బండెక్కితే భయమే! రాష్ట్రంలో రోజూ 20 మంది మృతి.. టాప్‌ 10లో తెలంగాణ | Sakshi
Sakshi News home page

బండెక్కితే భయమే! రాష్ట్రంలో రోజూ 20 మంది మృతి.. టాప్‌ 10లో తెలంగాణ

Published Mon, Mar 13 2023 1:22 AM

Car accidents increased after Corona - Sakshi

సాక్షి ప్రత్యేక ప్రతినిధి :  రోడ్డెక్కగానే బండిని రయ్‌మంటూ పరుగెత్తిస్తారు.. జన సంచారం ఉండని హైవేలపై అయితే వాయు వేగంతో పోటీ పడతారు.. ఇలా దూసుకుపోతే ఆ కిక్కే వేరనుకుంటారు.. దీనికోసం ట్రాఫిక్‌ నిబంధనలనూ బేఖాతరు చేస్తారు.. ఇందులో కిక్కు ఎంత వస్తుందో వారికే తెలుసుగానీ.. ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోవడం మాత్రం పెరిగిపోతోంది. రహదారులపై బ్లాక్‌ స్పాట్లు, వాహన వేగ నియంత్రణలో వైఫల్యం, హెల్మెట్, సీటుబెల్టు పెట్టుకోవడంలో నిర్లక్ష్యం వంటివి వేలకొద్దీ మరణాలకు కారణమవుతున్నాయి.

కరోనా అనంతరం వ్యక్తిగత వాహనాల వినియోగం బాగా పెరిగింది. దీనితో రోడ్లపై ట్రాఫిక్‌ రద్దీ ఎక్కువై ప్రమాదాలు– మరణాల శాతం పెరగడానికి దారితీస్తోందని నిపుణులు చెప్తున్నారు. ప్రమాద మృతుల్లో 35ఏళ్ల లోపు వారే 46.3శాతం ఉంటుండటంపై ఆందోళన కరమని పేర్కొంటున్నారు. 2021 సంవత్సరానికిసంబంధించి కేంద్ర రవాణాశాఖ ఇటీవలి పార్లమెంటు సమావేశాల్లో వెల్లడించిన గణాంకాలు ఈ పరిస్థితిని స్పష్టంగా చూపుతున్నాయి.

అతి వేగమే.. చంపేస్తోంది
 రోడ్డు ప్రమాదాల్లో చనిపోయిన వారిలో 18–35 ఏళ్లలోపు వారే అత్యధికంగా (46.3శాతం) ఉన్నారు. ఇందులోనూ 45.1శాతం టూవీలర్స్‌పై, 12.9 శాతం కార్లలో ప్రయాణిస్తున్నవారుకాగా.. 18.9శాతం మంది పాదచారులు.
    71.7శాతం ప్రమాదాలు అతివేగంతో డ్రైవర్‌ వైఫల్యం వల్లే చోటు చేసుకున్నాయి. ఇందులో 31­శాతం కొత్త వాహనాలు (5 ఏళ్లలోపువే) నడిపే­వారే చేశారు. 9.5 శాతం మంది మద్యం–సెల్‌ఫోన్‌ డ్రైవింగ్‌ కారణంగా ప్రమాదాల బారినపడ్డారు.
    ప్రమాదాలు చేసిన వారిలో ఏడు శాతం మందికి లైసెన్స్‌లు కూడా లేకపోవడం గమనార్హం.
    నేషనల్‌ హైవేలపైనే అత్యధిక ప్రమాదాలు–­మ­రణాలు చోటు చేసుకున్నాయి. 2021లో 1,28,825 (31.6శాతం) ప్రమాదాలు, 56,007 మరణాలు హైవేలపైనే నమోదయ్యాయి. ఆ ఏడాది తెలంగాణలోని హైవేల 2,735 మంది చనిపోయారు.
   10 లక్షలు జనాభా దాటిన నగరాల్లో రోడ్డు ప్రమాదాల విషయంలో చెన్నై, ఢిల్లీ, జబల్‌పూర్‌లో తొలి మూడు స్థానాల్లో ఉండగా.. హైదరాబాద్‌ 8వ ప్లేస్‌లో ఉంది. మహానగరాల్లో జరుగుతున్న ప్రమాదాల్లో మరణిస్తున్న వారిలో 25 శాతం మంది పాదచారులే.

హైవేలపై లోపాలు సరిదిద్దక..
తెలంగాణ మీదుగా వెళుతున్న ప్రధాన హైవేలపై లోపాలను సరిదిద్దే అంశం వేగంగా ముందుకు కదలటం లేదు. అత్యధిక ప్రమాదాలు జరిగే హైవే–65 (మచిలీపట్నం– హైదరాబాద్‌– పుణే), హైవే–44 (కన్యాకుమారి–కశ్మీర్‌), హైవే–563 (భూపాలపట్నం–హైద­రాబాద్‌)లపై పలుచోట్ల ఇంజనీరింగ్‌ లోపాలను గతంలోనే గుర్తించారు. వాటితో ప్రమాదాలు జరుగుతున్నట్టూ తేల్చారు.

కానీ వాటిని సరిదిద్దే విషయంలో జాప్యం జరుగుతోంది. ముఖ్యంగా హైవే–65పై కోదాడ, మునగాల, కట్టంగూర్, చిట్యాల, చౌటుప్పల్‌ ప్రాంతాల్లో అండర్‌వేలు నిర్మించాల్సి ఉంది. మూడేళ్లుగా టెండర్ల ప్రక్రియే పూర్తికాలేదు. హైవే–44లోనూ నిర్మల్, కామారెడ్డి, మేడ్చల్, మహబూబ్‌నగర్‌ జిల్లాల పరిధిలో ఇంజనీరింగ్‌ లోపాలు అలానే ఉన్నాయి.

ఇప్పుడేం చేయాలి?
తెలంగాణలో ప్రమాదాల నియంత్రణ దిశగా నూతన మోటార్‌ వెహికల్‌ యాక్ట్‌ను పూర్తిస్థాయిలో అమలు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా బ్లాక్‌ స్పాట్స్‌లో లోపాలను సరిచేయడం, సైన్‌బోర్డులు, ఎల­క్ట్రాని­­క్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ను పెంచటం, ప్రమాద బాధితులకు సత్వర వైద్యం అందే చర్య­లు తీసుకోవడం అవసరమని స్పష్టం చేస్తున్నారు. మితిమీరిన వేగంతో ప్రయాణించకుండా తగిన అవ­గాహన కల్పించాలని పేర్కొంటున్నారు.

ప్రమాదాల్లో యూఎస్‌.. మరణాల్లో భారత్‌..
వరల్డ్‌ రోడ్‌ స్టాటిస్టిక్స్‌–2020 నివేదిక ప్రకారం ప్రపంచంలోనే అత్యధికంగా అమెరికాలో 19,27,654 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదాల్లో సంభవించిన మరణాల సంఖ్య (36,650)లో మూడో స్థానంలో నిలిచింది. భారత్‌ 4,12,432 ప్రమాదాలతో ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉండగా.. 1,53,972 మృతులతో మరణాల సంఖ్యలో మాత్రం టాప్‌లో నిలిచింది.

అమ్మానాన్నను రోడ్డు మింగింది
గత ఏడాది డిసెంబర్‌ 11న సూర్యాపేట జిల్లా అనంతగిరి నుంచి ఖమ్మం జిల్లా జల్లేపల్లికి వెళ్తున్న ఆటోను బస్సు ఢీకొట్టింది. ఆ ప్రమాదంలో రమేష్‌–రేణుక దంపతులు మృతిచెందడంతో.. వారి పిల్లలు కార్తీక్, హాసిని అనాథలుగా మారిపోయారు.

Advertisement
 
Advertisement
 
Advertisement