
న్యాయం గెలిచింది: సబితా ఇంద్రారెడ్డి
సాక్షి, హైదరాబాద్: ‘ఓబుళాపురం మైనింగ్ అంశంలో ఎలాంటి తప్పు చేయకపోయినా పన్నెండున్నర సంవత్సరాలపాటు అవమానాలు భరించా. మానసిక వేదన అనుభవించా. న్యాయ వ్యవస్థపై నమ్మకంతో ఇన్నాళ్లూ పోరాడా. అంతిమంగా న్యాయం గెలిచింది. వాస్తవాలను పరిశీలించిన సీబీఐ కోర్టు నన్ను నిర్దోషిగా ప్రకటించడం ఆనందంగా ఉంది’అని మాజీ మంత్రి, ప్రస్తుత బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. రాజకీయ ప్రేరేపితంగా ఈ కేసు నమోదు చేశారని ఆమె వ్యాఖ్యానించారు. ‘నన్ను ముందు పెట్టి అన్న వై.ఎస్. రాజశేఖరరెడ్డిని దోషిగా నిలబెట్టడానికి ప్రయత్నించారు.
మేము ఈ మైనింగ్ లీజు వ్యవహారంలో ఎలాంటి తప్పు చేయలేదు. చట్టపరంగా, న్యాయపరంగానే అన్ని నిర్ణయాలు తీసుకున్నాం. కేబినెట్ ఆమోదంతోపాటు కేంద్ర ప్రభుత్వ అనుమతులు సైతం ఉన్నాయి. విధానపరమైన నిర్ణయంలో ఎక్కడా మేము తప్పు చేయలేదు. మాపై మోపిన అభియోగాలను నిరూపించలేకపోయారు. కాబట్టే న్యాయస్థానం నన్ను నిర్దోషిగా ప్రకటించింది’అని సబితా ఇంద్రారెడ్డి మంగళవారం ‘సాక్షి’తో మాట్లాడుతూ చెప్పారు.
అంతా చట్టబద్ధమే..: కృపానందం
‘ఓబుళాపురం మైనింగ్ లీజు విషయంలో చట్ట నియమ నిబంధనల ప్రకారమే నడుచుకున్నాం. ఎక్కడా పొరపాటు చేయలేదు. న్యాయపరంగా కూడా ఎక్కడా తప్పు చేయలేదు. అందుకే న్యాయస్థానం ఈ కేసు నుంచి నన్ను నిర్దోషిగా ప్రకటించింది’అని అప్పట్లో గనుల శాఖ కార్యదర్శిగా పనిచేసిన బి. కృపానందం అనందం వ్యక్తం చేశారు. గనుల లీజు అంశం కేవలం ఒక రాష్ట్ర ప్రభుత్వం తీసుకొనేది కాదని.. కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా అన్ని అనుమతులు తీసుకున్న తరువాతే మంజూరు అవుతాయని ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ చెప్పారు.
మొదటి రెండు చార్జిషీట్లలో తమ పేర్లు లేకపోయినా మూడో చార్జిషీట్‌లో సీబీఐ తన పేరు ఎందుకు చేర్చిందో ఆ సంస్థకే తెలియాలన్నారు. గనులను లీజుకిచ్చే విధానపరమైన నిర్ణయంలో ప్రభుత్వం ఎలాంటి తప్పు చేయలేదని న్యాయస్థానం నమ్మినందునే నిర్దోషిగా తనను, ప్రజాప్రతినిధిని ప్రకటించిందని ఆయన చెప్పారు.
జైలుకు పోతానని ప్రత్యర్థులు హేళన చేసినా..
‘కన్నీళ్లతో తొలిసారి ఇదే సీబీఐ కోర్టు మెట్లెక్కా. నేను అవినీతికి పాల్పడ్డానని.. జైలుకు పోతానని నా ప్రత్యర్థులు హేళన చేశారు. ప్రతి ఎన్నికల్లోనూ అవినీతి చేశానని.. దోపిడీకి పాల్పడ్డానని ఎన్నో నిందలు, ఆరోపణలు చేశారు. అసెంబ్లీలో చర్చ జరిగినప్పుడు అన్న వై.ఎస్. రాజశేఖరరెడ్డిని, నన్ను దోషులుగా నిలిపేందుకు ప్రయత్నించారు. మా నైతికతను దెబ్బతీయడానికి ప్రయత్నించారు. ప్రత్యర్థులు ఎన్ని ఆరోపణలు, నిందలు మోపినా నా నియోజకవర్గ ప్రజలు నన్ను నమ్ముకొని నా వెంట నిలిచారు.
నేను బాధపడ్డప్పుడు ఇంట్లోని వారంతా నాకు ఎంతో ఆప్యాయతతో సహకారం అందించారు. కోర్టుకు వెళ్లినప్పుడు నా ప్రజలు వెంట వస్తే లాఠీచార్జి చేసిన పరిస్థితులు ఉండేవి. మేము ఎలాంటి తప్పు చేయలేదన్న ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లా. నా నమ్మకం గెలిపించింది. ఏళ్లుగా ఎదుర్కొంటున్న బాధ నుంచి బయటపడ్డా. ఇక మరింత ఉత్సాహంతో ప్రజాశ్రేయస్సు కోసం పనిచేస్తా’అని సబితా ఇంద్రారెడ్డి చెప్పారు.