పనిచేస్తున్న జిల్లాల నుంచి వెళ్లేందుకు ససేమిరా అన్న కానిస్టేబుళ్లు
వెళ్లాల్సిందేనని ఉత్తర్వులు జారీ చేసిన ఉన్నతాధికారులు
ఎస్సై, సీఐ, ఏఈఎస్‌ల బదిలీలకూ ఇవే నిబంధనలు అమలు చేయాలంటున్న ఉద్యోగ సంఘాలు
సాక్షి, హైదరాబాద్: ఎట్టకేలకు ఎనిమిదేళ్ల తర్వాత ఎక్సైజ్ శాఖలో పనిచేస్తున్న కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్లకు బదిలీలు జరిగాయి. రాష్ట్రంలోని కంటీజియస్ జిల్లాలు, జోన్ల వారీగా 1,586 మంది కానిస్టేబుళ్లు, 326 మంది హెడ్ కానిస్టేబుళ్లు కలిపి మొత్తం 1,912 మంది సిబ్బందికి శుక్రవారం బదిలీ ఉత్తర్వులు జారీ చేశారు. ఉత్తర్వులు అందుకున్న సిబ్బంది ఎట్టి పరిస్థితుల్లో మూడు రోజుల్లో బదిలీ అయిన స్థానంలో రిపోర్టు చేయాలని ఆ శాఖ కమిషనర్ సి. హరికిరణ్ ఆదేశించారు.
రెండేళ్లు పూర్తి చేసుకున్న వారికి...: వాస్తవా నికి, ఎక్సైజ్ శాఖలో 2018 జూన్‌లో సాధారణ బదిలీలు జరిగాయి. దాదాపు ఎనిమిదేళ్ల విరామం తర్వాత రెండేళ్ల సర్వీసును ఒకేచోట పూర్తి చేసుకున్న కానిస్టేబుళ్లు, హెడ్‌కానిస్టేబుళ్లకు బదిలీల ప్రక్రియ ఈనెల 4వ తేదీ నుంచి 10వ తేదీ వరకు సాగింది. అయితే, బదిలీలు చేసేంతవరకూ బాగానే ఉన్నా, బదిలీల కోసం రూపొందించిన మార్గదర్శకాలు కొన్ని జిల్లాల నుంచి అసమ్మతికి కారణమయ్యాయి. ప్రస్తుతం పనిచేస్తున్న జిల్లాలో ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదనే నిబంధన ఇందుకు కారణమైంది.
ముఖ్యంగా సంగారెడ్డి, నిజామాబాద్, భద్రాద్రి తదితర జిల్లాల్లో కొందరు సుదూర ప్రాంతాలకు బదిలీ కావాల్సి వచ్చింది. దీంతో తాము పనిచేస్తున్న జిల్లాల్లో నాన్‌ఫోకల్ స్థానాలకు పంపినా సరే, జిల్లా వదిలిపెట్టేది లేదని కొందరు భీష్మించుకున్నారు. ఈ ప్రక్రియ కోర్టు మెట్లు కూడా ఎక్కింది. కానీ కోర్టు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు. ఎక్సైజ్ మంత్రితోపాటు ముఖ్యమంత్రి కార్యాలయం కూడా జోక్యం చేసుకుందని, అయినా పట్టువదలని విక్రమార్కుడిలా కమిషనర్ హరికిరణ్ ఈ ప్రక్రియను పూర్తి చేశారనే చర్చ ఎక్సైజ్ వర్గాల్లో జరుగుతోంది.
⇒ త్వరలోనే ఎక్సైజ్ ఎస్సైలు, సీఐలు, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ల (ఏఈఎస్) బదిలీలు కూడా జరగనున్నాయి. వీటిలో కూడా ఎక్కడా రాజకీయ సిఫారసులను ఆమోదించొద్దని, నిబంధనల ప్రకారం జోన్ల వారీగా స్థాన చలనం చేయాలని, అప్పుడే శాఖలో పారదర్శకత అమలవుతున్నట్టు భావిస్తామని ఉద్యోగ సంఘాలు వ్యాఖ్యానిస్తుండడం గమనార్హం.


