సర్వేలు.. సమన్వయం | BRS sets up a war room for the municipal elections | Sakshi
Sakshi News home page

సర్వేలు.. సమన్వయం

Feb 1 2026 4:06 AM | Updated on Feb 1 2026 4:06 AM

BRS sets up a war room for the municipal elections

మున్సిపల్‌ ఎన్నికల కోసం బీఆర్‌ఎస్‌ వార్‌రూమ్‌ ఏర్పాటు  

దాదాపు పూర్తయిన అభ్యర్థుల ఎంపిక, 3వ తేదీలోగా బీ ఫారాలు జారీ 

కొడంగల్‌ సహా పలుచోట్ల కాంగ్రెస్‌ ఏకగ్రీవ ప్రయత్నాలకు అడ్డుకట్ట 

ఎన్నికల ప్రచారానికి కేటీఆర్, హరీశ్‌ రాకపై ప్రస్తుతానికి సస్పెన్స్‌ 

సాక్షి, హైదరాబాద్‌: మున్సిపల్‌ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న బీఆర్‌ఎస్‌ క్షేత్రస్థాయిలో పార్టీ యంత్రాంగాన్ని సమన్వయం చేయడంపై దృష్టి కేంద్రీకరించింది. అభ్యర్థుల ఎంపిక మొదలు కుని అసంతృప్తుల బుజ్జగింపు, అధికార పార్టీ ఒత్తిళ్లను అధిగమించడం, కేడర్‌ను సమీకరించి ప్రచా రం తదితరాల్లో సమన్వయానికి పెద్దపీట వేస్తోంది. 

ఫోన్‌ ట్యాపింగ్‌ అంశంలో పార్టీ అధినేత కేసీఆర్, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు, సంతోష్‌లకు నోటీసులు, విచారణ పేరిట హడావుడి జరుగుతున్నా ఎన్నికల్లో పార్టీ పనితీరుపై ప్రభావం పడకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇప్పటికే అభ్యర్థుల ఎంపిక కోసం సర్వేలను ప్రామాణికంగా తీసుకున్న బీఆర్‌ఎస్‌ మరోమారు సర్వే చేసి అందుకు అనుగుణంగా ప్రచార వ్యూహాన్ని అమలు చేయాలని భావిస్తోంది. 

వార్‌రూమ్‌.. సమన్వయకర్తలు 
ఎన్నికల్లో పార్టీ నేతలు, యంత్రాంగాన్ని సమన్వయం చేసేందుకు బీఆర్‌ఎస్‌ వార్‌రూమ్‌ ఏర్పాటు చేసింది. మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, పార్టీ ప్రధాన కార్యదర్శి రావుల చంద్రశేఖర్‌రెడ్డి ప్రస్తుతం వార్‌రూమ్‌ ఇన్‌చార్జీలుగా వ్యవహరిస్తున్నారు. ఒకట్రెండు రోజుల్లో 9 మంది నేతలతో వార్‌రూమ్‌ను విస్తరించి ఉమ్మడి జిల్లాల వారీగా బాధ్యతలు అప్పగించనున్నారు. అభ్యర్థుల ఎంపిక, అసంతృప్తుల బుజ్జగింపు, ప్రచారం తదితరాలను సమన్వయం చేసేందుకు 116 మున్సిపాలిటీలు, ఏడు కార్పొరేషన్లకు 125 మంది నేతలను సమన్వయకర్తలుగా నియమించారు.  

జిల్లా కలెక్టర్లకు ఫారమ్‌–ఏ పంపిన కేసీఆర్‌ 
జిల్లాలు, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా కొందరు పార్టీ నేతలకు బీ ఫామ్‌లు జారీ చేసే అధికారాన్ని ఇస్తూ ఫారమ్‌–ఏను కేసీఆర్‌ సంబంధిత జిల్లా కలెక్టర్లకు పంపించారు. కేసీఆర్‌ పేర్కొన్న నేతలు మాత్రమే పార్టీ ఎంపిక చేసిన అభ్యర్థులకు బీ ఫారం జారీ చేస్తారు.

బీ ఫారాల జారీలో ఎక్కడైనా సమస్య తలెత్తితే ఫారమ్‌–సీ కూడా కేసీఆర్‌ కలెక్టర్లకు అందజేసిన జాబితాలో ఉన్న నేతలు మాత్రమే జారీ చేస్తారు. ఇప్పటికే చాలా మున్సిపాలిటీల్లో అభ్యర్థుల ఎంపిక కొలిక్కి రాగా, మూడో తేదీ మధ్యాహ్నం మూడు గంటల్లోగా పెండింగులో ఉన్న అభ్యరి్థత్వాలను కూడా ఖరారు చేసి బీ ఫారాలు ఇస్తారు.  

కాంగ్రెస్‌ ఏకగ్రీవ ప్రయత్నాలకు అడ్డుకట్ట
నామినేషన్ల స్రూ్కటినీ, ఉపసంహరణ సందర్భంగా పార్టీ ఎంపిక చేసిన అభ్యర్థులు జారిపోకుండా బీఆర్‌ఎస్‌ అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. సీఎం రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్, మద్దూరు తదితర మున్సిపాలిటీల్లో తమ అభ్యర్థులను పోటీ నుంచి తప్పించి ఏకగ్రీవం చేసుకునేందుకు కాంగ్రెస్‌ ప్రయత్నాలు చేస్తోందని బీఆర్‌ఎస్‌ ఆరోపిస్తోంది. బెదిరింపులు, ప్రలోభాలకు అభ్యర్థులు లోనవకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. 

దీనికోసం వార్‌రూమ్‌ నుంచి అభ్యర్థులకు అవసరమైన సహాయం అందించేలా కసరత్తు జరుగుతోంది. కాగా, ఎన్నికల ప్రచారానికి ఆరు రోజులు మాత్రమే గడువు ఉండటంతో కేటీఆర్, హరీశ్‌రావు రావాలంటూ అభ్యర్థుల నుంచి విన్నపాలు అందుతున్నాయి. కేసీఆర్‌ ఆదేశాల మేరకు కేటీఆర్, హరీశ్‌ ప్రచార షెడ్యూలు ఉంటుందని పార్టీ వర్గాలు చెప్పాయి. వీరిద్దరి ప్రచార షెడ్యూల్‌పై సస్పెన్స్‌ తొలగించి స్పష్టత ఇవ్వాలని పార్టీ నేతలు కోరుతున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement