తెలంగాణ భవన్ వద్ద పోలీసులతో మాట్లాడుతున్న కేటీఆర్
అప్పులపై చర్చకు సవాల్ చేసిన సీఎం, మంత్రులు పారిపోయారు
జూపల్లి కోసం అన్నీ సిద్ధం చేసి 3 గంటలు వేచి చూశా.... బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు
హరీశ్‌రావు అరెస్టు, గన్‌పార్కుకు వెళ్లకుండా అడ్డుకోవడం పిరికితనం
ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ బండారం బట్టబయలు చేస్తాం
రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ కుమ్మక్కు రాజకీయాలకు పాల్పడుతున్నాయి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అప్పులపై బహిరంగ చర్చకు సవాల్ చేసిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఆయన మంత్రులు చర్చకు రాకుండా తోక ముడిచి పారిపోయారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు విమర్శించారు. మంత్రి జూపల్లి కృష్ణారావు చర్చకు వస్తానని చెప్పడంతో ప్రత్యేకంగా కుర్చి, శాలువా సిద్ధం చేసి మూడు గంటల పాటు వేచి చూసినా రాలేదన్నారు. గురువారం తెలంగాణ భవన్‌లో పార్టీ నేతలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ‘గన్‌పార్క్ వద్ద చర్చకు వెళ్లేందుకు సిద్ధమైతే హరీశ్‌రావుతో పాటు బీఆర్‌ఎస్ నేతలను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారు.
నన్ను కూడా తెలంగాణ భవన్ నుంచి బయటకు రానీయకుండా భారీగా పోలీసులను మోహరించారు. ఒకవైపు మంత్రులు సవాళ్లు విసురుతుంటే మరోవైపు పోలీసులతో మమ్మలను అడ్డుకోవడం ప్రభుత్వ పిరికితనానికి నిదర్శనం. కంచ¯న్‌బాగ్ పోలీస్ స్టేషన్‌కు తరలించిన పార్టీ నేతలను పరామర్శించేందుకు వెళ్లకుండా అడ్డుకోవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధం. చర్చించే ధైర్యం లేక ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టుకున్న తీరును రాష్ట్ర ప్రజలు గమనించారు..’అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
ప్రభుత్వ వైఫల్యాలపై త్వరలో సదస్సులు
‘రాష్ట్రంలో ’ఆర్‌ఆర్ టాక్స్’వసూళ్లపై ప్రధానమంత్రి వ్యాఖ్యల తర్వాత కూడా బీజేపీ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. అమత్, హోలోగ్రామ్ టెండర్లలో అవినీతి ఆరోపణలపై విచారణ ఎందుకు జరగడం లేదు? కాంగ్రెస్ ప్రభుత్వంలో బీజేపీ నేతలకు చెందిన సంస్థలకు కాంట్రాక్టులు ఎలా దక్కుతున్నాయో సమాధానం చెప్పాలి. కాంగ్రెస్–బీజేపీ కుమ్మక్కు రాజకీయాలు తెలంగాణ ప్రజలకు అర్థమయ్యాయి. ఆరు గ్యారంటీలు, 420 హామీలు, 14 డిక్లరేషన్ల పేరుతో కాంగ్రెస్ అన్ని వర్గాల ప్రజలను మోసం చేసింది. త్వరలో రైతు, యువజన, విద్యార్థి సదస్సులు నిర్వహించి ప్రభుత్వ వైఫల్యాలు, నెరవేర్చని హామీలపై రాష్ట్రవ్యాప్తంగా ప్రజలను చైతన్యవంతం చేస్తాం. ముఖ్యమంత్రి, మంత్రులు ఈరోజు చర్చ నుంచి తప్పించుకున్నా ప్రజల తరఫున బీఆర్‌ఎస్ పోరాటం ఆగదు..’అని కేటీఆర్ అన్నారు.
వెంటనే ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలి
‘ముఖ్యమంత్రి రేవంత్‌కు నిజంగా చర్చించే ధైర్యం ఉంటే వెంటనే ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలి. సభలో మైక్ కట్ చేయకుండా మాకు మాట్లాడే అవకాశం ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వ రెండున్నరేళ్ల పాలనలో జరిగిన వైఫల్యాలు, అవినీతి, ఎన్నికల హామీల అమలుపై పూర్తి వివరాలను ప్రజల ముందు పెడతాం. రాష్ట్ర అప్పుల విషయంలో సీఎం, డిప్యూటీ సీఎం పొంతన లేని గణాంకాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఆర్బీఐ, కాగ్ వెల్లడించిన లెక్కలే దీనికి ప్రామాణికం. బీఆర్‌ఎస్ పాలనలో చేసిన అప్పులపై వాస్తవాలు ప్రజలకు తెలిసినా కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం కాకి లెక్కలు చెప్పి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా శిఖండి రాజకీయాలు చేస్తోంది..’అని కేటీఆర్ మండిపడ్డారు.


