బీజేపీలోకి తగ్గిన చేరికలు.. వెనుకంజ ఎందుకో..?

BJP Party Decreased Inclusions In Telangana - Sakshi

సమన్వయ లేమి..లభించని హామీ!

 బీజేపీలోకి తగ్గిన చేరికలు

జాతీయ నాయకత్వం అసంతృప్తి! 

కొత్త, పాత నేతల మధ్య సమన్వయ లోపంతోనే బీజేపీలో చేరికకు వెనుకంజ 

రాజకీయ భవితవ్యంపైనా పార్టీ నుంచి దక్కని భరోసా?

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఈసారి ఏ విధంగానైనా అధికారం చేజిక్కించుకోవాలని భావిస్తున్న బీజేపీ ఆ మేరకు అన్నిరకాల ప్రయత్నాలూ చేస్తోంది. ముఖ్యంగా ఇతర పార్టీల నుంచి చేరికలను ప్రోత్సహించడం ద్వారా ఆ పార్టీలను దెబ్బ కొట్టాలని, తమ పార్టీ బలం పెంచుకోవాలని వ్యూహం రచించింది. ఈ మేరకు ప్రత్యేకంగా ఈటల రాజేందర్‌ నేతృత్వంలో చేరికల కమిటీని కూడా ఏర్పాటు చేసింది.

ఈ క్రమంలోనే కాంగ్రెస్‌ నుంచి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి, రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సోదరుడు ఎర్రబెల్లి ప్రదీప్‌ రావు, మాజీ ఎమ్మెల్యే బొమ్మ వెంకన్న కుమారుడు బొమ్మ శ్రీరామ్, ఇంకా రాజయ్య యాదవ్‌లతో పాటు మాజీ ఐఏఎస్‌ తేజావత్‌ రామచంద్రునాయక్, మాజీ డీజీపీ కృష్ణప్రసాద్‌ తదితరులు బీజేపీలో చేరారు. కానీ ఇటీవల కాలంలో చేరికలు లేకపోవడంపై ఆ పార్టీ జాతీయ నాయకత్వం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఇటీవల పార్టీ నిర్వహించిన హైదరాబాద్‌ విమోచన దినోత్సవానికి వచ్చినప్పుడే బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా చేరికల అంశంపై అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.  

వెనుకంజ ఎందుకో.. 
టీఆర్‌ఎస్‌ సర్కార్‌ వైఫల్యాలను ఎండగడుతూ పార్టీ పరంగా పెద్దెత్తున కార్యక్రమాలు చేపడుతున్నా, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్‌ నాలుగోవిడత ›ప్రజాసంగ్రామ యాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన లభించినా.. చేరికలు పెద్దగా లేకపోవడం పార్టీ ముఖ్య నేతలకు మింగుడు పడడం లేదని తెలిసింది. టీఆర్‌ఎస్, కాంగ్రెస్, ఇతర పార్టీల్లోని ముఖ్యనేతలు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు బీజేపీలో చేరేందుకు తొలుత సుముఖత వ్యక్తం చేసినా.. ఆ తర్వాత ఎందుకు వెనకడుగు వేస్తున్నారనేది వారికి అంతుచిక్కడం లేదు.

అయితే ఇప్పటికే పార్టీలో చేరిన కొత్త నాయకులు, కొన్నేళ్లుగా పార్టీలో కొనసాగుతున్న సీనియర్‌ నేతలు, పాత తరం నేతల మధ్య సమన్వయ లేమే ఇందుకు కారణమని తెలుస్తోంది. మరోవైపు ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులుగా పలానా స్థానాల నుంచి పోటీపై వారు హామీ కోరుతున్నట్టు తెలుస్తోంది. తమ వెంట వచ్చేవారికి సైతం ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించాలనే డిమాండ్లు కూడా నేతలు చేస్తున్నట్టు సమాచారం..  

ముందస్తు హామీకి నాయకత్వం నో! 
ఎవరికీ ముందస్తు హామీ ఇవ్వొద్దని, బేషరతుగా చేర్చుకోవాలని నాయకత్వం నిబంధన విధించడం కూడా రాష్ట్ర పార్టీకి ప్రతిబంధకంగా మారిందని చెబుతున్నారు. టికెట్, తదితరాలపై హామీ ఇవ్వకపోవడం, చేరికలపై స్పష్టమైన విధానమేదీ లేకపోవడం ప్రధాన సమస్యగా మారిందని అంటున్నారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top