భవిష్యత్‌లో బినామీలు ఎదురుతిరిగినా ఇబ్బంది లేకుండా రాయించుకున్న డీఎస్పీ భీమ్‌రెడ్డి
ఆయన అక్రమాస్తుల మార్కెట్ విలువ రూ.300 కోట్లుగా అంచనా
అత్యధిక ఆస్తులు హోంగార్డు, వాచ్‌మన్లు, సెక్యూరిటీ గార్డులు, డ్రైవర్ల పేరుతోనే...
రిమాండ్ రిపోర్టులో కీలకాంశాలను పొందుపరిచిన ఏసీబీ
సాక్షి, హైదరాబాద్: ఆదాయానికి మించి ఆస్తులు కూడగట్టిన డీఎస్పీ సంకిరెడ్డి భీమ్‌రెడ్డి కేసు దర్యాప్తులో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు కీలక విషయాలు గుర్తిస్తున్నారు. ఆయన అరెస్టుకు సంబంధించి రూపొందించిన రిమాండ్ రిపోర్టులో ఈ అంశాలను పొందుపరిచారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. భీమ్‌రెడ్డి అక్రమాస్తుల మార్కెట్ విలువ రూ.300 కోట్ల వరకు ఉంటుందని ఏసీబీ తేల్చింది. వీటిలో అత్యధికం తన బినామీలైన హోంగార్డు, వాచ్‌మన్లు, సెక్యూరిటీ గార్డులతోపాటు డ్రైవర్ల పేరుతోనే ఉన్నాయి. ఈ అక్రమాస్తుల నిర్వహణ విషయంలో భీమ్‌రెడ్డి చాలా తెలివిగా వ్యవహరించారు. తొలుత తన పేరుమీద ఆస్తులను కొనుగోలు చేసిన ఆయన, ఆపై బినామీల పేరు మీదకు మార్చారు.
ఈ క్రమంలోనే తనకు ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. భవిష్యత్‌లో వాటిని రద్దు చేసుకునేందుకు వీలుగా బినామీల వద్ద నుంచి ముందే క్యాన్సిలేషన్ డీడ్‌లను రాయించుకున్నారు. వాటిని భద్రంగా తన వద్ద దాచుకున్నారు. ఒకవేళ సదరు బినామీలు ఆ ఆస్తి తమదేనని వాదించినా, ఈ క్యాన్సిలేషన్ డీడ్ సాయంతో భీమ్‌రెడ్డి తన ఆస్తుల్ని తిరిగి పొందే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పటి వరకు భీమ్‌రెడ్డికి ఈ క్యాన్సిలేషన్ డీడ్స్ వినియోగించాల్సిన అవసరం రాలేదని ఏసీబీ తేల్చింది. సోదాల సమయంలో భీమ్‌రెడ్డి ఇంట్లో నుంచి ఏసీబీ అధికారులు రెండు మెమరీ కార్డులు స్వాదీనం చేసుకున్నారు. వీటిలో ఉన్న వివరాల ఆధారంగానే కొన్ని ఆస్తుల డాక్యుమెంట్స్‌ను ఏసీబీ స్వా«దీనం చేసుకుంది.
మనకు ఇవ్వాల్సిన వారు.. నేను ఇవ్వాల్సిన వారు
ఈ ఏడాది మార్చిలో చార్‌ధామ్ యాత్రకు వెళ్లిన భీమ్‌రెడ్డి దానికి ముందు స్వదస్తూరితో ఓ డైరీ రాశారు. అందులో తన ఆస్తులు, వాటి బినామీలతోపాటు తన వారసుల్లో ఎవరికి అవి చెందాలన్నది వివరించారు. బినామీల చిట్టా విప్పడానికి ఏసీబీకి ఇది కీలక ఆధారంగా మారింది. మరోపక్క ఆ డైరీలోని ఓ పేజీలో ‘మనకు ఇవ్వాల్సిన వారు’అని, మరో పేజీలో ‘నేను ఇవ్వాల్సిన వారు’అంటూ తనకు రావాల్సి సొమ్ము, తాను చెల్లించాల్సిన నగదు విషయాలను భీమ్‌రెడ్డి పొందుపరిచారు. భీమ్‌రెడ్డి ప్రస్తుతం తారామతి–బారాదరి సమీపంలోని వెస్సెల్లా మెడోస్‌లోని రూ.8 కోట్ల విలువైన విల్లాలో నివసిస్తున్నారు. ఈ విల్లా ఎలా వచ్చిందనే దానిపై ఏసీబీ ప్రశ్నించినా ఆయన నుంచి సరైన సమాధానం రాలేదు.
అరెస్టు ఆలస్యంపై.....
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో భీమ్‌రెడ్డిని అరెస్టు చేయడం ఆలస్యమైంది. ఇది తీవ్ర వివాదాస్పదం కావడంతో అందుకు కారణాలను ఏసీబీ అధికారులు రిమాండ్ రిపోర్టులో పొందుపరిచారు. సోదాలు జరుగుతున్న సమయంలో భీమ్‌రెడ్డి శ్వాస సంబంధిత సమస్యతో ఇబ్బంది పడ్డారని ఏసీబీ పేర్కొంది. రక్తపోటుతోపాటు ఇతర ఆరోగ్య సమస్య కారణంగా ఆయన్ను ఎక్కడికీ తీసుకువెళ్లడం శ్రేయస్కరం కాదని వైద్యులు సలహా ఇవ్వడంతోనే భీమ్‌రెడ్డిని వెంటనే అరెస్టు చేయడం సాధ్యం కాలేదని, ఈ కారణంగానే ఆయన్ను వెంటనే అరెస్టు చేయలేదని, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కొంత సమయం ఇచ్చామని పేర్కొంది.
అదే సమయంలో భీమ్‌రెడ్డిని బంజారాహిల్స్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి కార్డియాలజిస్ట్‌తో చికిత్స అందించామని చెప్పింది. అయితే తమ విచారణకు భీమ్‌రెడ్డి సహకరించకపోవడంతోపాటు అక్రమాస్తుల విషయాలు బయటపెట్టకపోవడంతో అరెస్టు చేశామని స్పష్టం చేసింది. అలా చేయకుండా తన బినామీలను ప్రభావితం చేసే ప్రమాదముందని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ఇప్పటి వరకు పది బ్యాంకు ఖాతాలు, రెండు లాకర్లను గుర్తించిన ఏసీబీ అధికారులు వాటి వివరాలను సేకరిస్తున్నారు.
ఒకటిరెండు రోజుల్లో బ్యాంకు లాకర్లను తెరిచే అవకాశం ఉంది. ఆస్తులు, బినామీల వివరాలను తన వారసులకు వాట్సాప్ ద్వారా పంపినట్టు అధికారులు గుర్తించారు. ఇప్పటికే భీమ్‌రెడ్డి బినామీలను పిలిచి విచారిస్తున్న ఏసీబీ అధికారులు తదుపరి విచారణ నిమిత్తం భీమ్‌రెడ్డిని కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకోవాలని నిర్ణయించారు.


