సాక్షి, చైన్నె : తమిళనాడు నుంచి ఇతర రాష్ట్రాలకు గ్రానైట్ రాళ్లు, కంకర, ఇసుక, ఎం శాండ్, రాళ్లు వంటి ఖనిజాల రవాణాకు నిషేధం విధిస్తూ సీఎం విజయ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో తమిళనాడు నుంచి ఇతర రాష్ట్రాల్లోకి ఖనిజాలతో వెళ్లాల్సిన వాహనాలన్నీ సరిహద్దులకే పరిమితం చేశారు. వివరాలు.. తమిళనాడు నుంచి నల్లరాళ్లు (గ్రానైట్/రాళ్లు), కంకర (జల్లి), ఎం–శాండ్ వంటి ఖనిజాలను ఇతర రాష్ట్రాలకు అక్రమంగా తరలించే వాళ్లు అధికమయ్యారు.కొన్ని క్వారీలు ఇక్కడతవ్వకాలకు అనుమతి పొంది, అధికారుల సహకారంతో రాష్ట్రాల సరిహద్దులను దాటిచ్చేస్తున్నాయి. ప్రధానంగా తమిళనాడులోని తిరున్వేలి, , తెన్కాసి, కోయంబత్తూర్ తదితర జిల్లాల నుండి కేరళకు పెద్ద ఎత్తున ఖనిజ సంపద అక్రమంగా తరలి వెళ్తున్నది. గత డీఎంకే పాలనలో అధికార పార్టీకి చెందిన ఓ గాడ్‌ఫాదర్ మద్దతుతో ఈ అక్రమ రవాణా యదేచ్చగా సాగుతూ వచ్చింది.
తాజాగా అధికారంలోకి వచ్చిన సీఎం విజయ్ ప్రభుత్వం ఈ అక్రమ రవాణాకు చెక్ పెట్టడమే లక్ష్యంగా దృష్టి పెట్టింది. కొన్ని క్వారీలను స్వయంగా గనుల శాఖ మంత్రే పరిశీలించినప్పటికీ, అక్రమ తవ్వకాలు, స్మగ్లింగ్ మాత్రం తగ్గలేదు తమిళనాడు నుండి కేరళకు వెళ్లే జాతీయ రహదారి విస్తరణ పనుల కారణంగా ఆ రోడ్డులో ఖనిజాల రవాణాను నిషేధించినప్పటికీ స్మగ్లింగ్ ఆగలేదు. బదులుగా ప్రత్యామ్నాయ మార్గాల్లో అక్రమ రవాణా కొనసాగింది. అదే సమయంలో ఈ అక్రమ రవాణా రూపంలో తమిళనాడులో పై ఖనిజాలకు కొరత అన్నది తప్పలేదు. దీంతో తమిళనాడు నుంచి రాళ్లు, కంకర, ఎం–శాండ్ వంటి ఖనిజాలను ఇతర రాష్ట్రాలకు తరలించడంపై 3 నెలల పాటు తాత్కాలిక నిషేధం విధిస్తున్నట్లు తాజాగా ప్రభుత్వ ప్రకటించింది. రాష్ట్రంలో పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో మంగళవారం కన్యాకుమారి, సెంగోట్టై, తేని , కోయంబత్తూరు వైపుగా కేరళకు ఉన్న మార్గాలలో ఎక్కడిక్కడక భారీ లారీలను ఆపేశారు. ఖనిజాలతో వెళ్లే లారీలను అనుమతించబోమని అధికారులు స్పష్టం చేసి వెనక్కు పంపించే పనిలో పడ్డారు. దీంతో సరిహద్దులలోని చెక్ పోస్టుల వద్ద ఈ వాహనాలు బారులుదీరాయి.
శాశ్వత నిషేధమే లక్ష్యం
ఇతర రాష్ట్రాలకు ఖనిజాల రవాణాపై తాత్కాలికంగా కాకుండా శాశ్వత నిషేధం విదించాలని పిఎంకే అధ్యక్షుడు అన్బుమణి రాందాసు ప్రభుత్వాన్ని కోరారు. ఈ నిషేధాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలని, తమిళనాడు నుంచి కేరళ వెళ్లే అన్ని రహదారుల్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసి ఖనిజాల స్మగ్లింగ్ జరుగుతోందో లేదో పర్యవేక్షించాలని డిమాండ్ చేశారు. అనుమతి పొందిన వాళ్లు సైతం ఇతర రాష్ట్రాలకు తరలింపునకు నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం ఆహ్వానిస్తున్నామని, అయితే, ప్రస్తుతం 3 నెలలకు మాత్రమే విధించిన ఈ నిషేధాన్ని శాశ్వత నిషేధంగా మార్చాలని కోరారు. అప్పుడు ఖనిజ దోపిడీ, అక్రమ రవాణా పూర్తి స్థాయిలో కట్టడి చేయగలమన్నారు. ఇప్పటి వరకు జరిగిన దోపిడిపై సీబీఐ విచారణకు చర్యలు తీసుకోవాలని కోరారు.


