ఇదేనా మాకిచ్చే 'గౌరవం'! | Anganwadi teachers and helpers have not received their honorarium for two months | Sakshi
Sakshi News home page

ఇదేనా మాకిచ్చే 'గౌరవం'!

Jun 5 2026 4:57 AM | Updated on Jun 5 2026 4:57 AM

Anganwadi teachers and helpers have not received their honorarium for two months

5 నెలలుగా కొత్త సర్పంచ్‌లకు వేతనం లేదు

ఒక్కొక్కరికీ రూ.32,500 చొప్పున బకాయి

సాక్షి, హైదరాబాద్‌ : కొత్తగా ఎన్నికైన గ్రామ సర్పంచ్‌లకు ఇంతవరకూ గౌరవ వేతనాలు అందలేదు. 2025 డిసెంబర్‌లో మూడు దశల్లో గ్రామపంచాయతీ ఎన్నికలు జరగగా, డిసెంబర్‌ 22న నూతన సర్పంచ్‌లు పదవీ బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి ఇప్పటివరకు అంటే ఐదునెలలకు పైగా కాలానికి వారికి గౌరవ వేతనమంటూ ఇవ్వలేదు. సర్పంచ్‌లకు నెలకు రూ.ఆరున్నర వేల చొప్పున ఈ వేతనం చెల్లించాల్సి ఉండగా, ఒక్కొక్కరికీ రూ.32,500 చొప్పున (ఐదు నెలలకు) బకాయి పడినట్లు అయ్యింది. 

రాష్ట్రంలోని మొత్తం 12,762 గ్రామ పంచాయతీలకు గాను రాష్ట్రవ్యాప్తంగా మొత్తం రూ. 41.28 కోట్ల మేర బకాయిలు పేరుకుపోయినట్లు తెలుస్తోంది. గ్రామాల్లో పర్యటన లకు, పాలనా వ్యవహారాలకు, ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరగడానికి గౌరవ వేతనం ఉపయోగప డుతుందని ఆశిస్తే తమకు నిరాశే ఎదురవుతోందని సర్పంచ్‌లు వాపోతున్నారు. సర్పంచ్‌లకేకాకుండా పల్లెల్లో ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండే వార్డు సభ్యులకు అందాల్సిన సిట్టింగ్‌ ఫీజులు సైతం ఇవ్వకపోవడంతో అవి కూడా పెండింగ్‌లోనే పడినట్లు సమాచారం. 

దీనికి సంబంధించి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులను ఆరా తీస్తే వీరి గౌరవ వేతనం చెల్లింపునకు సంబంధించిన ఫైల్‌ సర్క్యులేషన్‌(ఒక అధికారిక పత్రాన్ని లేదా ఫైల్‌ను నిర్ణీత క్రమంలో వివిధశాఖలు లేదా అధికారుల పరిశీలన మరియు ఆమోదం కోసం పంపే ప్రక్రియ)లో ఉన్నదనే సమాధానం వస్తోంది. రాష్ట్రప్రభుత్వం వెంటనే స్పందించి తమ పెండింగ్‌ గౌరవ వేతనాలు విడుదల చేయాలని, పంచాయతీలకు నేరుగా నిధులు కేటాయించాలని సర్పంచ్‌ల సంఘాలు కోరుతున్నాయి.

అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లకు రెండు నెలలుగా అందని గౌరవభృతి
కమిషనర్, కార్యదర్శికి వినతులు సమర్పించినా మారని తీరు
సాక్షి, హైదరాబాద్‌: అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లు వేతనాల కోసం ఎదురు చూస్తున్నారు. రెండు నెలలుగా గౌరవభృతి అందకపోవడంతో ఉన్నతాధికారులకు వినతులు సమర్పిస్తున్నారు. ప్రజాప్రభుత్వం ఏర్పాటు తర్వాత ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా ఒకటో తేదీన అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లకు వేతనాలు ఇవ్వగా ఆ తర్వాత చెల్లింపుల్లో తీవ్ర జాప్యం చోటుచేసుకుంటోంది. కమిషనరేట్‌ కార్యాలయ అధికారుల వైఖరితో వేతన చెల్లింపుల్లో తీవ్ర జాప్యం చోటుచేసుకుంటోందని అంగన్‌వాడీ ఉద్యోగ సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

ప్రస్తుతం ఏప్రిల్‌ నెల నుంచి అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లకు వేతనాలు అందలేదు. కొత్త ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ విడుదలలో ఆలస్యం కావడంతో వేతనాల విడుదలలో జాప్యం జరిగినట్లు అధికారులు నచ్చజెబుతున్నారని, నిధులు అందుబాటులో ఉన్నప్పటికీ విడుదల చేయకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తిందని సంఘాల నేతలు మండిపడుతున్నారు. అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్ల గౌరవ వేతన చెల్లింపుల్లో జరుగుతున్న జాప్యంపై సంఘాల నేతలు పలుమార్లు కమిషనరేట్, కార్యదర్శులకు వినతులు సమర్పిస్తూనే ఉన్నారు. 

కానీ వాటిని ఏమాత్రం పట్టించుకోకపోవడంతో వేతన చెల్లింపుల్లో జాప్యం జరుగుతున్నట్లు టీచర్లు, హెల్పర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 149 ఐసీడీఎస్‌ ప్రాజెక్టులున్నాయి. 35,781 అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. ఇందులో 24,942 కేంద్రాలు గ్రామీణ ప్రాంతాల్లో, 6,655 కేంద్రాలు పట్టణ ప్రాంతాల్లో, 4,184 కేంద్రాలు ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నాయి. వీటి పరిధిలో 62వేల మంది టీచర్లు, హెల్పర్లు పనిచేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement