
సాక్షి, హైదరాబాద్: ఓవైపు ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల వద్దకు తీసుకెళ్తూనే మరోవైపు పార్టీ బలోపేతానికి బాగా పనిచేయాలని మంత్రి కేటీఆర్ జీహెచ్‌ఎంసీలోని బీఆర్‌ఎస్ కార్పొరేటర్లకు పిలుపునిచ్చారు. ఈ నెల 16న నగరంలోని 150 వార్డుల్లో వార్డు కార్యాలయాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రగతి భవన్‌లో పార్టీ కార్పొరేటర్లతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రానున్న సంవత్సరకాలం పాటు పార్టీ కార్యక్రమాలు విస్తృతంగా ఉంటాయని, వాటన్నింటినీ విజయవంతం చేస్తూ పార్టీని బలోపేతం చేసే కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని ఆదేశించారు. పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలన్నింటినీ విజయవంతం చేయాలన్నారు. సమావేశాల్లో మరింత చురుగ్గా పాల్గొనాలని, పార్టీ బలోపేతం ద్వారానే మనం రాష్ట్రంలో మరోసారి అధికారంలోకి వస్తామన్నారు. కార్పొరేటర్ల సారథ్యంలో తమతమ వార్డుల్లో పార్టీని ఎన్నికలకు సమాయత్తం చేయాలన్నారు.
సంక్షేమ పథకాలపై విస్తృతంగా ప్రచారం..
బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజలకు అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలతోపాటు నగరాభివృద్ధికి పాటుపడుతున్న తీరును విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని మంత్రి మార్గదర్శనం చేశారు. వార్డు కార్యాలయాల ఏర్పాటు ద్వారా ప్రజలకు మరిన్ని సేవలందిస్తూ వారితో మమేకమయ్యే అవకాశం ఏర్పడుతుందన్నారు. నగరంలో సుపరిపాలన మరింత బలోపేతం కానుందన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కార్పొరేటర్లు వార్డు కార్యాలయాల వ్యవస్థను విస్తృతంగా ఉపయోగించుకోవాలని సూచించారు. దాదాపు ఆర్నెల్లలో రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనుండటం తెలిసిందే. ఎన్నికల్లో బీఆర్‌ఎస్ విజయం తథ్యమని మంత్రి పునరుద్ఘాటించారు. రాబోయే నెలల్లో జరగనున్న పార్టీ కార్యకలాపాలపై కార్పొరేటర్లకు అవగాహన కల్పించారు.
వికేంద్రీకరణతో ప్రజలకు మేలు..
పరిపాలన వికేంద్రీకరణతో ప్రజలకు ఎంతో సదుపాయమని కేటీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు మరిన్ని సంక్షేమ ఫలాలను, ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు వేగంగా అందించాలనే తలంపుతోనే వికేంద్రీకరణ సంస్కరణలు చేపట్టారని చెప్పారు. అందులో భాగంగానే కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు,మండల కేంద్రాలు,గ్రామపంచాయతీలు ఏర్పాటుచేసి ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజల ఇంటిముందుకు వెళ్లేలా చేశారన్నారు. అదే స్ఫూర్తితో జీహెచ్‌ఎంసీలోనూ వార్డు కార్యాలయాలను ఏర్పాటు చేస్తున్నామని, తద్వారా నగర ప్రజలకు సత్వరమే కాక మరిన్ని సేవలందుతాయనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.
ఇలాంటి వార్డు కార్యాలయ వ్యవస్థ దేశంలో మరెక్కడా లేదన్నారు. వార్డు కార్యాలయాల ప్రారంభోత్సవాలకు తమ పరిధిలోని రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లు, కాలనీ సంఘాలు, ప్రముఖులను కలుపుకొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. వార్డు కార్యాలయ వ్యవస్థపై కార్పొరేటర్లకు అవగాహన కల్పించేందుకు జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో ఒక విస్తృతస్థాయి సమావేశాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. సమావేశంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఎమ్మెల్సీలు నవీన్‌రావు, శంభీపూర్ రాజు, మేయర్ విజయలక్ష్మి, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
కార్పొరేటర్లకు క్లాస్
కొన్ని నియోజకవర్గాల్లో కార్పొరేటర్లకు ఎమ్మెల్యేలతో విభేదాలుండటాన్ని ఈ సందర్భంగా కేటీఆర్ ప్రస్తావించారు. విశ్వసనీయ సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. ‘మీరు ఎమ్మెల్యేలతో పోటీపడుతున్నారు. మీకు మీరే ఎమ్మెల్యేలుగా భావిస్తున్నారు. పార్టీ ఇచ్చిన పని చేయండి. మీ సేవల్ని పార్టీ గుర్తిస్తుంది. జాతీయ పార్టీగా ఎదుగుతున్న క్రమంలో ఈ వైఖరి మంచిది కాదు. ఎవరికి వారే ఎమ్మెల్యేలనుకుంటే పార్టీ నష్టపోతుంది. అందరూ కలిసిమెలిసి పనిచేయాలి. ఎవరికి టిక్కెట్ ఇవ్వాలన్నది సమయం వచ్చినప్పుడు పార్టీ నిర్ణయిస్తుంది.
ఎమ్మెల్యేలతో మీకు ఏవైనా సమస్యలుంటే నాదృష్టికి తెండి. రాబోయే రోజులు ఎంతో కీలకమైనవైనందున అందరూ కలిసిమెలిసి పనిచేయాలని స్పష్టం చేశారు. చాలామంది కార్పొరేటర్లు జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ సమావేశాలకు హాజరు కాకపోవడాన్ని సైతం మంత్రి తప్పుబట్టారు. అన్ని సమావేశాలకు తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశించారు. మేయర్ సైతం తరచూ టీ, కాఫీ చర్చల వంటివి ఏర్పాటు చేయాలని.. అందరూ పార్టీకోసం పని చేయాలన్నారు. ప్రజా సమస్యలు విస్మరించొద్దు. వార్డు కార్యాలయాలకు వచ్చే ప్రతి ఫిర్యాదు పరిష్కారమయ్యేలా చూడాలి. మీరు చెప్పేవి చేసేలా అధికారులుండాలి అని చెప్పినట్లు సమాచారం.
చదవండి: డెక్కన్ క్రానికల్ వెంకట్రామ్‌రెడ్డి అరెస్ట్