
గురువారం మెట్రో రైళ్లలో వెళ్లిన ప్రయాణికులు
సాక్షి,హైదరాబాద్: నగరంలోని వివిధ మెట్రో కారిడార్‌లలో గురువారం రికార్డు స్థాయిలో పయనించారు. భారీ వర్షం కారణంగా అత్యధిక మంది మెట్రో రైళ్లను ఆశ్రయించారు. దీంతో ఈ ఒక్కరోజే 5.36 లక్షల మంది ప్రయాణం చేసినట్లు ఎల్‌అండ్‌టీ హైదరాబాద్ మెట్రో అధికారులు తెలిపారు. గతంలో వివిధ సందర్భాల్లోనూ ప్రయాణికుల సంఖ్య 5 లక్షల మార్కును దాటింది. సాధారణంగా మెట్రో ప్రయాణికుల సంఖ్య 4.7 లక్షల నుంచి 4.9 లక్షల మధ్య నమోదవుతుంది.
చాలా రోజుల తర్వాత 5.36 లక్షల మంది ప్రయాణం చేసినట్లు అధికారులు తెలిపారు. రాయదుర్గం నుంచి అమీర్‌పేట్, నాగోల్ రూట్‌లో, ఎల్‌బీనగర్ నుంచి మియాపూర్ కారిడార్‌లో అత్యధిక మంది ప్రయాణం చేశారు. ప్రతి 3 నుంచి 5 నిమిషాలకు ఒకటి చొప్పున మెట్రో నడిచినప్పటికీ వేలాది మంది మెట్రో స్టేషన్‌లలోనే పడిగాపులు కాశారు. రద్దీ కారణంగా అన్ని రూట్లలో మెట్రో రైళ్లు కిక్కిరిసి నడిచాయి. గురువారం సాయంత్రం 5 నుంచి రాత్రి 10 గంటల వరకూ మెట్రో రైళ్లలో రద్దీ నెలకొంది.