దక్షిణ మధ్య రైల్వే రైళ్ల వేళల్లో మార్పు 

Change in the timings of South Central Railway trains - Sakshi

అక్టోబరు ఒకటి నుంచి అమల్లోకి 

673 రైళ్ల వేగం పెంపు 

సాక్షి, హైదరాబాద్‌: రైళ్ల వేళలను దక్షిణ మధ్య రైల్వే సవరించింది. ప్రతి సంవత్సరం రైల్వే పరిధిలో చోటుచేసుకునే మార్పుల ఆధారంగా సమయాలను మారుస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సంవత్సరం అక్టోబరు 1 నుంచి కొత్త వేళలు అందుబాటులోకి రానున్నాయి. ఇక నడికుడి మార్గంలో రెండో లైను అందుబాటులోకి రావటంతో, కాజీపేట మీదుగా వెళ్లే కొన్ని రైళ్లను ఈ మార్గం గుండా మళ్లించారు.

కొన్ని ప్యాసింజర్‌ రైళ్లను ఎక్స్‌ప్రెస్‌ రైళ్లుగా, మరికొన్ని ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లుగా మార్చారు. కొన్నింటి వేగాన్ని పెంచారు. ప్రస్తుతం ఉన్న వేళల్లో ఒక్కో రైలుకు 5 నుంచి 10 నిమిషాల పాటు మారాయి. ఆ వివరాలు దక్షిణ మధ్య రైల్వే తన వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. అన్ని ప్రధాన స్టేషన్‌లలో వాటి సమాచారాన్ని అందుబాటులో ఉంచింది.  

ఎక్స్‌ప్రెస్‌ నుంచి సూపర్‌ఫాస్ట్‌ రైళ్లుగా మారినవి ఇవే.. 
సికింద్రాబాద్‌–మణుగూరు ఎక్స్‌ప్రెస్‌ (కొత్త నెం.02745/02746), కాచిగూడ–మంగళూరు సెంట్రల్‌ ఎక్స్‌ప్రెస్‌ (02777/02778), సికింద్రాబాద్‌–రాజ్‌కోట్‌ ఎక్స్‌ప్రెస్‌ (02755/02756), కాకినాడ–భావనగర్‌ ఎక్స్‌ప్రెస్‌ (02699/02700), సికింద్రాబాద్‌–హిస్సార్‌ (02789/02790) 

ప్యాసింజర్‌ నుంచి ఎక్స్‌ప్రెస్‌ రైళ్లుగా మారినవి.. 
కాజీపేట–సిర్పూర్‌ టౌన్, భద్రాచలం రోడ్డు–సిర్పూర్‌ టౌన్, హైదరాబాద్‌ డెక్కన్‌–పూర్ణ, హైదరాబాద్‌ డెక్కన్‌–ఔరంగాబాద్, తాండూరు–నాందేడ్, తాండూరు–పర్బణి, కాచిగూడ–గుంటూరు, కాచిగూడ–రాయచూర్‌.

వయా కొత్త మార్గాలు.. 
సికింద్రాబాద్‌–గువాహటి, సికింద్రాబాద్‌–విశాఖపట్నం (ట్రైవీక్లీ), సికింద్రాబాద్‌–విశాఖపట్నం (వీక్లీ)లను కాజీపేట మీదుగా కాకుండా పగిడిపల్లి మీదుగా రూట్‌ మార్చారు. కాచిగూడ–విశాఖపట్నం (డెయిలీ)ని విజయవాడ మీదుగా కాకుండా రాయనపాడు మీదుగా మార్చారు.  

673 రైళ్ల వేగం పెంపు.. 
దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 872 రైళ్లు ఉండగా, వాటిల్లో 673 రైళ్ల వేగాన్ని పెంచారు. ఫలితంగా ఇవి ఇంతకాలం గమ్యం చేరుతున్న వేళల కంటే కాస్త ముందుగానే చేరుకోనున్నాయి. సికింద్రాబాద్‌–హుబ్బలి, సికింద్రాబాద్‌–బల్లార్షా, కాజీపేట–బల్లార్షా, బల్లార్షా–భద్రాచలం రైళ్ల మార్గంలో కొన్ని టెర్మినల్స్‌ను మార్చారు. కేవడియా–ఎంజీఆర్‌ చెన్నై కొత్త ఎక్స్‌ప్రెస్‌ వచ్చే జనవరి నుంచి పట్టాలెక్కనుంది.    

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top