అజహరుద్దీన్‌తో ప్రమాణస్వీకారం చేయిస్తున్న గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ. చిత్రంలో సీఎం రేవంత్‌రెడ్డి
విమానాశ్రయం నుంచి నేరుగా రాజ్‌భవన్‌కు సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: మాజీ క్రికెటర్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహ్మద్ అజహరుద్దీన్ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. శుక్రవారం రాజ్‌భవన్‌లోని దర్బార్ హాల్‌లో జరిగిన కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ ఆయనతో ప్రమాణం చేయించారు. ఇంగ్లిష్ లో అల్లా సాక్షిగా అజహరుద్దీన్ ప్రమాణం చేశారు. ఉదయం 12:26 నిమిషాలకు ప్రారంభమైన ప్రమాణ స్వీకార కార్యక్రమం ఐదు నిమిషాల్లో ముగిసింది.
ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు సీఎం రేవంత్‌రెడ్డి ముంబై నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చి అక్కడి నుంచి నేరుగా రాజ్‌భవన్‌కు వచ్చారు. అజారుద్దీన్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతోపాటు సహచర మంత్రులు (కొండా సురేఖ, సీతక్క మినహా) హాజరయ్యారు. నూతన మంత్రిగా ప్రమాణం చేసిన అజహరుద్దీన్‌ను అభినందించారు. ప్రమాణ స్వీకార అనంతరం గవర్నర్‌తో కలిసి సీఎం, కేబినెట్ సహచరులు గ్రూప్ ఫొటో దిగారు.
ఏ శాఖ ఇస్తారో..?
అజహరుద్దీన్‌కు ఏ శాఖ ఇస్తారన్నది రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. బీఆర్‌ఎస్ హయాంలో మైనారిటీలకు ఉప ముఖ్యమంత్రి హోదాలో హోం మంత్రిత్వ శాఖను కేటాయించిన నేపథ్యంలో అజహరుద్దీన్‌కు కూడా మంచి అవకాశం లభిస్తుందనే చర్చ జరుగుతోంది. ఆయనకు కూడా హోంశాఖ కేటాయిస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే, మైనారిటీ సంక్షేమంతోపాటు క్రీడాశాఖ అజారుద్దీన్‌కు కేటాయిస్తారని తెలుస్తోంది. శుక్రవారం సాయంత్రానికే అజహరుద్దీన్‌కు శాఖ కేటాయిస్తారని భావించినా వరంగల్ పర్యటన, జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారంలో సీఎం రేవంత్ ఉన్న నేపథ్యంలో సాధ్యం కాలేదు. శనివారం అజహరుద్దీన్¯ మంత్రిత్వ శాఖపై స్పష్టత వస్తుందని ప్రభుత్వ వర్గాల ద్వారా తెలిసింది.
ఏ శాఖ ఇచ్చినా ఓకే: మంత్రి అజహరుద్దీన్
తనకు మంత్రిగా అవకాశం కల్పించినందుకు సంతోషంగా ఉందని, ఏ శాఖ ఇచ్చినా ఇబ్బంది లేదని రాష్ట్ర మంత్రి అజహరుద్దీన్ వ్యాఖ్యానించారు. మంత్రిగా ప్రమాణం చేసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ కా>ంగ్రెస్ పార్టీ అధిష్టానం, ముఖ్యమంత్రి, రాష్ట్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. తనను మంత్రిగా చూసినందుకు తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు సంతోషపడుతున్నారని చెప్పారు. బీజేపీ, బీఆర్‌ఎస్ నేతలు చేస్తున్న విమర్శలు సరైనవి కావన్నారు. తన గురించి గూగుల్‌ను అడిగితే తెలుస్తుందని, తన దేశభక్తి గురించి కిషన్‌రెడ్డి సర్టీఫికెట్ అవసరం లేదని చెప్పారు. జూబ్లీహిల్స్ ఎన్నికకు, తనకు మంత్రి పదవి ఇవ్వడానికి ఎలాంటి సంబంధం లేదని, తాను పార్టీ పట్ల నిబద్ధతతో ఉన్నందునే మంత్రి పదవి ఇచ్చారని చెప్పారు.


