జీరో కమిషన్, స్థిరమైన చార్జీలు.. భాగ్యనగరంలోకి ‘భారత్‌ ట్యాక్సీ’ | Central Government Plans Cooperative Transport System Bharat Taxi | Sakshi
Sakshi News home page

జీరో కమిషన్, స్థిరమైన చార్జీలు.. భాగ్యనగరంలోకి ‘భారత్‌ ట్యాక్సీ’

May 25 2026 5:30 AM | Updated on May 25 2026 5:30 AM

Central Government Plans Cooperative Transport System Bharat Taxi

ఐదారు నెలల్లో సేవలు ప్రారంభమయ్యే అవకాశం 

దేశంలోనే మొదటి సహకార టాక్సీ వ్యవస్థ కోసం డ్రైవర్ల ఒత్తిడి 

మూడు ప్రైవేటు సంస్థల తీరుతో విసిగిపోయిన వైనం 

అధిక చార్జీలతో ప్రయాణికులూ బెంబేలెత్తుతున్న పరిస్థితి

సాక్షి, హైదరాబాద్‌: దేశంలో యాప్‌ ఆధారిత క్యాబ్‌/ఆటో సర్వీసు రంగాన్ని గుప్పిట్లో పెట్టుకున్న కార్పొరేట్‌ గుత్తాధిపత్యానికి తెరదించుతూ కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన మొట్టమొదటి సహకార రవాణా వ్యవస్థ ‘భారత్‌ ట్యాక్సీ’త్వరలో హైదరాబాద్‌లో అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం ఓలా, ఉబర్, రాపిడో సంస్థలు ఈ రంగంలో ఉన్న విషయం తెలిసిందే. కాగా వీటిల్లో లక్షలాది మంది డ్రైవర్లు సభ్యులుగా ఉన్నారు. అయితే ఇటీవలి కాలంలో మారిన ఆయా సంస్థల విధానాలతో విసిగిపోయిన డ్రైవర్లు, భారత్‌ ట్యాక్సీ సేవలు వీలైనంత త్వరగా ప్రారంభించాలని తాజాగా సంస్థ నిర్వాహకులను కోరారు. ఈ నేపథ్యంలో వచ్చే ఐదారు నెలల్లో హైదరాబాద్‌లో సేవలు ప్రారంభించేలా సన్నాహాలు కొనసాగుతున్నాయి. భారత్‌ ట్యాక్సీకి అధికారికంగా స్వాగతం పలికేందుకు డ్రైవర్ల సంఘం వేదికను సిద్ధం చేస్తోంది.  

డ్రైవర్లలో అసంతృప్తి 
హైదరాబాద్‌లో యాప్‌ ఆధారిత క్యాబ్‌ సేవలు విస్తృతంగా వినియోగంలో ఉన్నాయి. యాప్‌ ద్వారా బుకింగ్‌ సులభంగా ఉండటం, బుక్‌ చేసిన కొద్ది నిమిషాలకే ట్యాక్సీ అందుబాటులోకి వస్తుండటంతో ప్రయాణికులు వీటి వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం నగరంలో 1.40 లక్షల క్యాబులుండగా, లక్ష వరకు ఈ యాప్‌ ఆధారిత అగ్రిగేటర్లతో భాగస్వామ్యమయ్యాయి. దాదాపు లక్షన్నర ఆటోల్లో 90 వేలు వీటితో అనుసంధానమయ్యాయి. దీన్ని ఆసరా చేసుకుని నిర్వాహక సంస్థలు ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తున్నాయి. వీటిపై రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణ లేకపోవటంతో చార్జీల విషయంలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. పీక్‌ అవర్‌ అని, వర్షం కురుస్తుండటంతో క్యాబ్‌ల కొరత ఉందని, ట్రాఫిక్‌ జామ్‌ ఉందని, డ్రైవర్‌ రావటానికి నిరాకరిస్తున్నాడని... రకరకాల సాకులుతో అప్పటికప్పుడు చార్జీ పెంచేస్తున్నాయి. డ్రైవర్ల నుంచి కమీషన్‌ కింద ఏకంగా 40 శాతం వరకు తీసేసుకుంటున్నాయి. నగర ట్రాఫిక్‌లో, అననుకూల వాతావరణంలో కష్టపడుతూ వాహనం నడిపే డ్రైవర్లకు 60 శాతమే దక్కుతోంది. ఈ నేపథ్యంలోనే ఆయా సంస్థలపై క్యాబ్‌ డ్రైవర్లలో తీవ్ర అసంతృప్తి నెలకొని ఉంది. ఈ సమయంలో భారత్‌ ట్యాక్సీ రానుండటం డ్రైవర్లతో పాటు నగర ప్రజలకు ఊరటనిస్తుందని అంటున్నారు. 

కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో.. 
కేంద్ర గృహ నిర్మాణ, సహకార శాఖల ఆధ్వర్యంలో భారత్‌ ట్యాక్సీ వ్యవస్థ రూపుదిద్దుకుంది. సహకార స్పూర్తితో ‘సారథి హీ మాలిక్‌ (నడిపేవాడే యజమాని)‘నినాదంతో ఇది ఏర్పాటైంది. ’సహకార్‌ సే సమృద్ధి’(సహకారం ద్వారా సంపద) అన్న ట్యాగ్‌లైన్‌తో ఆరునెలల క్రితం మల్టీ స్టేట్‌ కోఆపరేటివ్‌ సొసైటీస్‌ యాక్ట్‌ కింద ఈ వ్యవస్థ రిజిస్టర్‌ అయింది. అమూల్, ఇఫ్కో, నాబార్డ్‌ , క్రిబ్‌కో తదితర సహకార సంస్థల భాగస్వామ్యంతో ’సహకార్‌ టాక్సీ కోఆపరేటివ్‌ లిమిటెడ్‌’దీనిని రూపొందించింది. రెండు నెలలు పైలట్‌ ప్రాజెక్టుగా పరిశీలించి గత ఫిబ్రవరిలో ఢిల్లీలో అధికారికంగా ప్రారంభించారు. తొలుత ఢిల్లీ ఎన్‌సీఆర్‌ పరిధిలోని ఢిల్లీ, గురుగ్రామ్, నోయిడా, ఫరీదాబాద్, ఘాజియాబాద్‌లతో పాటు గుజరాత్‌లోని అహ్మదాబాద్, రాజ్‌కోట్, సోమనాథ్, ద్వారకలలో ప్రారంభించారు. ప్రస్తుతం రెండున్నర లక్షల మందికి పైగా డ్రైవర్లు సభ్యులుగా చేరారు. త్వరలో హైదరాబాద్‌తో పాటు ముంబై, బెంగుళూరు, చెన్నై, కోల్‌కతాలలో ప్రారంభించాలని నిర్ణయించారు. తొలుత ముంబైలో ప్రారంభం కానుండగా..హైదరాబాద్‌కు చెందిన డ్రైవర్లు ఇక్కడ కూడా త్వరగా ప్రారంభించాలని ఒత్తిడి తెస్తుండటం విశేషం.  
ఎదురుచూపులు ఎందుకంటే.. 
– భారత్‌ టాక్సీ ’జీరో కమీషన్‌’విధానంలో నడుస్తుంది. ప్రయాణికులు చెల్లించే మొత్తం నేరుగా డ్రైవర్‌ బ్యాంక్‌ ఖాతాకే వెళ్తుంది. సంస్థ నిర్వహణ కోసం కేవలం రోజువారీ లేదా నెలవారీ స్వల్ప సభ్యత్వ రుసుము మాత్రమే డ్రైవర్లు చెల్లించాల్సి ఉంటుంది.  
– ట్రాఫిక్‌ రద్దీ, పండగలు, క్యాబ్‌ల కొరత, వర్షం, పీక్‌ అవర్స్‌... ఇలా కారణాలు చెప్తూ అధిక మొత్తం చార్జీ వసూలు ఉండదు. ప్రభుత్వం నిర్ణయించిన స్థిరమైన, పారదర్శక చార్జీలు మాత్రమే ఉంటాయి. ప్రైవేట్‌ సంస్థల చార్జీలతో పోలిస్తే 30 – 50 శాతం తక్కువగా ఉండనున్నాయి. 
– ప్రతి డ్రైవర్‌కు రూ.5 లక్షల వ్యక్తిగత ప్రమాద బీమా, రూ.5 లక్షల కుటుంబ ఆరోగ్య బీమా ఉంటుంది. రిటైర్మెంట్‌ సేవింగ్స్‌ ప్లాన్‌ను కూడా ఈ సంస్థ అందిస్తోంది. 
– మహిళల భద్రత కోసం ప్రత్యేకంగా మహిళా డ్రైవర్లతో కూడిన ట్యాక్సీ, బైక్‌ సర్వీసులను ప్రవేశపెట్టారు. మహిళా ప్రయాణికులు మహిళా డ్రైవర్లనే ఎంచుకునే వెసులుబాటు ఉంది. 

రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేయటంతో... 
రాష్ట్రంలో సొంతంగా టాక్సీ/ఆటో యాప్‌ను అభివృద్ధి చేయనున్నట్టు రెండున్నరేళ్ల క్రితం ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం తర్వాత చేతులెత్తేసింది. ప్రైవేటు అగ్రిగేటర్ల ఒత్తిడికి తలొగ్గి సొంత యాప్‌ హామీని గాలికొదిలేసిందని క్యాబ్‌ డ్రైవర్లు ఆరోపిస్తున్నారు. సొంత యాప్‌ సంగతి పక్కనపెడితే, కనీసం క్యాబ్‌ ధరల నియంత్రించలేని దుస్థితి ఉంది. ఇలావుండగా..గత వారం రోజుల్లో రెండు పర్యాయాలు డీజిల్, పెట్రోలు ధరలు పెంచటంతో తమ చార్జీలు కూడా పెంచాలని క్యాబ్‌/ఆడో డ్రైవర్లు అగ్రిగేటర్లను కోరుతున్నారు. అయితే మూడు అగ్రిగేట్‌ సంస్థలు ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్నందున చార్జీల పెంపునకు అంగీకరించడం లేదు. దేని చార్జీ తక్కువుంటే ప్రయాణికులు అటువైపు మొగ్గు చూపుతుండటమే ఇందుకు కారణం.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement