కారుణ్యం.. దారుణం..బట్టబయలు చేసిన మెటర్నిటీ దరఖాస్తు

Allegedly Got A Job Saying He Was Not Married   - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీ నిర్లక్ష్యమనాలో..నిద్రమత్తు అనాలో కానీ..గుడ్డిగా వ్యవహరిస్తున్న తీరుకు ఇదో మచ్చు తునక. ఓ మహిళ తనకు వివాహం కాలేదని చెప్పి..ఏకంగా కారుణ్య నియామకం ద్వారా ఉద్యోగం పొందినట్లు తెలుస్తోంది. ఇటీవల ఆమె మెటర్నిటీ ఖర్చుల రీయింబర్స్‌మెంట్‌కు దరఖాస్తు చేసుకున్న సమయంలో ఈ అంశాన్ని గుర్తించినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే...ఆరోగ్యం–పారిశుధ్యం విభాగంలో జూనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న మహిళాఉద్యోగి ఒకరు మెటర్నిటీ ఖర్చుల రీయింబర్స్‌మెంట్‌ నిమిత్తం చేసుకున్న దరఖాస్తును జీహెచ్‌ఎంసీలోని సంబంధిత అధికారులు వాటిని చెల్లించే రాష్ట్రస్థాయి వైద్య విభాగానికి పంపించారు.

ఫైలును పరిశీలించిన సదరు విభాగం మెటర్నిటీ ప్రయోజనాలను రెండు కాన్పుల వరకు మాత్రమే పొందే అవకాశం ఉందని, ఆమెకది నాలుగో కాన్పు అయినందున నిధులివ్వడం కుదరదని, ఉన్నతాధికారులను తప్పుదోవ పట్టించినందుకు తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా సూచిస్తూ జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు ఫైలును తిప్పి పంపినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ నేపథ్యంలో..అసలు ఆమె ఉద్యోగంలో చేరడమే అక్రమ మార్గంలో చేరిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కారుణ్య నియామకం కింద రెండేళ్ల క్రితం ఉద్యోగంలో చేరిన ఆమె తనకు వివాహం కాలేదని పేర్కొంటూ ఉద్యోగం పొందినట్లు వినిపిస్తోంది.

ఇప్పుడు మెటర్నీటీ ప్రయోజనం పొందేందుకు ఆస్పత్రి సేవల ఖర్చులకు సంబంధించిన రికార్డులు, బిల్లులు జతచేయడంతో వాటిని పరిశీలించిన సంబంధిత విభాగం నాలుగోకాన్పుగా గుర్తించింది. కారుణ్య నియామకాలకు సంబంధించి కుటుంబంలో సంపాదించే వ్యక్తి మరణించినప్పుడు వారి సంతానంలో ఎవరో ఒకరికి ఉద్యోగం ఇవ్వవచ్చునని, అమ్మాయిలైతే వివాహం కాని వారికి  వర్తిస్తుందని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. మిగతా సంతతి నిరభ్యంతరం కూడా అందుకు అవసరం.ఈ నేపథ్యంలో అసలు ఆమె నియామకమే అక్రమంగా జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో  ఈ వ్యవహారంపై విజిలెన్స్‌ విభాగం ద్వారా విచారణ జరిపించేందుకు అధికారులు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

అంధ పాలన ఎన్నాళ్లు..? 
ఈ నేపథ్యంలో, జీహెచ్‌ఎంసీలోని ఉన్నతాధికారులు ఎన్నాళ్లు అంధ పాలన సాగిస్తారనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఇతర ప్రభుత్వ విభాగాల నుంచి జీహెచ్‌ఎంసీకి డిప్యుటేషన్‌పై వచ్చి మూడేళ్లకు తిరిగి వెళ్లాల్సి ఉండగా, ఐదేళ్లు దాటినా.. ఆ తర్వాత సైతం జీహెచ్‌ఎంసీయే  సొంత డిపార్ట్‌మెంట్‌లా  పాతుకుపోయిన వారి విషయంలోనే  ఏమీ చేయని ఉన్నతాధికారులు.. ఇతర విభాగాల్లోనూ  వక్రమార్గాల్లో అక్రమాలు జరుగుతున్నా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

(చదవండి: చితి మంటలకు చెల్లు! విదేశాల్లో ఉన్నవారు సైతం చూసేలా...)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top