సింగరేణి సీఎండీగా శ్రీధర్‌ ఇంకెంతకాలం? | Central Govt Objected Extension Of Sccl Chairman Sridhar Tenure | Sakshi
Sakshi News home page

ఇంకెంతకాలం సింగరేణి సీఎండీగా శ్రీధర్?

Published Thu, Jan 21 2021 9:12 AM | Last Updated on Thu, Jan 21 2021 9:28 AM

Central Govt Objected Extension Of Sccl Chairman Sridhar Tenure - Sakshi

సింగరేణి బొగ్గు గనుల సంస్థ సీఎండీ ఎన్‌.శ్రీధర్‌ పదవీకాలం పొడిగింపు పట్ల కేంద్ర ప్రభుత్వం మరోసారి అభ్యంతరం తెలిపింది.

సాక్షి, హైదరాబాద్‌: సింగరేణి బొగ్గు గనుల సంస్థ సీఎండీ ఎన్‌.శ్రీధర్‌ పదవీకాలం పొడిగింపు పట్ల కేంద్ర ప్రభుత్వం మరోసారి అభ్యంతరం తెలిపింది. కొత్తగూడెంలోని సింగరేణి కార్పొరేట్‌ కార్యాలయంలో గత నెల 30న నిర్వహించిన వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం)లో శ్రీధర్‌ పదవీకాలం పొడిగింపునకు వ్యతిరేకంగా తమ శాఖ అండర్‌ సెక్రటరీ ఆల్కా శేఖర్‌ ఓటు వేశారని, ఈ విషయాన్ని పరిశీలించి చర్యలు తీసుకోవాలని కోరుతూ కేంద్ర బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి నుంచి తాజాగా రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ అందింది. ఈ నెల 8న లేఖ అందిన విషయాన్ని రాష్ట్ర ఇంధన శాఖ, సింగరేణి సంస్థ అధికారవర్గాలు ధ్రువీకరించాయి. 2015 జనవరి 1 నుంచి సంస్థ సీఎండీగా శ్రీధర్‌ కొనసాగుతున్నారు. చదవండి: సింగరేణికి సోలార్‌ సొబగులు

ఈ నెల 31తో శ్రీధర్‌ పదవీకాలం ముగియనుండగా, ప్రభుత్వం తదుపరి ఆదే శాలు జారీ చేసే వరకు ఆయన పదవీ కాలాన్ని పొడిగించాలని గత నెల నిర్వహించిన ఏజీఎంలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని కేంద్రం వ్యతిరేకించినా, రాష్ట్ర ప్రభుత్వ వాటాదారుల మద్దతుతో ఆమోదం పొందింది. సింగరేణి సంస్థలో రాష్ట్ర ప్రభుత్వానికి 51 శాతం, కేంద్రానికి 49 శాతం వాటాలుండటంతో మెజారిటీ ఓట్ల మద్దతుతో ఈ తీర్మానం నెగ్గింది. తర్వాత శ్రీధర్‌ పదవీకాలాన్ని మరో ఏడాదికాలం పాటు పొడిగిస్తూ ఈ నెల 5న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2017లో రెండేళ్ల పదవీకాలం పూర్తిచేసుకున్న శ్రీధర్‌కు అప్పటినుంచి ఎక్స్‌టెన్షన్‌ ఇస్తూ వస్తున్నారు. అలా మొత్తం ఆరేళ్లు పనిచేసిన శ్రీధర్‌ను మరో ఏడాది కొనసాగించడంపై కేంద్రం సుముఖంగా లేదు.

శ్రీధర్‌ పదవికి ప్రమాదం లేదు 
సింగరేణి సీఎండీ ఎన్‌.శ్రీధర్‌ పదవికి ఎలాంటి ప్రమాదం లేదని, మరో ఏడాది పాటు ఆయనే సీఎండీగా కొనసాగుతారని రాష్ట్ర ప్రభుత్వ అధికారవర్గాలు తెలిపాయి. సీఎండీ కొనసాగింపు పట్ల కేంద్రం వ్యతిరేకత చూపుతున్నా, మెజారిటీ వాటాదారుడిగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వానిదే తుది నిర్ణయం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement