
ప్రాజెక్టు ఆమోదయోగ్యం కాదన్న గోదావరి బోర్డు
పోలవరం ప్రాజెక్టుకు ఇచ్చిన టీఏసీ అనుమతుల ఉల్లంఘన
గోదావరి వరద జలాలపై పరీవాహకంలోని అన్ని రాష్ట్రాలకు హక్కులు
వాటిని ఇతర బేసిన్లకు తరలిస్తే ఆ రాష్ట్రాలకూ వాటా ఇవ్వాల్సిందే
సీడబ్ల్యూసీకి రాసిన లేఖలో తేల్చి చెప్పిన జీఆర్‌ఎంబీ
సాక్షి, హైదరాబాద్: ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించిన గోదావరి–బనకచర్ల అనుసంధానం ప్రాజెక్టు ఆమోదయోగ్యం కాదని గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్‌ఎంబీ) కుండబద్దలు కొట్టింది. గోదావరి జలాల పంపిణీపై బచావత్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుతో పాటు పోలవరం ప్రాజెక్టుకు అనుమతిస్తూ 2011లో కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ)లోని 108వ టెక్నికల్ అడ్వైయిజరీ కమిటీ (టీఏసీ) జారీ చేసిన మార్గదర్శకాలకు ఈ ప్రాజెక్టు విరుద్ధమని తేల్చి చెప్పింది. ఈ మేరకు గోదావరి–బనకచర్ల అనుసంధానం ప్రాజెక్టు ప్రీ ఫీజబిలిటీ రిపోర్టుపై తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ.. గోదావరి బోర్డు తాజాగా సీడబ్ల్యూసీకి లేఖ రాసింది.
జీఆర్‌ఎంబీ అభిప్రాయం కోరిన సీడబ్ల్యూసీ
బనకచర్ల ప్రాజెక్టును నిర్మించి రోజుకు 2 టీఎంసీలు చొప్పున మొత్తం 200 టీఎంసీల గోదావరి జలాలను క్రాస్ రెగ్యులేటర్‌కు తరలించి 3 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుతో పాటు 9.14 లక్షల ఎకరాల ఆయకట్టుకు ప్రత్యామ్నాయ నీటి వసతి, 80 లక్షల మందికి తాగునీటి సదుపాయం కల్పిస్తామని ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ మేరకు కేంద్ర జలశక్తి శాఖకు ప్రాజెక్టు ప్రీ ఫీజబిలిటీ రిపోర్టును సమర్పించింది. దానిని గత మే 23న గోదావరి బోర్డు, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక రాష్ట్రాలకు పంపిన సీడబ్ల్యూసీ అభిప్రాయాలు కోరింది. ఈ నేపథ్యంలో గోదావరి బోర్డు తన అభిప్రాయాన్ని తెలియజేసింది.
ప్రాజెక్టు విస్తరణ కుదరదన్న బోర్డు
పోలవరం ప్రాజెక్టుకు అనుమతిస్తూ టీఏసీ జారీ చేసిన ఆపరేషన్స్ ప్రొటోకాల్స్ ప్రకారం ఆ ప్రాజెక్టు విస్తరణకు ఎలాంటి చర్యలు తీసుకోరాదని జీఆర్‌ఎంబీ స్పష్టం చేసింది. బచావత్ ట్రిబ్యునల్ తీర్పులోని 14(డీ) క్లాజు ప్రకారం గోదావరిలోని వరద జలాలపై అన్ని రాష్ట్రాలకు హక్కు ఉంటుందని తెలిపింది. ఒక వేళ గోదావరి జలాలను మరో నది పరీవాహక ప్రాంతానికి తరలిస్తే ఆ జలాలపై పరీవాహక ప్రాంతంలోని ఇతర రాష్ట్రాలకూ వాటాలుంటాయని వివరించింది.
పోలవరం ప్రాజెక్టు ద్వారా కృష్ణా పరీవాహక ప్రాంతానికి 80 టీఎంసీల జలాలను తరలిస్తే దానికి బదులుగా నాగార్జునసాగర్ ఎగువన ఉన్న రాష్ట్రాలకు 80 టీఎంసీల కృష్ణా జలాలను కేటాయిస్తూ బచావత్ ట్రిబ్యునల్ నిర్ణయం తీసుకుందని గుర్తు చేసింది. ఇదే సూత్రం బనకచర్ల ప్రాజెక్టుకు సైతం వర్తిస్తుందని స్పష్టం చేసింది. గోదావరిలో వరద, మిగులు జలాల లభ్యతపై స్పష్టత రావాల్సి ఉందని పేర్కొంది. బనకచర్ల ప్రాజెక్టు ద్వారా వరద జలాలనే తరలిస్తామని ఏపీ ప్రతిపాదించినప్పటికీ వాస్తవంగా తరలించేది వరద జలాలా? మిగులు జలాలా? నికర జలాలా? అనే అంశంపై సైతం స్పష్టత లేదని తెలిపింది.