ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ ఎందుకు డిలీట్‌ చేశారు? | bandi sai bhagirath delete to Instagram Account | Sakshi
Sakshi News home page

ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ ఎందుకు డిలీట్‌ చేశారు?

May 30 2026 12:35 PM | Updated on May 30 2026 12:38 PM

bandi sai bhagirath delete to Instagram Account

సాక్షి, హైదరాబాద్‌: పోక్సో కేసులో రిమాండ్‌ ఖైదీగా ఉన్న బండి సాయి భగీరథ్‌ మూడు రోజుల పోలీసు కస్టడీ ముగిసింది. చివరి రోజైన శుక్రవారం పేట్‌ బషీరాబాద్‌ పోలీసులు భగీరథ్‌ను లోతుగా విచారించారు. గత డిసెంబర్‌ 31న ఓ మైనర్‌ బాలికకు బలవంతంగా మద్యం తాగించి, ఆమె అపస్మారక స్థితిలో ఉండగా లైంగిక దాడికి పాల్పడ్డాడనే ఆరోపణల నేపథ్యంలో భగీరథ్‌పై ఈ నెల 8న పేట్‌ బషీరాబాద్‌ పోలీసు స్టేషన్‌లో పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే. 

కేసు నమోదైన రోజునే భగీరథ్‌ తన సెల్‌ఫోన్‌ను ఫార్మాట్‌ చేయడంతో పాటు ఇన్‌స్ట్రాగామ్‌ అకౌంట్‌ను డిలీట్‌ చేశాడని సాంకేతిక విచారణలో పోలీసులు గుర్తించారు. ఈ సాంకేతిక ఆధారాలను నిందితుడి ముందుంచిన పోలీసులు.. డేటా డిలీట్‌ చేయడంలో అతనికి సహకరించిన వారు ఎవరు? అనే కోణంలో ఆరా తీశారు. బాధితురాలి కుటుంబం పోలీసులను ఆశ్రయించిన సమయంలో భగీరథ్‌ ఎక్కడున్నాడనే అంశంపై పోలీసులు ప్రశ్నించినట్లు తెలిసింది. 

భగీరథ్‌పై పేట్‌ బషీరాబాద్‌ ఠాణాలో కేసు నమోదైన రోజునే, కరీంనగర్‌ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి నేరుగా ఫిర్యాదు చేశాడా? లేక పోలీసులు వచ్చి ఫిర్యాదు తీసుకున్నారా? అనే కోణంలో ప్రశ్నలు అడిగారు. అయితే ఈ ప్రశ్నలన్నింటికీ నిందితుడు సరైన సమాధానాలు చెప్పకుండా దాటవేసినట్లు తెలిసింది. కస్టడీ అనంతరం భగీరథ్‌ను పోలీసులు చర్లపల్లి జైలుకు తరలించారు.  

 

Advertisement
 
Advertisement
Advertisement