బ్రహ్మశ్రీ కుప్పా విశ్వనాథ శర్మకు ‘ఉషశ్రీ సంస్కృతి’ సత్కారం

Brahmashree Kuppa Vishwanatha Sharma honored Ushasree Culture - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఉషశ్రీ మిషన్‌ ఏటా నిర్వహిస్తున్న ఉషశ్రీ సంస్కృతి సత్కార సభ మార్చి 19, ఆదివారం నాడు జరుగనుంది. ప్రముఖ వేద పండితులు బ్రహ్మశ్రీ కుప్పా విశ్వనాథ శర్మను ఈ సంవత్సరం ఉషశ్రీ మిషన్‌ సత్కరిస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తున్న వేద విశ్వవిద్యాలయంలో విశ్వనాథ శర్మ న్యాయశాఖాధిపతిగా పనిచేస్తున్నారు.

చతుర్వేదాలు పుక్కిటపట్టిన విశ్వనాథ శర్మ ఎస్‌వీబీసీలో భగవద్గీత ప్రవచనం, పతంజలి యోగ సూత్రాలపై ప్రసంగాలు చేశారు. ప్రేక్షకులకు జ్ఞానబోధ చేసి అలరించారు. ప్రవచన రంగంలో చేస్తున్న కృషికి గుర్తింపుగా ఉషశ్రీ మిషన్‌ విశ్వనాథ శర్మను ఉషశ్రీ సంస్కృతి సత్కారానికి ఎంపిక చేసింది. 

ఆల్‌ ఇండియా రేడియో విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమైన ధర్మసందేహాలు కార్యక్రమంతో ఆబాలగోపాలాన్ని అలరించిన ఉషశ్రీ పేరిట ఈ సత్కారాన్ని 2002 సంవత్సరం నుంచి ఉషశ్రీ మిషన్‌ అందిస్తూ వస్తోంది. ప్రత్యక్ష వ్యాఖ్యానాలకు ఉషశ్రీ పెట్టింది పేరు. భద్రాచలంలో నిర్వహించే సీతారామ కల్యాణ ప్రత్యక్ష వ్యాఖ్యానం.. ఉషశ్రీ ఖ్యాతిని ఖండాంతరాలకు వ్యాపింప చేసింది.

రాజమండ్రి – కొవ్వూరు మధ్య నిర్మించిన రోడ్‌ కమ్‌ రైల్‌ వంతెన ప్రారంభోత్సవ ప్రత్యక్షప్రసారాన్ని 1976 లో ఉషశ్రీ నిర్వహించారు. ఉషశ్రీ మార్గంలో నడుస్తున్న వారిని ఉషశ్రీ మిషన్‌ ప్రతి ఏటా సత్కరిస్తోంది. ఈ సంవత్సరం (2023, మార్చి 19, ఆదివారం) ఈ సత్కార కార్యక్రమం సోమాజీగూడా ప్రెస్‌ క్లబ్‌లో  జరగనుంది. బ్యాంకింగ్‌ రంగ నిపుణులు డాక్టర్‌ ఏ. ఎస్‌. రామశాస్త్రి అధ్యక్షత వహించే ఈ కార్యక్రమంలో అచ్చ తెనుగు అవధాని డా. పాలపర్తి శ్యామలానంద ప్రసాద్, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పసర్లపాటి బంగారయ్య శర్మ అతిథులుగా పాల్గొననున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top