యత, కలర్, డిజైన్లను పరిశీలించిన సీఎం.. ఎలివేషన్‌ ప్రకాశవంతంగా, అందంగా కనిపించేలా చూడాలన్నారు. తన వెంట వచ్చిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి సహా పలువురి అభిప్రాయాలను తెలుసుకుని వాటిలో కొన్ని మోడళ్లను ఫైనల్‌ చేశారు. మోడల్‌ వాటర్‌ ఫౌంటెయిన్, లాండ్‌ స్కేప్,  విశ్రాంతి గదులు, మీటింగ్‌ హాళ్లను కేసీఆర్‌ పరిశీలించారు.

కాగా స్కై లాంజ్‌ నిర్మాణం గురించి సీఎంకు అధికారులు వివరించారు. నిర్మాణం పూర్తి చేసుకున్న తర్వాత ఉద్యోగులు ప్రశాంతంగా పనిచేసేందుకు అనువైన వాతావరణం కల్పించేలా నిర్మించిన కార్యాలయాలు, విశాలమైన కారిడార్లను పరిశీలించిన కేసీఆర్‌ సంతోషం వ్యక్తం చేశారు. పనుల్లో వేగం ఇదే విధంగా ముందుకు కొనసాగించాలన్నారు. దేశంలోని ఇతర రాష్ట్రాల్లో ఉన్న సచివాలయ నిర్మాణాలను పరిశీలించాలని, అందులో మంచి అంశాలను స్వీకరించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో మంత్రులు ప్రశాంత్‌ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డితో పాటు ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌ రెడ్డి, చీఫ్‌ సెక్రటరీ సోమేశ్‌ కుమార్, ఆర్‌అండ్‌బీ ఈఎన్సీ గణపతి రెడ్డి, ప్రభుత్వ వాస్తు సలహాదారు సుద్దాల సుధాకర్‌ తేజ, ఆర్‌అండ్‌బీ, పోలీసు అధికారులు, నిర్మాణ ఏజెన్సీ షాపూర్‌ జీ పల్లోంజీ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.  

చదవండి: Bengaluru Suburban Railway Project: కూ.. చుక్‌ చుక్‌ రైలు వచ్చేది ఎప్పుడో..

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top