తెలంగాణ సర్కార్‌ భారీ ప్లాన్‌! మూసీ నదిపై ఏకంగా 55 కిలోమీటర్ల ఎక్స్‌ప్రెస్‌ వే​​​​​​​

55 km on Expressway Moosey - Sakshi

గచ్చిబౌలి: కుటుంబ సమేతంగా సేద తీరడానికి అనువుగా జీహెచ్‌ఎంసీ పరిధిలోని చెరువులను అత్యాధునిక వసతులతో అభివృద్ధి చేస్తున్నామని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కె. తారక రామారావు తెలిపారు.  మూసీ నది మీదుగా రూ. 10 వేల కోట్ల వ్యయంతో 55 కిలోమీటర్ల మేర ఎక్స్‌ప్రెస్‌ వే నిర్మించనున్నట్లు చెప్పారు.

మంగళవారం హైదరాబాద్‌లోని ఖాజాగూడ పెద్ద చెరువు అభివృద్ధి పనులకు కేటీఆర్‌ శంకుస్థాపన చేశారు. ఆయన మాట్లాడుతూ ఓఆర్‌ఆర్‌ వెస్ట్‌ టు ఈస్ట్‌ మూసీ నదిపై ఎక్స్‌ప్రెస్‌ వే నిర్మాణం కోసం అధ్యయనం చేశామని, మూసీ సుందరీకరణతో ఆ ప్రాంతం రూపురేఖలు మారతాయన్నారు. 

నిర్మాణ సంస్థలు.. 50 చెరువుల దత్తత 
కార్పొరేట్‌ సామాజిక బాధ్యతలో భాగంగా జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ పరిధిలోని 50 చెరువులను అభివృద్ధి చేసేందుకు వివిధ నిర్మాణ సంస్థలు వాటిని దత్తత తీసుకున్నట్లు మంత్రి కేటీఆర్‌ తెలిపారు. నగరంలోని 185 చెరువుల అభివృద్ధిలో ‘క్రెడాయ్‌’ను భాగస్వామిని చేస్తున్నట్లు చెప్పారు.

హైదరాబాద్‌లోని చాలా చెరువుల్లో ప్రైవేటు పట్టాలు ఉన్నాయని, అయినా ప్రైవేటు భూముల యజమానులకు మరోచోట భూమి ఇస్తున్నామన్నారు. వారికి టీడీఆర్‌ కింద 200 శాతం విలువ కల్పిస్తున్నామని చెప్పారు. 13 చెరువులలో ఎఫ్‌టీఎల్‌ పట్టాలున్న వ్యక్తులకు 188 టీడీఆర్‌లు ఇచ్చి 115 ఎకరాల స్థలాన్ని స్వా«దీనం చేసుకున్నట్లు మంత్రి వివరించారు.

ఎఫ్‌టీఎల్‌ పట్టాలున్న వ్యక్తులను టీడీఆర్‌ తీసుకునే విధంగా ప్రోత్సహించాలని అధికారులను ఆదేశించారు. వరంగల్‌లో భద్రకాళి చెరువును అభివృద్ధి చేసినంత గొప్పగా దుర్గం చెరువు కూడా లేదని, నాగర్‌కర్నూల్‌ చెరువును ట్యాంక్‌బండ్‌లా అభివృద్ధి చేసి బుద్ధ విగ్రహం ఏర్పాటు చేశామన్నారు. సీఎస్‌ఆర్‌ నిధులిస్తే జిల్లా కేంద్రాలలో చెరువుల అభివృద్ధి చేపడతామన్నారు.

ఆఫీస్‌ స్పేస్‌లో మనమే నంబర్‌ వన్‌.. 
బెంగళూరు, చెన్నై, ముంబై, పుణే, ఢిల్లీని మించి 2022లో ఆఫీస్‌ స్పేస్‌లో దేశంలోనే నంబర్‌ వన్‌ సిటీగా హైదరాబాద్‌ నిలిచిందని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. తాను ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఓఆర్‌ఆర్‌ మీదుగా వస్తుంటే కనిపించిన భారీ భవనాలను చేస్తుంటే విదేశాలకు వెళ్లిన అనుభూతి కలిగిందన్నారు.

నగరంలో శాంతిభద్రతలు బాగుండటంతోపాటు జీవన వ్యయం తక్కువగా ఉండటం, క్వాలిటీ ఆఫ్‌ లివింగ్‌ బాగుండటం వల్లే హైదరాబాద్‌కు పెట్టుబడులు వస్తున్నట్లు తెలిపారు. 

250కిలోమీటర్ల మేర మెట్రోను విస్తరిస్తాం 
కేంద్రం సహకరించినా, సహకరించకపోయినా మెట్రో రైలును 250 కి.మీ. విస్తరిస్తామని మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు. రూ. 6,250 కోట్లతో మెట్రో ను రాయదుర్గం నుంచి శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు మూడేళ్లలో పూర్తి చేస్తామన్నారు.

లక్డీకాపూల్‌ నుంచి బీహెచ్‌ఈఎల్, నాగోల్‌ నుంచి ఎల్బీనగర్‌ వరకు మెట్రో విస్తరణకు కేంద్రం సహకరించట్లేదని  విమర్శించారు. యూపీలోని 10 నగరాల్లో మెట్రో ప్రాజెక్టులకు నిధులిస్తున్న కేంద్రం... తెలంగాణకు మొండిచేయి చూపుతోందని దుయ్యబట్టారు. 

రాచకొండలో ఫిలింసిటీ... 
ప్రపంచస్థాయి ఫిలింసిటీ ఏర్పాటుకు రాచకొండలో స్థలాన్ని గుర్తించామని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ఒలింపిక్స్‌ స్థాయిలో స్పోర్ట్స్‌ సిటీ తేవాలని సీఎం కేసీఆర్‌ దృష్టిలో ఉందన్నారు. వ్యాక్సిన్‌ క్యాపిటల్‌గా హైదరాబాద్‌ గుర్తింపు పొందిందని, ప్రపంచంలోని వ్యాక్సిన్లలో 35 శాతం ఇక్కడే ఉత్పత్తి అవుతున్నాయని చెప్పారు.

వచ్చే సంవత్సరంలో 50 శాతం వ్యాక్సిన్లు హైదరాబాద్‌లోనే తయారవుతాయన్నారు. లైఫ్‌సైన్స్‌ పరిశ్రమ 2030 నాటికి 250 బిలియన్‌ డాలర్ల స్థాయికి ఎదిగేలా ప్రణాళిక రూపొందించాలని నిర్దేశించినట్లు పేర్కొన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top