జాతీయ ఉమ్మడి ప్రవేశ పరీక్షల నిర్వహణలో మరోసారి వైఫల్యం
నీట్ రద్దుతో 22.79 లక్షల మంది విద్యార్థుల ఆవేదన.. తెలంగాణలో 71 వేలు, ఏపీలో 58 వేల మంది హాజరు
విద్యార్థులకు ఇతర కోర్సుల ప్రవేశ అవకాశాలపైనా ప్రభావం.. 2024లోనూ ఇదే అనుభవం
పరీక్ష ఆన్‌లైన్‌లో నిర్వహించడమే పరిష్కారమంటున్న నిపుణులు
సాక్షి, హైదరాబాద్: నీట్ యూజీకి దేశవ్యాప్తంగా ఉన్న క్రేజ్ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. విద్యార్థులు ఇంటర్మీడియెట్‌లో చేరిన తొలి రోజు నుంచే నీట్‌లో ర్యాంకు సాధించి ఎంబీబీఎస్, బీడీఎస్‌లో అడుగుపెట్టాలని అహర్నిశలు కృషి చేస్తుంటారు. కానీ నీట్ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) రద్దు చేస్తున్నట్లు ప్రకటించడంతో 22.79 లక్షలమంది విద్యార్థులు మనోవేదనకు గురవుతున్నారు. నీట్ యూజీ మాత్రమే కాకుండా ఇతర పరీక్షల విషయంలోనూ ఎన్‌టీఏ నిర్వహణ లోపాలు చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో కామన్ ఎంట్రన్స్ టెస్ట్‌ల నిర్వహణలో ఎన్‌టీఏ వైఫల్యంపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తు న్నాయి. రాజస్తాన్‌లోని సికార్ ప్రాంతంలో పేపర్ లీకైనట్లు, 600 మార్కులకు సరితూగే 120కి పైగా ప్రశ్నలు పరీక్షకు రెండు రోజుల ముందుగానే పలు కోచింగ్ సెంటర్లలో ప్రాక్టీస్ పేపర్ పేరిట ప్రత్యక్షమైన విషయం తెలిసిందే. అయితే ఇది కేవలం యాదృచ్ఛికమే అని, పేపర్ లీక్ కాలేదని తొలుత ప్రకటించిన ఎన్‌టీఏ.. కేవలం కొన్ని గంటల్లోనే తన నిర్ణయాన్ని మార్చుకుని నీట్–2026 పరీక్షను రద్దు చేసింది. పరీక్ష కొత్త తేదీని త్వరలోనే వెల్లడిస్తామని ఎన్‌టీఏ చెప్పింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ప్రకటించి, పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులపై కఠిన ఆంక్షలు విధించినప్పటికీ ప్రశ్నపత్రం లీక్ కావడం ఎన్‌టీఏ వైఫల్యానికి పరాకాష్ట అని వైద్య కళాశాలల ప్రొఫెసర్లు విమర్శిస్తున్నారు. తప్పు చేసిన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాల్సిందిపోయి, నిజాయితీగా పరీక్ష రాసిన లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును అనిశ్చితిలోకి నెట్టడం సరికాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పకడ్బందీ ఏర్పాట్లు లేవా?
ఎన్‌టీఏ పకడ్బందీ ఏర్పాట్లు చేయకపోవడంతోనే ప్రశ్నపత్రం లీకైందని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కేంద్రీకృత వ్యవస్థ ద్వారా ప్రశ్నపత్రాలను రూపొందించి పరీక్ష కేంద్రాలకు పంపించే ఎన్‌టీఏ వాటి పంపిణీ విషయంలో మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని అంటున్నారు. పటిష్ట భద్రతతో పేపర్లను సెంటర్లకు పంపిణీ చేసే విషయంలో జాగ్రత్తలు తీసుకోవట్లేదని, దీంతో ఆయా రాష్ట్రాల్లో పర్యవేక్షణ అధికారుల తీరు కూడా అనుమానాస్పదంగా ఉందనే ఆరోపణలు వస్తున్నాయి. ఎన్‌టీఏ నిర్లక్ష్యపూరిత వ్యవహార శైలికి నీట్ యూజీ–2024ని కూడా విద్యావేత్తలు గుర్తుచేస్తున్నారు. ఆ ఏడాది నీట్ యూజీ నిర్వహణ సమయంలో బిహార్ రాజధాని పట్నాలో పేపర్ లీకైందని, సమాధానాలతో కూడిన ప్రశ్నపత్రాలను ముందుగానే అమ్ముకున్నారనే ఆరోపణలు వచ్చాయి. దీనికి బలం చేకూరుస్తూ పట్నా సెంటర్ నుంచి పరీక్షకు హాజరైన 67 మంది అభ్యర్థులకు 720 మార్కులకుగాను 720 మార్కులు వచ్చాయి. అయితే ఈ ఆరోపణల్లో వాస్తవం లేదని, సదరు పరీక్ష సెంటర్‌లో నిర్వహణ పరమైన ఇబ్బందుల కారణంగా విద్యార్థులకు సమయాభావం ఏర్పడిందని, దీంతో వారికి గ్రేస్ మార్కులు ఇవ్వడంతో ఆ స్థాయిలో మార్కులు వచ్చాయని చెప్పింది. అయితే, దీనిపై సీబీఐ విచారణ జరిపి పేపర్ లీక్ వాస్తవమని తేల్చింది. కేవలం ఒక సెంటర్‌లో లీకైందనే కారణంతో లక్షల మంది విద్యార్థులను ఇబ్బందుల్లో పెట్టబోమని, పేపర్ లీకైన సెంటర్లలోని 1,563 మందికి మాత్రమే పరీక్ష రద్దు చేసి కొత్తగా పరీక్ష నిర్వహించాలని నాడు కోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే.
విద్యా సంవత్సరంపై ప్రభావం
నీట్ పరీక్ష రీషెడ్యూల్ ఎప్పుడు చేస్తారు? పేపర్ ఎలా ఉంటుంది? అని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి పరీక్షకు హాజరైన విద్యార్థులు మళ్లీ అదే పరీక్షకు హాజరు కావాలంటే మానసికంగా అలసటకు గురవుతారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నీట్ రద్దు, పునర్‌నిర్వహణ కారణంగా వచ్చే విద్యా సంవత్సరంపైనా ప్రతికూల ప్రభావం పడనుంది. నీట్ పునర్‌నిర్వహణకు ఎన్‌టీఏకు కనీసం నెల రోజుల సమయం పడుతుందని, ఆ తర్వాత ఫలితాల విడుదలకు మరో పది, పదిహేను రోజులు.. మొత్తంగా 40 రోజులు పడుతుందని నిపుణులు అంటున్నారు. అంటే జూన్ మూడో వారానికి గానీ నీట్ ప్రక్రియ పూర్తయ్యే అవకాశాలు కనిపించట్లేదు. ఇదే జరిగితే నీట్ ఆధారంగా నిర్వహించే మెడికల్ కౌన్సెలింగ్ ప్రక్రియ జాప్యం అవడం ఖాయం. దీంతో విద్యా సంవత్సరం ప్రారంభం కూడా జాప్యమవుతుంది.
ఇతర కోర్సుల ప్రవేశాలకు సందిగ్ధత:
నీట్ పునర్‌నిర్వహణ వల్ల విద్యార్థులు ఇతర కోర్సుల్లో ప్రవేశాల విషయంలోనూ సందిగ్ధత నెలకొనే ప్రమాదం ఉంది. నీట్‌లో సరైన ఫలితం రాకుంటే బైపీసీ అర్హతతో డిగ్రీ లేదా ఇతర కోర్సులవైపు విద్యార్థులు దృష్టి సారిస్తారు. అయితే డిగ్రీ ప్రవేశాల విషయంలో ఇప్పటికే తెలంగాణలో ‘దోస్త్’షెడ్యూల్ ప్రకటించారు. జూన్ 20 కల్లా మూడు దశల కౌన్సెలింగ్ పూర్తయి జూలై 1 నుంచి క్లాస్‌లు ప్రారంభిస్తారు. అదేవిధంగా ఏపీలోనూ జూలై రెండో వారానికి డిగ్రీ ప్రవేశాలు పూర్తయ్యే అవకాశం ఉంది. దీంతో నీట్ ఫలితాలు ఆలస్యమైతే అందులో నిరాశకు గురైన విద్యార్థులు డిగ్రీలో చేరే అవకాశాన్ని కూడా కోల్పోయే ప్రమాదం ఉంది. అదేవిధంగా బైపీసీ అర్హతతో ఎప్‌సెట్ ర్యాంకు ఆధారంగా ప్రవేశాలు నిర్వహించే అగ్రికల్చర్, బీఫార్మసీ కోర్సుల షెడ్యూల్ కోణంలోనూ గందరగోళం తలెత్తే ప్రమాదం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
రాధాకృష్ణన్ కమిటీ సిఫార్సులు
2024లో నీట్ లీకేజ్ నేపథ్యంలో పరీక్షను పారదర్శకంగా నిర్వహించేందుకు అనుసరించాల్సిన చర్యలపై నాడు కేంద్ర ప్రభుత్వం ఇస్రో మాజీ చైర్మన్ కె.రాధాకృష్ణన్ నేతృత్వంలో కమిటీని నియమించింది. అదే సంవత్సరం అక్టోబర్‌లో నీట్ యూజీ నిర్వహణ తీరుతెన్నులను క్షుణ్నంగా పరిశీలించిన కమిటీ.. నీట్ యూజీని ఆన్‌లైన్ విధానంలో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌గా లేదా హైబ్రిడ్ విధానంలో నిర్వహించాలని సిఫార్సు చేసింది. అయితే గ్రామీణ ప్రాంతాల్లో బ్రాడ్‌బ్యాండ్ సహా ఇతర నెట్‌వర్క్ సదుపాయాలు లేవనే కారణంతో దీన్ని అమలు చేయలేదు. అయితే ఆన్‌లైన్ విధానంలో నిర్వహిస్తే ప్రశ్నపత్రాల లీకేజ్‌కు ఆస్కారం ఉండదని, విద్యార్థులు తాము పరీక్ష రాస్తున్న సమయంలోనే ప్రశ్నలను చూసే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.
ఇతర పరీక్షల్లోనూ ఎన్‌టీఏ లోపాలు
⇒ నీట్ యూజీ–2024 ప్రశ్నపత్రం బిహార్ రాజధాని పట్నాలో లీకైంది. దీంతో పేపర్ లీకైన కేంద్రంలో పరీక్షను మళ్లీ నిర్వహించారు.
⇒ యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్స్, జేఆర్‌ఎఫ్‌లకు అర్హతగా నిర్వహించే యూజీసీ నెట్–2024 పరీక్ష కూడా పేపర్ లీక్ కారణంగా 2024 జూన్ 18న పరీక్ష జరిగిన మరుసటి రోజు రద్దు చేశారు.
⇒ సీఎస్‌ఐఆర్– యూజీసీ–నెట్– 2024ను కూడా పేపర్ లీకైందనే ఆందోళన నేపథ్యంలో రీషెడ్యూల్ చేసి నిర్వహించారు.
⇒ టీచింగ్ ఎడ్యుకేషన్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఎన్‌సీఈటీ–2024ను నిర్వహణ పరమైన లోపాలతో నెలపాటు వాయిదా వేశారు.
⇒ జేఈఈ మెయిన్ 2026 ఏప్రిల్ సెషన్‌లో.. సరైన ప్రశ్నలు రూపొందించని కారణంతో 12 ప్రశ్నలు తొలగించారు. జేఈఈ – మెయిన్ 2025లో సైతం 19 ప్రశ్నలను తొలగించారు.
⇒ ఇలా 2018లో ఎన్‌టీఏ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 18 పరీక్షలను వాయిదా వేయగా.. పలు పరీక్షల విషయంలో ప్రశ్నల రూపకల్పనలో పొరపాట్లు చేయడంతో లక్షల మంది విద్యార్థులు ప్రతికూల ప్రభావానికి గురయ్యారు.
2024లో ఎన్‌టీఏ డీజీపై వేటు
2024లో కొన్ని సెంటర్లలో నీట్ పేపర్ లీకేజ్, యూజీసీ నెట్ లీకేజ్‌లకు బాధ్యులుగా.. అప్పుడు ఎన్‌టీఏ డైరెక్టర్ జనరల్‌గా ఉన్న సుబోధ్ కుమార్ సింగ్‌ను తొలగించారు. ఆయన స్థానంలో ప్రదీప్ సింగ్ ఖరోలాను నియమించారు. అయినప్పటికీ ఆశించిన మార్పులు లేకపోవడంతో తాజాగా ఆయన స్థానంలో మరో ఐఏఎస్ అధికారి అభిషేక్ సింగ్‌ను నియమించారు. ఇలా అధికారుల స్థాయి నుంచి క్షేత్రస్థాయిలో నిర్వహణ వరకు పలు లోటుపాట్లు ఎన్‌టీఏలో జరుగుతున్నాయని అంటున్నారు. దీంతో పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి.
తీవ్ర ఒత్తిడి ఉంటుంది
నీట్ యూజీ పేపర్ లీకేజ్ కారణంగా విద్యార్థులు తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతారు. ఒకసారి చదివిన అంశాలే అయినప్పటికీ.. పరీక్ష క్లిష్టత, పోటీ వంటి కారణాలతో ఒత్తిడికి గురవుతారు. అదేవిధంగా నీట్‌లో అవకాశం చేజారితే దృష్టి సారించాల్సిన ముఖ్య ప్రత్యామ్నాయ కోర్సులైన అగ్రి బీఎస్సీ, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల షెడ్యూల్ కోణంలోనూ ఒత్తిడికి గురయ్యే ప్రమాదం ఉంది. విద్యార్థులే కాకుండా వారి తల్లిదండ్రులు కూడా ఆందోళన చెందే పరిస్థితి తలెత్తింది. భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా ఉండాలంటే నీట్‌ను ఆన్‌లైన్‌లో నిర్వహించడం శ్రేయస్కరం.
–ప్రొఫెసర్ వి.బాలకిష్టారెడ్డి, తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్


