లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఏఈ స్వరూప | AE Swaroopa Caught Demanding Bribe from Contractor | Sakshi
Sakshi News home page

రూ.1.20 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఏఈ

Jun 18 2025 8:29 AM | Updated on Jun 18 2025 8:29 AM

AE Swaroopa Caught Demanding Bribe from Contractor

హైదరాబాద్: చర్లపల్లి డివిజన్‌ పరిధిలో సీసీ రోడ్డు పనులు పూర్తి చేసిన కాంట్రాక్టర్‌ సీహెచ్‌ రామిరెడ్డి నుంచి ఇంజినీరింగ్‌ విభాగం ఏఈ స్వరూప రూ.1.20 లక్షలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు దొరికిపోయిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. రంగారెడ్డి రేంజ్‌ ఏసీబీ డీఎస్పీ ఆనంద్‌ కుమార్‌ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. డివిజన్‌ పరిధిలో రూ. 28.50 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణానికి అధికారులు టెండర్‌ వేశారు. 

టెండర్‌ను కాంట్రాక్టర్‌ సీహెచ్‌ రామిరెడ్డి దక్కించుకుని, సీసీ రోడ్డు పనులను దాదాపు పూర్తి చేశారు. ఇందుకు సంబంధించిన నిధుల విడుదలకు ఇంజినీరింగ్‌ విభాగం అధికారులు రెండు విడతలుగా ఎంబీ బుక్స్‌ చేసి ఉన్నతాధికారులకు ప్రపోజల్‌ ఫైల్‌ను పంపారు. తొలుత రూ. 26 లక్షలు మంజూరయ్యాయి. మిగతా రూ. 2.50 లక్షల కోసం సదరు కాంట్రాక్టర్‌ కాప్రా సర్కిల్‌ కార్యాలయం చుట్టూ తిరిగారు. 

అయినా నిధులు మంజూరు కాలేదు. పెండింగ్‌ బిల్లు మంజూరు చేయాలంటే రూ.1.50 లక్షలు ఇవ్వాలని ఏఈ బి.స్వరూప డిమాండ్‌ చేశారు. చివరికి రూ.1.20 లక్షలు ఇస్తే బిల్లు ప్రాసెస్‌ చేస్తానని చెప్పడంతో గత్యంతరం లేని కాంట్రాక్టర్‌ రామిరెడ్డి ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. మంగళవారం కాప్రా సర్కిల్‌ కార్యాలయంలో కాంట్రాక్టర్‌ రామిరెడ్డి నుంచి ఏఈ స్వరూప రూ.1.20 లక్షలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ప్రభుత్వ అధికారులెవరైనా డబ్బులు డిమాండ్‌ చేస్తే టోల్‌ఫ్రీ నంబర్‌ 1064కు ఫిర్యాదు చేయాలని రంగారెడ్డి రేంజ్‌ ఏసీబీ డీఎస్పీ ఆనంద్‌ కుమార్‌ సూచించారు.   

Advertisement
 
Advertisement
Advertisement