సాక్షి, సిద్ధిపేట: గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంపై దాడి జరిగింది. క్యాంప్ ఆఫీస్‌లో కిటికీ అద్దాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఘటనకి ముందు సీఎం రేవంత్ రెడ్డి ఫోటోతో ర్యాలీగా బయలుదేరిన డీసీసీ ప్రెసిడెంట్ ఆంక్షా రెడ్డి, కాంగ్రెస్ నాయకులు.. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌లో ఫోటో పెట్టారు.
కాంగ్రెస్ నాయకులే క్యాంప్ ఆఫీస్‌పై దాడి చేశారంటూ బీఆర్‌ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. తాము క్యాంప్ ఆఫీస్‌లో సీఎం ఫోటో పెట్టాము.. కానీ దాడి చేయలేదని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వద్ద పోలీసులు మోహరించారు.
ఈ ఘటనపై మాజీ మంత్రి హరీష్ రావు స్పందిస్తూ.. ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి, గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంపై కాంగ్రెస్ గూండాల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ముమ్మాటికీ ఇది సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో జరిగిన దాడి. ప్రజాస్వామ్యంపై సీఎం చేయించిన దాడి. పట్టపగలు అధికార మదంతో విర్రవీగుతూ సోయి మరచి వ్యవహరిస్తున్న కాంగ్రెస్ నాయకుల తీరు బీహార్ గ్యాంగ్‌ను తలపిస్తోందంటూ హరీష్‌రావు మండిపడ్డారు.
‘‘ఏకంగా ప్రజా ప్రతినిధుల క్యాంపు కార్యాలయాలపైనే ముప్పేట దాడులు చేస్తుంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నట్లా లేనట్లా?. కాంగ్రెస్ పాలనలో ప్రజా ప్రతినిధులపై దాడులు, ప్రజా సంఘాలపై దాడులు, మీడియాపై దాడులు.. నిత్యకృత్యం కావడం సిగ్గుచేటు. శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసు యంత్రాంగం కాంగ్రెస్ పార్టీకి ప్రైవేట్ సైన్యంలా మారిపోయారా? ఎందుకు అడ్డుకోవడం లేదు?’’ అంటూ హరీష్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.


