సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పెట్రోల్, డీజిల్ కొరత లేదని సివిల్ సప్లయ్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర క్లారిటీ ఇచ్చారు. ఎన్నికల తర్వాత పెట్రోల్ ధరలు పెరుగుతాయనే అపోహలు ప్రజల్లో ఉన్నాయి. సోషల్ మీడియా ప్రచారాన్ని ప్రజలు నమ్మకండి. ఇంధనం ఎంత అవసరమో అంతే కొనుగోలు చేయండి అని వాహనదారులకు సూచించారు.
తెలంగాణ సివిల్ సప్లయ్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తాజాగా సాక్షితో మాట్లాడుతూ..‘రాష్ట్రంలో ఎక్కడ పెట్రోల్, డీజిల్ కొరత లేదు. పబ్లిక్ ఆందోళన వల్లే ఈ కొరత ఏర్పడింది. ఒక రోజుకు 13వేల కిలో లీటర్ల సప్లై చేసేది.. నిన్న ఒక్క రోజే 30వేల కిలో లీటర్ల సరఫరా చేశాం. పెట్రోల్ బంకుల్లో స్టాక్ ఉన్నప్పటికీ నో స్టాక్ పెట్టిన, రోజువారీ కంటే ఎక్కువ అమ్మకాలు జరిగాయి. ఎల్పీజీ, సీఎన్జీ, పెట్రోల్, డీజిల్ సరఫరాపై ఆన్‌లైన్‌లో మానిటరింగ్ చేస్తున్నారు. ధరలు పెరుగుతాయని భయంతో ప్రజలు ఇలా చేస్తున్నారు.
దాదాపు 70, 80 రోజుల వరకు స్టాక్ అందుబాటులో ఉంది. ప్రజలకు ఇబ్బంది కలగకుండా జిల్లా కలెక్టర్లు మాకు సహకరిస్తున్నారు. గతవారం ఇండస్ట్రియల్ డీజిల్ ధరలు పెరగడంతో లాస్ తగ్గించుకోవడానికి రెగ్యులర్ బంకులలో డీజిల్ బయింగ్ చేయడం వల్ల మనకు కొరత ఏర్పడింది. సోషల్ మీడియా ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దు. ఇంధనం ఎంత అవసరమో అంతే కొనుగోలు చేయండి. క్రెడిట్ లిమిట్‌పై జరుగుతున్న ప్రచారం కరెక్ట్ కాదు. అందరు డీలర్లకు అన్ని రకాలుగా సరఫరా జరుగుతుంది.


