విలీనం తర్వాత 12 మందికి ఉరిశిక్ష..చివరి క్షణాల్లో దిగొచ్చి.. | Sakshi
Sakshi News home page

విలీనం తర్వాత 12 మందికి ఉరిశిక్ష..చివరి క్షణాల్లో దిగొచ్చి..

Published Sat, Sep 17 2022 5:09 PM

12 Nalgonda People Life Sentence After Hyderabad state Merge In India - Sakshi

సాక్షి, మిర్యాలగూడ, కోదాడ: నిజాం నవాబు భారత ప్రభుత్వానికి లొంగిపోయిన తర్వాత  ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని అక్కినెపల్లి, షా అబ్దుల్లాపురం గ్రామాల్లో జరిగిన దొరల, రజాకార్ల హత్య కేసులో నంద్యాల శ్రీనివాస్‌రెడ్డి (నకిరేకల్‌ మాజీ ఎమ్మెల్యే), దోమల జనార్ధన్‌ రెడ్డి, గార్లపాటి రఘుపతిరెడ్డి, దూదిపాల చినసత్తిరెడ్డి, మేర హనుమంతు, మాగి వెంకులు, దాసరి నారాయణరెడ్డి, వడ్ల మల్లయ్య, ఎర్రబోతు రాంరెడ్డి, మిర్యాల లింగయ్య, కల్లూరి ఎల్లయ్య, గులాం దస్తగిరికి ప్రత్యేక ట్రిబ్యునల్‌ 1949 ఆగస్టు 13, 14న  మరణశిక్ష వేసింది.

ఉరిశిక్ష పడిన వెంకులు (14), ఎర్రబోతు రాంరెడ్డి(15), నంద్యాల శ్రీనివాసరెడ్డి (20) తోపాటు నల్లా నర్శింహులు (22) నల్లగొండ జైల్లో ఉండగా టైమ్‌ పత్రికకు చెందిన ఓ మహిళా జర్నలిస్టు వారిని కలిసి మైనర్‌ అయిన ఎర్రబోతు రామిరెడ్డి ఫొటోతో వ్యాసం రాసింది. అది పెను సంచలనంగా మారింది.

లండన్‌ న్యాయవాది డీఎన్‌ ప్రిట్, బొంబాయ్‌ నుంచి డేనియల్‌ లతీఫ్, గణేష్‌ షాన్‌బాగ్‌ వంటి న్యాయవాదులు  స్థానిక న్యాయవాది మనోహర్‌లాల్‌ సక్సేనాతో కలిసి మరణశిక్ష ఆపేందుకు ప్రయత్నించారు. అంతర్జాతీయంగా ఉరిశిక్ష లకు వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తాయి. జెకొస్లోవేకియాలో 10 వేల మందితో భారీ నిర్వహించారు. దీంతో అప్పటి రాష్ట్రపతి బాబు రాజేంద్రప్రసాద్‌ క్షమాభిక్షతో మరణశిక్ష కాస్తా యావజ్జీవ శిక్షగా మారింది. 1956లో కొందరు, దీంతో 1958లో మరికొందరు విడుదలయ్యారు.  

నిజాంపై గర్జించిన కృష్ణా జిల్లా 
సాక్షి, అమరావతి:  తెలంగాణ సాయుధ పోరాటాన్ని ఉధృతం చేయడంలో, రజాకార్లను ఎదుర్కోవడంలో కృష్ణా జిల్లాకు ఘనమైన చరిత్ర ఉంది. 1944లో మొదలైన తెలంగాణ సాయుధ పోరాటం దొడ్డి కొమరయ్యను రజాకార్లు కాల్చేయడంతో తీవ్రరూపం దాల్చింది. నల్లగొండ జిల్లాలో మొదలైన ఉద్యమం క్రమంగా విస్తరించింది. కృష్ణా జిల్లా నుంచి అనేక మంది నేతలు ఈ సాయుధ పోరుకు ఊతమిచ్చారు. చండ్ర రాజేశ్వరరావు, పుచ్చలపల్లి సుందరయ్య విజయవాడ నుంచే ఉద్యమానికి దిశానిర్దేశం చేశారు.

సోవియట్‌ యూనియన్‌ తరహాలో విజయవాడలో ‘కమ్యూన్‌’ఏర్పాటు చేశారు. వడిసెలు, రాళ్లు, కత్తులు వంటి ఆయుధాల ప్రయోగం, తుపాకీ పేల్చడంలో శిక్షణ ఇచ్చారు. పగలంతా కలిసికట్టుగా శ్రమ చేసి సంపాదించిన సొమ్ముతో ఒకే చోట వండుకుని భోజనాలు చేసేవారు. రాత్రి సమయాల్లో యుద్ధ విద్యల్లో శిక్షణ పొందేవారు. ఇక్కడ శిక్షణ పొంది వెళ్లి నల్గొండ జిల్లాలో దళాలు ఏర్పాటు చేశారు. దళాల నేతృత్వంలోనే సాయుధ దాడులు జరిగాయి. ఈ పోరాటాల్లో జిల్లాకు చెందిన 13 మంది ప్రాణత్యాగాలు చేశారు.  

‘దారి’ చూపిన ‘మెతుకుసీమ’
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: భారత ప్రభుత్వం హైదరాబాద్‌ రాజ్యంపై పోలీసు చర్య చేపట్టాలని నిర్ణయించిన రోజులవి. అప్పటి కేంద్ర­హోంమంత్రి సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ చొరవతో ఇండియన్‌ యూనియన్‌ సైన్యం హైదరాబాద్‌ రాజ్యాన్ని చుట్టుముట్టింది. ఉత్త­రాన ఉన్న ఔరంగాబాద్‌ వైపు నుంచి సైనికచర్య మొదలైంది. ఉమ్మ­డి మెదక్‌ జిల్లా మీదుగానే హైదరాబాద్‌ రాజ్యంలోకి ప్రవేశించింది.

అదెలా జరిగిందంటే..
నిజాం ప్రైవేట్‌ సైన్యం అయిన రజాకార్లు లాతూర్‌(మహారాష్ట్ర) నుంచి జహీరాబాద్‌ (సంగారెడ్డి జిల్లా)కు రైలులో బయలుదేరేందుకు సిద్ధమవుతుండగా ఒక్కసారిగా భారత సైన్యం బాంబుల మోత మోగించింది. దీంతో రజాకార్లు రైలు దిగి పరుగెత్తారు. ట్రక్కుల్లో పారిపోయారు. కొన్నిట్రక్కులు అదుపుతప్పి రోడ్డు పక్కన గుంతల్లో కూరుకుపోయాయి. అప్పటికే దౌల్తాబాద్, హుమ్నాబాద్, జాల్న ప్రాంతాలు భారతసైన్యం వశమయ్యాయి. 

1948 సెప్టెంబర్‌ 16
భారత సైన్యం జహీరాబాద్‌ వైపు రోడ్డుమార్గంలో వస్తుండగా రజాకార్లు ఎక్కెల్లి (ప్రస్తుతం కర్ణాటకలో ఉంది) వంతెనను కూల్చేశారు. అయితే భారత సైన్యం తాత్కాలిక వంతెన నిర్మించుకుని ముందుకు సాగడంతో నిజాంసేన చెల్లాచెదురైంది. ఇలా జహీరాబాద్‌ను భారత సేనలు వశపరుచుకున్నాయి.

1948 సెప్టెంబర్‌ 17
భారతసైన్యం జహీరాబాద్‌ నుంచి హైదరాబాద్‌ వైపు వస్తుండగా పటాన్‌చెరు ప్రాం­తంలో రజాకార్లు రోడ్డు­కు ఇరువైపులా పేలుడు పదార్థాలు ఉంచారు. అప్రమత్తమైన భారతసైన్యం రూట్‌ మార్చి బొల్లారం మీదుగా ముందుకు సాగాయి.

1948 సెప్టెంబర్‌ 18 (సాయంత్రం 4 గంటలు): భారత సైన్యం బొల్లారం చేరింది. నిజాం సైన్యాధ్యక్షుడైన ఎల్‌.ఎద్రూస్‌ తన ఆయుధాలను వీడి భారత సైన్యం మేజర్‌ జనరల్‌ జేఎన్‌ చౌదరి ఎదుట లొంగిపోయారు. దీంతో ప్రజలు జయజయ ధ్వానాలతో భారత సైనికులకు స్వాగతం పలికారు. స్వేచ్ఛా స్వాతంత్య్రాలు పొందామని ఆనందోత్సవాలు చేసుకున్నారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement