సమానత్వ పథంలో తెలంగాణ | Babu Jagjivan Ram119th birth anniversary celebrations celebrated with great pomp | Sakshi
Sakshi News home page

సమానత్వ పథంలో తెలంగాణ

Apr 6 2026 4:25 AM | Updated on Apr 6 2026 4:25 AM

Babu Jagjivan Ram119th birth anniversary celebrations celebrated with great pomp

మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ 

బాబు జగ్జీవన్‌ రామ్‌ ఆశయాల స్ఫూర్తితో ముందుకు  

ఘనంగా మాజీ ఉప ప్రధాని జయంతి వేడుకలు 

హాజరైన పలువురు ప్రముఖులు

గన్‌¸ఫౌండ్రి (హైదరాబాద్‌): భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్‌ రామ్‌ ఆశయాలతో తెలంగాణ రాష్ట్రం సమానత్వ పథంలో నడుస్తోందని ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ అన్నారు. ఆదివారం రాష్ట్ర ఎస్సీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో డాక్టర్‌ బాబు జగ్జీవన్‌ రామ్‌ 119వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బషీర్‌బాగ్‌ చౌరస్తాలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 

అనంతరం మంత్రి లక్ష్మణ్‌ కుమార్‌ మాట్లాడుతూ.. మహనీయుల జయంతి ఉత్సవాలను కేవలం స్మరణ కోసమే కాకుండా దళిత ఆత్మగౌరవ ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లే సంకల్ప దినంగా మార్చాలని పేర్కొన్నారు. కాచిగూడ నింబోలి అడ్డాలో రూ.30 కోట్ల వ్యయంతో బాబు జగ్జీవన్‌ రామ్‌ భవనాన్ని నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. 

అలాగే లోయర్‌ ట్యాంక్‌బండ్‌ వద్ద రూ.100 కోట్లతో 10 అంతస్తుల అంబేడ్కర్‌ నాలెడ్జ్‌ టవర్‌ నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. దళిత విద్యార్థుల అభ్యున్నతికోసం ఐఏఎస్, ఐపీఎస్, గ్రూప్‌ 1, 2, 3 వంటి పోటీ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చే కేంద్రాలను త్వరలో ప్రారంభించనున్నట్లు ప్రకటించారు.  

మంత్రి ఫొటో ఎందుకు లేదు.. 
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ.. మాజీ ఉప ప్రధాని జగ్జీవన్‌ రామ్‌ కాలం నుంచి నేటి వరకు దళితులకు అడుగడుగునా అవమానాలే ఎదురవుతున్నాయని అన్నారు. బాబు జగ్జీవన్‌ రామ్‌ జయంతి వేడుకల కోసం రాష్ట్ర ప్రభుత్వం లక్షల రూపాయలు ఖర్చుపెట్టి పెద్ద ఎత్తున ప్రకటనలు ఇస్తే ఆ ప్రకటనలలో ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి ఫొటో ఎందుకు లేదని ప్రశ్నించారు. కోదాడ ప్రాంతంలో ఎస్సీ యువకుడు లాకప్‌ డెత్‌లో మరణిస్తే నేటి వరకు అక్కడి ఎస్‌ఐపై చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. ఈ ఘటనపై స్పందించాలని మంత్రిని కోరగా వచ్చేవారం కోదాడకు వెళ్తానని హామీ ఇచ్చారు.  

ప్రముఖుల నివాళి.. 
బషీర్‌బాగ్‌ చౌరస్తాలో బాబు జగ్జీవన్‌ రామ్‌ విగ్రహానికి పలువురు ప్రముఖులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, మాజీ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ, రాష్ట్ర మంత్రులు దామోదర రాజనర్సింహ, వివేక్‌ వెంకటస్వామి, ఎంపీ మల్లు రవి, శాసన సభ్యులు సత్యనారాయణ, మందుల సామేల్, నాగరాజు, శాసనమండలి విప్‌ అద్దంకి దయాకర్, ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌ ప్రీతం, మాజీ ఎంపీ వి.హనుమంతరావు, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, మాజీ ఐపీఎస్‌ అధికారి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్, ఓయూ ప్రొఫెసర్‌ కాసీం, దళిత జాతీయ నాయకుడు జేబీ రాజుతోపాటు వివిధ ఉద్యోగ, కుల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement