ముందొచ్చింది.. ముఖం చాటేసింది! | Abundant rains in July | Sakshi
Sakshi News home page

ముందొచ్చింది.. ముఖం చాటేసింది!

Jun 26 2025 6:35 AM | Updated on Jun 26 2025 6:35 AM

Abundant rains in July

జూన్‌లో ఇప్పటివరకు 36 శాతం లోటు వర్షపాతం

కురవాల్సింది 10.54 సెం.మీ.. కురిసింది 6.72 సెం.మీ.

5 జిల్లాల్లోనే సాధారణ వర్షపాతం నమోదు

18 జిల్లాల్లో లోటు, 10 జిల్లాల్లో అత్యంత లోటు

జూలైలో సమృద్ధిగా వర్షాలు: వాతావరణ కేంద్రం

నైరుతి రుతుపవనాల కదలిక మందగించింది. సాగుకు కీలకమైన సమయంలో రాష్ట్రంలో వానలకు బ్రేక్‌ పడింది. సీజన్‌కు ముందు ఏప్రిల్, మే నెలల్లో భారీగా పడిన వర్షాలు.. తీరా వానాకాలం సీజన్‌ మొదలయ్యాక ముఖం చాటేశాయి. ఈ నెల 1వ తేదీ నుంచి బుధవా రం (25వ తేదీ) నాటికి రాష్ట్రంలో సగటున 10.54 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావాలి. కానీ, 6.72 సెంటీమీటర్లు మాత్రమే నమోదైంది. ఇది సాధారణం కంటే 36 శాతం లోటు నమోదు కావడం గమనార్హం.

వర్షపాత లోటు ఇలా..
సూర్యాపేట జిల్లాల్లో సాధారణం కంటే 73 శాతం లోటు వర్షపాతం నమోదైంది.

మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లాలో 72 శాతం, హైదరాబాద్‌ జిల్లాలో 70 శాతం లోటు వర్షపాతం ఉంది.

పెద్దపల్లి, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, జనగామ జిల్లాల్లో 60 శాతం పైబడి లోటు వర్షపాతం నమోదైంది.

5 జిల్లాల్లో మాత్రమే సాధారణ వర్షాలు కురిశాయి. 18 జిల్లాల్లో లోటు, మరో 10 జిల్లాల్లో అత్యంత లోటు వర్షపాతం రికార్డయ్యింది.

కుమురంభీం ఆసిఫాబాద్, నిజామాబాద్, మహబూబ్‌నగర్, వనపర్తి, నాగర్‌కర్నూల్‌ జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది.

ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, జయశంకర్‌ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, కామారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్, నల్లగొండ, ఖమ్మం, ములుగు, నారాయణపేట, జోగుళాంబ గద్వాల జిల్లాలు లోటు వర్షపాతం జాబితాలో ఉన్నాయి.

పెద్దపల్లి, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, జనగామ, మేడ్చల్‌–మల్కాజిగిరి, హైదరాబాద్, సూర్యాపేట జిల్లాలో అత్యంత లోటు వర్షపాతం రికార్డయ్యింది.

కారణాలు ఎన్నో..
సాధారణంగా నైరుతి సీజన్‌లో వర్షపాతానికి బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడన ద్రోణులు, ఉపరితల ఆవర్తనాలు కీలకం. కానీ, ఈ ఏడాది సీజన్‌లో ఇటువంటి వాతావరణ పరిస్థితులు ఇంకా ఏర్పడలేదు. అందుకే ఈ సీజన్లో ఇప్పటివరకు వర్షాలు ఆశించినంతగా లేవు. ఉష్ణోగ్రతలు పెరగటంతో వాతావరణంలో తేమ పెరిగి ఉక్కపోతకు కారణమైంది. మరో వారంపాటు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ చెబుతోంది. దీంతో ఈ నెలలో వర్షాల నమోదు ఆశించినంతగా ఉండవనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దాదాపు రెండుమూడు రోజులకోసారి వర్షాలు కురవాల్సి ఉండగా, చాలా ప్రాంతాల్లో ఏకంగా ఏడు నుంచి పన్నెండు రోజులకు పైబడి డ్రై స్పెల్స్‌ నమోదయ్యాయి.

జూలై నెల వానలే కీలకం..
రాష్ట్రంలో నైరుతి రుతుపవనాల కదలికలు చురుకుగా లేవు. సాధారణంగా ముందస్తుగా రుతుపవనాల రాకతో ఇలాంటి పరిస్థితులు ఏర్పడతాయి. వారం ముందే వచ్చి, మొదట్లో అత్యంత చురుకుగా కదిలినా.. ఆ తర్వాత కొంత అంతరం ఏర్పడింది. ఈ అంతరంతో వర్షాలకు కాస్త విరామం వచ్చినట్లైంది. కానీ వచ్చే నెల మొదటి వారం నుంచి వర్షాలు ఆశించినంతగా ఉంటాయని అంచనా వేశాం. జూలై నెలలో సమృద్ధిగా వర్షాలు కురిసే అవకాశం ఉంది.
శ్రావణిహైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారి 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement